ఈ పని చేస్తే.. మస్క్‌ రూ.730 కోట్లు ఇస్తారట! - elon musk announced huge prize for developing carbon capture technology
close

Published : 22/01/2021 11:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ పని చేస్తే.. మస్క్‌ రూ.730 కోట్లు ఇస్తారట!

కాలిఫోర్నియా: కర్బన ఉద్గారాల మూలంగా భూగోళం తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. భూతాపం ఏటా పెరుగుతూ మానవ మనుగడకు సవాల్‌ విసురుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో ఉద్గారాలను తగ్గించేందుకు శాస్త్రవిజ్ఞాన ప్రపంచం విశేష కృషి చేస్తోంది. కొందరు శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు ఇందులో కొంత పురోగతి సాధించాయి. కానీ, ఇంకా ఆచరణయోగ్యమైన, సమర్థమైన సాంకేతికత మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అసాధ్యాలను సుసాధ్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ రంగంలోకి దిగారు.

ఇటీవలే ప్రపంచంలోనే అపర కుబేరుడిగా అవతరించిన ఈయన కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేసే యజ్ఞంలో భాగం కావాలని నిర్ణయించుకున్నారు. అటువంటి సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నవారిని ప్రోత్సహించేందుకు ఆయన భారీ నజరానా కూడా ప్రకటించారు. తద్వారా పోటీ పెంచి వీలైనంత త్వరగా మెరుగైన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.730 కోట్లు) బహుమానంగా ఇస్తానని ట్విటర్‌లో ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వచ్చే వారం వెల్లడిస్తానని తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన మస్క్‌.. జెఫ్‌ బెజోస్‌, జుకర్‌ బర్గ్‌, బిల్‌ గేట్స్‌ వంటి దిగ్గజాలతో పోలిస్తే దాతృత్వ కార్యక్రమాల్లో వెనకబడ్డారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆయన నుంచి తాజా ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఆయన గతంలో ఇచ్చిన భారీ విరాళంతో పోలిస్తే ఇది పదింతలు అధికం కావడం విశేషం.

అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జో బైడెన్‌ సైతం.. కర్బన ఉద్గారాలను ఒడిసిపట్టే సాంకేతికత అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. వాతావరణ మార్పుల సమస్యను అధిగమించడంలో భాగంగా దీనిపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. ఈ సాంకేతికత రూపకల్పనలో నిపుణుడైన జెన్నిఫర్‌ విల్‌కాక్స్‌ని కేంద్ర ఇంధన విభాగంలో కీలక పదవికి ఎంపిక చేశారు.

ఇవీ చదవండి...

బిడ్డ పేరే మర్చిపోయిన మస్క్‌

మస్కా మజాకా..ఆరింతలైన అనామక షేర్లు!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని