భారత GDP అంచనాలను స్వల్పంగా పెంచిన ఐరాస - UN expects Indias GDP to grow slightly upward
close

Published : 12/05/2021 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత GDP అంచనాలను స్వల్పంగా పెంచిన ఐరాస

న్యూయార్క్‌: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రముఖ రేటింగ్‌ సంస్థలు భారత వృద్ధి రేటు అంచనాల్లో కోత విధిస్తున్నాయి. కానీ, ఐక్యరాజ్య సమితి వెలువరించిన ఒక నివేదిక మాత్రం వాటికి భిన్నంగా ఉంది. 2021 కేలండర్‌ ఏడాదిలో భారత జీడీపీ 7.5గా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. జనవరి అంచనాలతో పోలిస్తే 0.2 శాతం పెరగడం గమనార్హం. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు మాత్రం చాలా సున్నితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

2022లో భారత వృద్ధి రేటు 10.1గా నమోదయ్యే అవకాశం ఉందని ఐరాస నివేదిక పేర్కొంది. కొవిడ్‌ రెండోదశ విజృంభణ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని తెలిపింది. భారత్‌లో వ్యాక్సిన్‌ అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేసింది. అయితే, భారీ డిమాండ్‌ నేపథ్యంలో టీకాలు సరిపోవడం లేదని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక స్థితిగతులు చాలా సున్నితంగా మారాయని వివరించింది.

2020లో 3.6 శాతం మేర క్షీణించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2021 కేలండర్‌ ఏడాదిలో 5.4 శాతం పుంజుకోనుందని ఐరాస అంచనా వేసింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచే పలు కీలక చర్యలు చేపట్టిన నేపథ్యంలో అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలు పునరుత్తేజం దిశగా సాగుతున్నాయని పేర్కొంది. ఇక దక్షిణాసియా, సబ్‌ సహరన్‌ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్‌ దేశాల్లో మాత్రం పరిస్థితులు ఇంకా గందరగోళంగానే ఉన్నాయని పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని