Reliance: రిలయన్స్‌ లాభం రూ.13,680 కోట్లు - Reliance industries q2 results
close

Updated : 23/10/2021 09:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Reliance: రిలయన్స్‌ లాభం రూ.13,680 కోట్లు

 రూ.1,91,532 కోట్లకు ఆదాయం
లాభంలో 43%, ఆదాయంలో 49% వృద్ధి
రాణించిన చమురు, రిటైల్‌ వ్యాపారాలు
దీపావళికి జియోఫోన్‌ నెక్ట్స్‌

కరోనా ఉద్ధృతి తగ్గడంతో కంపెనీ బలమైన ఫలితాలు నమోదు చేసింది. రిలయన్స్‌ వ్యాపారాల బలం, భారత్‌, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల రికవరీని ఇది సూచిస్తోంది. రిటైల్‌ విభాగంలో నిర్వహణ, ఆర్థిక పనితీరు మెరుగైంది. ఓ2సీ, డిజిటల్‌ సేవల విభాగాల్లో స్థిర వృద్ధి సాధించాం. ఉత్పత్తులకు గిరాకీకి తోడు, రవాణారంగ ఇంధన మార్జిన్లు అధికం కావడం ఓ2సీ వ్యాపారానికి కలిసొచ్చాయి. సౌర, హరిత ఇంధన రంగాల్లో అత్యుత్తమ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాం. 2035 నాటికి శూన్య కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని మరింత బలంగా విశ్వసిస్తున్నాం.

- ముకేశ్‌ అంబానీ, ఛైర్మన్‌, ఎండీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌


దిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సెప్టెంబరు త్రైమాసికంలో అదరగొట్టింది. చమురు నుంచి రిటైల్‌ వరకు అన్ని రంగాలు రాణించడంతో ఏకీకృత ప్రాతిపదికన రూ.13,680 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.9,567 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. షేరుపై లాభం రూ.14.84 నుంచి రూ.20.88కు పెరిగింది. ముడిచమురు ధరలు గణనీయంగా పెరగడం, టెలికాం విభాగంలో వినియోగదారుపై సగటు ఆదాయం పెరగడం వంటి అంశాలు సంస్థ లాభాన్ని పెంచాయి. మొత్తం ఆదాయం 49 శాతం పెరిగి రూ.1,91,532 కోట్లకు వృద్ధి చెందింది.

ఓ2సీ విభాగం భళా
గిరాకీ రికవరీతో వరుసగా అయిదో త్రైమాసికంలోనూ ఓ2సీ విభాగం మెరిపించింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఎబిటా 4 శాతం పెరిగి రూ.12,720 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే 43.9 శాతం వృద్ధి నమోదైంది. చమురు- గ్యాస్‌ విభాగ ఆదాయం 363 శాతం వృద్ధితో రూ.1644 కోట్లకు చేరగా, ఎబిటా రూ.1071 కోట్లుగా నమోదైంది. కేజీ-డీ6 బ్లాక్‌లోని శాటిలైట్‌ క్లస్టర్‌ క్షేత్రాల్లో ఉత్పత్తి ప్రారంభం కావడంతో రోజువారీ ఉత్పత్తి       18 మిలియన్‌ ప్రామాణిక క్యూబిక్‌ మీటర్లకు చేరింది.

జియో ప్లాట్‌ఫామ్స్‌ లాభం రూ.3728 కోట్లు
జియో ప్లాట్‌ఫామ్స్‌ లాభం రూ.రూ.3019 కోట్ల నుంచి  23.48 శాతం పెరిగి రూ.3,728 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.21,708 కోట్ల నుంచి రూ.23,222 కోట్లకు చేరింది. ఇంటర్‌కనెక్ట్‌ వినియోగ ఛార్జీలు సవరించాక, స్థూల ఆదాయం 15.2 శాతం పెరిగింది. నిర్వహణ ఆదాయం రూ.18,496 కోట్ల నుంచి రూ.19,777 కోట్లకు చేరింది. వినియోగదారుపై సగటు ఆదాయం రూ.138.4 నుంచి రూ.143.6కు వృద్ధి చెందింది. గూగుల్‌ భాగస్వామ్యంలో తీసుకొస్తున్న చౌక ధర స్మార్ట్‌ఫోన్‌ జియోఫోన్‌ నెక్ట్స్‌ను దీపావళికి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని రిలయన్స్‌ తెలిపింది.

కొవిడ్‌ మునుపటికి రిటైల్‌ వ్యాపారం
ఎలక్ట్రానిక్స్‌, ఆభరణాలు, దుస్తుల విక్రయాలు పెరగడంతో రిటైల్‌ వ్యాపారం కొవిడ్‌ ముందు స్థాయిని అధిగమించింది. రిలయన్స్‌ రిటైల్‌ ఎబిటా 45.2 శాతం పెరిగి రూ.2,913 కోట్లకు చేరింది. గత త్రైమాసికంలో కొత్తగా 813 విక్రయశాలలను తెరవడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 13,635 కు చేరింది. దుస్తుల వ్యాపారం రికార్డు ఆదాయాలను నమోదుచేయగా, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, గ్రోసరీ వ్యాపారాలు రెండంకెల వృద్ధి సాధించాయి. సంస్థ నగదు నిల్వలు రూ.2,59,476 కోట్లుగా ఉన్నాయి. చెల్లించాల్సిన రుణం రూ.2,55,891 కోట్లుగా ఉంది.
* శుక్రవారం ఫలితాలకు ముందు ఆర్‌ఐఎల్‌ షేరు 0.15 శాతం లాభంతో రూ.2627.05 వద్ద ముగిసింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని