ఇంటర్నెట్‌డెస్క్: తాత్కాలికంగా ఎదురయ్యే నగదు సమస్యల పరిష్కారానికి బంగారు రుణాలు సహాయపడతాయి. ఈ రుణాలు త్వరగా పొందొచ్చు. బంగారంపై రుణాలను జారీచేసేందుకు బ్యాంకులు కూడా క్రెడిట్ స్కోర్లను పరిగణనలోకి తీసుకోవు. బంగారంపై రుణం ఇచ్చేటప్పుడు రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయవు. ఇటువంటి రుణాలు చిన్న వ్యాపార యజమానులకు తాత్కాలిక నగదు సమస్యలకు లేదా అత్యవసర డబ్బు అవసరమైనప్పుడు సహాయపడతాయి. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) బంగారు రుణాలు అందజేస్తుంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలైన మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటివి బంగారు రుణ వ్యాపారంపైనే దృష్టి సారించాయి కాబట్టి అవి త్వరగా రుణాన్ని పంపిణీ చేస్తుంటాయి.
ఎన్బీఎఫ్సీ vs బ్యాంకులు
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బ్యాంకుల తక్కువ వడ్డీ రేట్లకే రుణం మంజూరు చేస్తాయి. ఎన్‌బీఎస్‌సీలు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తాయి. మీ బంగారానికి బ్యాంకుల కంటే ఎన్‌బీఎస్‌సీలు ఎక్కువ విలువ కట్టడమే కారణం. ఉదాహరణకు రుణ గ్రహీత దగ్గర 20 గ్రాముల బంగారు హారం ఉందనకుందాం. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ రెండూ రుణ గ్రహీతకు బంగారం విలువలో 75 శాతం అందిస్తుంటాయి. ఒక బ్యాంక్ మీ బంగారాన్ని 10 గ్రాములకు రూ.46,500 చొప్పున విలువ కడితే, ఎన్‌బీఎఫ్‌ఎసీ దాన్ని ఎక్కువ విలువైనదిగా పరిగణించొచ్చు. బంగారానికి రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీ లోహానికి విలువ ఇచ్చేటప్పుడు వేగంగా రుణాలు ఇవ్వగలదు. బ్యాంకుల విషయానికొస్తే నిబంధనలను అనుసరించి రుణాలను జారీ చేస్తాయి కాబట్టి జాప్యం జరిగే అవకాశం ఉంది.
ఎలాంటి బంగారంపై ఇస్తారు...?
బంగారం కనీస స్వచ్ఛత 18 క్యారెట్లు ఉండాలి. చాలామంది రుణదాతలు ఈ స్వచ్ఛత కంటే తక్కువ బంగారాన్ని తాకట్టు పెట్టుకోరు. చాలా బ్యాంకులు గోల్డ్ బార్స్‌పై రుణాలు ఇవ్వవు. ఆభరణాలు, బంగారు నాణేలను తాకట్టు పెట్టవచ్చు. అయితే తనఖా పెట్టినప్పుడు ఆభరణాల్లో భాగమైన వజ్రాలు, రాళ్లకు విలువ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం బంగారం విలువ మాత్రమే లెక్కిస్తారు. నాణేల విషయంలో అధిక స్వచ్ఛత అడగొచ్చు. బరువుపై పరిమితులూ ఉండొచ్చు. చాలామంది 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న నాణేలను అంగీకరించరు.
ఛార్జీలు.. చెల్లింపులు
రుణాలను తిరిగి చెల్లించడంలో చాలావరకు ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు. కొన్ని బ్యాంకులు ఆ ఛార్జీలు విధిస్తున్నప్పటికీ... రుణంలో ఒక శాతంగా మాత్రమే ఉంటాయి. వాల్యుయేషన్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండొచ్చు. రుణం తిరిగి చెల్లించే విషయంలో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. నెలవారీ వాయిదాలలో (ఈఎంఐ) చెల్లించొచ్చు. లేదా రుణ కాలపరిమితి ఉన్నంతవరకు వడ్డీని మాత్రమే చెల్లించి, చివర్లో ఒకేసారి మొత్తం రుణం చెల్లించవచ్చు. రుణదాతలు, ముఖ్యంగా ఎన్బీఎఫ్సీలు రుణ మొత్తాన్ని పంపిణీ చేయడానికి ముందు వడ్డీ భాగాన్ని తగ్గిస్తుంటాయి.
తిరిగి చెల్లించకపోతే...?
రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించలేకపోతే... రుణదాతలకు మీ బంగారాన్ని విక్రయించే హక్కు ఉంటుంది. అలాగే, బంగారం ధర పడిపోతే, రుణదాత అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని మిమ్మల్ని అడగొచ్చు. రుణం- బంగారం విలువ నిష్పత్తిని ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కొనసాగించాలని బ్యాంకులు కోరుతుంటాయి. అంటే, వారి దగ్గరున్న బంగారం విలువ.. మీకు ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువగా ఉండాలి.
బంగారు రుణాలు సౌకర్యవంతంగా ఉంటాయి గానీ, మీరు తాత్కాలిక నగదు ప్రవాహ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే ఎంచుకోండి. ఇల్లు కొనడం వంటి పెద్ద ఖర్చులకు నిధులు సమకూర్చడానికి తీసుకోవద్దు. రుణ చెల్లింపు గడువు సాధ్యమైనంత తక్కువగా పెట్టుకోండి.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?