సూచీలకు పరిమిత లాభాలే
close

Published : 20/09/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూచీలకు పరిమిత లాభాలే

బ్యాంకింగ్‌ షేర్లలో బలమైన కొనుగోళ్లు

అమెరికా ఎఫ్‌ఓఎమ్‌సీ సమావేశం కీలకం

టెలికాం, ఐటీ షేర్లు రాణించొచ్చు

విశ్లేషకుల అంచనాలు

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

దేశీయ మార్కెట్లు ఈ వారం లాభాలు ఆర్జించవచ్చని, అయితే భారీ వేల్యువేషన్ల మధ్య సూచీలు పరిమితంగానే ముందుకు వెళ్లవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మళ్లీ బ్యాంకింగ్‌ షేర్లలో బలమైన కొనుగోళ్లు కొనసాగుతాయన్న అంచనాల మధ్య లాభాలకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నిఫ్టీకి 17,750-17,850 మధ్య బలమైన నిరోధం ఎదురుకావొచ్చని.. ఒక వేళ ఈ స్థాయిని అధిగమిస్తే 18,000 పాయింట్ల వైపు పయనించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. 21-22 తేదీల్లో జరిగే అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎమ్‌సీ) సమావేశం నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వడ్డీ రేటు, బాండ్ల కొనుగోలులో కోతలపై ఏదైనా ప్రతికూల వార్తలు వస్తే మాత్రం లాభాల స్వీకరణ జరగొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* ఔషధ కంపెనీల షేర్లు స్వల్పకాలంలో స్తబ్దుగా కదలాడవచ్చు. ఇప్పటికే లాభాల స్వీకరణ కారణంగా ఈ షేర్లు డీలా పడ్డాయి. ఎంపిక చేసిన షేర్లలో చలనాలను అంచనా వేయొచ్చు.

* చమురు కంపెనీల షేర్లు స్థిరీకరణకు గురికావొచ్చు. అంతర్లీనంగా సానుకూలతలు కనిపిస్తున్నాయి. రిఫైనరీ కంపెనీలతో పోలిస్తే అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు రాణించొచ్చు.

* టెలికాం రంగానికి ప్రకటించిన సంస్కరణల కారణంగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులకు వేగంగా పరిష్కారం లభిస్తుందన్న అంచనాల మధ్య బ్యాంకు షేర్లలో సానుకూలతలు కొనసాగొచ్చు.

* యంత్ర పరికరాల కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణిలో కదలాడొచ్చు. ఆర్థిక కార్యకలాపాలు, టీకాల కార్యక్రమం పుంజుకోవడం, కరోనా కేసుల పెరుగుదల తక్కువగా ఉండటం సానుకూల అంశాలు.

* వాహన కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణిలోనే ట్రేడవవచ్చు. వాహన, వాహన విడిభాగాల పరిశ్రమకు గత వారం ప్రకటించిన పీఎల్‌ఐ పథకం వల్ల ఆశావహ దృక్పథం కనిపిస్తోంది.

* కీలక సూచీల నుంచి ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు సంకేతాలు అందుకోవచ్చు. కీలక ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు ధరలను పెంచాల్సి వస్తోంది.

* సిమెంటు కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం కనిపిస్తోంది.  ముడిపదార్థాల వ్యయాలు, తక్కువ ధరలు, మోస్తరు విక్రయాల కారణంగా జులై-సెప్టెంబరులో కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెరగొచ్చు.

* ప్రభుత్వ సంస్కరణల నేపథ్యంలో టెలికాం షేర్లలో సానుకూలతలు కొనసాగొచ్చు. వొడాఫోన్‌ ఐడియాకు తక్షణ ప్రయోజనాలు సమకూరనున్నాయి. భారతీ, జియోలకు ఇది ‘క్రెడిట్‌ పాజిటివ్‌’ అని మూడీస్‌ అంటోంది.

* లోహ, గనుల కంపెనీల షేర్లు మిశ్రమ ధోరణిని కనబరుస్తున్నాయి. ఉక్కు కంపెనీల షేర్లు బలహీనంగా కదలాడొచ్చు. సెప్టెంబరు త్రైమాసికంలో ఉక్కు సంస్థల లాభదాయకత ఒత్తిడిలో పడొచ్చు.

* ఐటీ షేర్లు మరిన్ని లాభాలు అందుకోవచ్చు. సెంటిమెంటు సానుకూలంగా ఉండడం; నైపుణ్య కొరత నెమ్మదిస్తుండడం ఇందుకు నేపథ్యం.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని