స్థిరాస్తిలో పెద్ద కంపెనీలు రాణిస్తున్నాయ్‌ - Realty sector witnessing kshaped recovery Report
close

Updated : 23/02/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్థిరాస్తిలో పెద్ద కంపెనీలు రాణిస్తున్నాయ్‌

పీకల్లోతు కష్టాల్లో చిన్న సంస్థలు: ఇక్రా

ముంబయి: కొవిడ్‌ తదుపరి స్థిరాస్తి రంగంలో ఇంగ్లిష్‌ అక్షరం ‘కె’ ఆకారంలో (ధనికులు మరింత ధనవంతులవడం, పేదలు ఇంకాస్త పేదవాళ్లవడం) రికవరీ కనిపిస్తోందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. రుణాల లభ్యత సులభతరం కావడం, గిరాకీ స్థిరీకరణ వంటివి ఈ రంగంలో పెద్ద సంస్థలు బాగా ఎదగడానికి దోహదం చేస్తుండగా, చిన్న స్థాయి కంపెనీలు మాత్రం పీకల్లోతు కష్టాలు ఎదుర్కొంటున్నాయని తేల్చింది. అయితే చిన్న కంపెనీల వాటాయే 80 శాతం కావడంతో,  స్థిరాస్తి రంగంపై అధిక భారం పడుతోందని వివరించింది. నివేదిక ముఖ్యాంశాలివీ..

అగ్ర శ్రేణి నమోదిత 10 కంపెనీలు డిసెంబరు త్రైమాసికంలో 61 శాతం వృద్ధి నమోదు చేయగా, మొత్తం స్థిరాస్తి విపణి మాత్రం కొవిడ్‌ ముందున్న స్థాయి కంటే 24 శాతం క్షీణత నమోదు చేసింది.

 ‘కె’ ఆకార రికవరీ అనేది స్వాభావిక అసమానతలను సూచిస్తోంది. ఇక్కడ ధనవంతులే మరింత ధనవంతులవడానికి ఆస్కారం ఉంటుంది. మహమ్మారి తరవాత ఈ పద బంధాన్ని చాలా మంది పరిశీలకులు వినియోగించారు. ఎందుకంటే కొవిడ్‌ తరవాత పేదలు, వలస కార్మికులు మరింతగా దెబ్బతిన్నారు.

 నివాస గృహాల (రెసిడెన్షియల్‌) స్థిరాస్తి రంగంలో వేగవంతమైన స్థిరీకరణ మూలంగా కె-ఆకారంలో రికవరీ కనిపిస్తోంది. నమోదిత సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో 21 శాతానికి పైగా మార్కెట్‌ వాటాను పెంచుకున్నాయి.

 కొత్త ప్రాజెక్టుల ప్రారంభ పరంగా చూసినా, 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికం నాటికి విపణి వాటా 11 శాతం పెరిగింది.

 గిరాకీ స్థిరీకరణ, మంచి రుణ లభ్యత పెద్ద కంపెనీలకు ప్రయోజనం చేకూర్చింది.

 మొత్తం స్థిరాస్తి రంగం చూస్తే, దేశంలోని 8 ప్రధాన నగరాల్లో కొవిడ్‌-19 తరవాత తొలి త్రైమాసికంలో గృహ విక్రయాలు 62 శాతం మేర క్షీణించాయి. డిసెంబరు త్రైమాసికంలో మాత్రం విక్రయాల క్షీణత 24 శాతానికి పరిమితమైంది.

 ‘కొవిడ్‌కు ముందు.. అనుకున్న సమయానికి, నాణ్యతతో ప్రాజెక్టులు పూర్తి చేసిన డెవలపర్ల వైపే ప్రస్తుతం గృహ కొనుగోలుదార్లు మొగ్గు చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా మంచి విక్రయాలు నమోదు చేసిన పెద్ద, నమోదిత కంపెనీలే కొవిడ్‌ తరవాత కూడా గణనీయ స్థాయిలో విక్రయాలు, వసూళ్లు నమోదు చేశాయి. ఒకవైపు నగదు లభ్యత సంక్షోభం, మరోవైపు సరఫరా-గిరాకీ సమస్యలున్నా ఈ సంస్థలకు ఆదరణ లభించింద’ని ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శుభమ్‌ జైన్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి...
ఉమ్మడిగా ఇంటిని కొనుగోలు చేయ‌డం వలన క‌లిగే ప్రయోజ‌నాలు...

గృహ‌రుణాల‌పై వ‌ర్తించే ఛార్జీలేంటో తెలుసా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని