SBI gold loan: గోల్డ్ లోన్ వ‌డ్డీపై ఎస్‌బీఐ డిస్కౌంట్‌.. ఎలా పొందాలంటే..? - sbi offers 0.75 percent interest rate discount on gold loan
close

Published : 05/08/2021 17:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SBI gold loan: గోల్డ్ లోన్ వ‌డ్డీపై ఎస్‌బీఐ డిస్కౌంట్‌.. ఎలా పొందాలంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్య‌వ‌స‌ర స్థితిలో డ‌బ్బు అవ‌స‌ర‌మైతే రుణం పొందేందుకు ఉన్న సుర‌క్షిత‌మైన, సుల‌భమైన‌ మార్గాల్లో గోల్డ్ లోన్ ఒక‌టి. బంగారు ఆభ‌ర‌ణాలు, బ్యాంకు వ‌ద్ద నుంచి కొనుగోలు చేసిన నాణేలపై కొద్దిపాటి పేప‌ర్ వ‌ర్క్‌తో, త‌క్కువ వ‌డ్డీ రేటుతో బంగారంపై రుణాలు ల‌భిస్తున్నాయి. వ‌డ్డీ రేటు బ్యాంకును బ‌ట్టి మారుతుంటుంది. 7 శాతం నుంచి 29 శాతం వ‌ర‌కు ఉండొచ్చు. ఎస్‌బీఐ కూడా బంగారంపై రుణాల‌ను ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా వ‌డ్డీరేటుపై డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. యోనో యాప్‌ ద్వారా గోల్డ్‌ లోన్‌ పొందే వారికి 2021 సెప్టెంబర్‌ 30 వరకు పరిమితకాలపు ఆఫర్‌ కింద దీన్ని అందిస్తోంది.

యోనోతో ప్రయోజనాలు.. 

1. ఇంటి నుంచి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 
2. వ‌డ్డీ రేటు 8.25 శాతం (యోనో ద్వారా 0.75 శాతం రాయితీ)
3. త‌క్కువ పేప‌ర్ వ‌ర్క్‌
4. త‌క్కువ ప్రాసెసింగ్‌ టైమ్‌
5. బ్రాంచిలో ఎక్కువ స‌మ‌యం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

ఎలా పొందాలి..?
ఎస్‌బీఐ యోనో యాప్ అకౌంట్‌లో లాగిన్ అయ్యి, హోమ్ పేజీలో ఎడ‌మ వైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయాలి. అక్క‌డ అందుబాటులో ఉన్న లోన్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేస్తే.. ఏ లోన్ కావాలో అడుగుతుంది. గోల్డ్ లోన్‌పై క్లిక్ చేసి ‘అప్లై నౌ’ను క్లిక్ చేయాలి.

* ఇక్క‌డ హామీగా ఉంచే న‌గ‌ల వివ‌రాలు (న‌గ ర‌కం, బ‌రువు, క్యారెట్‌, నిక‌ర బ‌రువు) పొందుప‌ర‌చాలి. డ్రాప్‌డౌన్ మెనూలో అడిగిన వివ‌రాలు (నివాసం, వృత్తి వంటివి) కూడా తెలియ‌జేయాలి.

* తాక‌ట్టు పెట్టాల్సిన బంగారంతో పాటు, రెండు ఫొటోలు, కేవైసీ ప‌త్రాల‌తో బ్యాంకుకు వెళ్లాలి. డాక్యుమెంట్ల మీద సంత‌కం చేసి రుణం పొందొచ్చు. 

ఎవ‌రు తీసుకోవ‌చ్చు? ఎంతిస్తారు?
18 సంవ‌త్స‌రాలు పైబ‌డి వ‌య‌సు ఉండి, క్రమానుగ‌త ఆదాయం ఉన్న వారు లోన్ తీసుకోవ‌చ్చు. అదే విధంగా పింఛనుదారులు కూడా బంగారంపై రుణాలు తీసుకోవ‌చ్చు. వీరు ఆదాయపు ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. క‌నీస రుణ మొత్తం రూ.20 వేలు కాగా.. గరిష్ఠంగా రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇస్తారు.

కావ‌ల‌సిన ప‌త్రాలు..
* ద‌ర‌ఖాస్తు ప‌త్రం
* అడ్ర‌స్ వివ‌రాల‌తో కూడా గుర్తింపు కార్డు
* రెండు ఫొటోలు

ఇత‌ర వివ‌రాలు..
* ప్ర‌స్తుతం ఎస్‌బీఐ 7.5 శాతం త‌క్కువ వ‌డ్డీ రేటుకు బంగారు రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తోంది.
* తిరిగి చెల్లించేందుకు 36 నెల‌ల స‌మ‌యం ఉంటుంది.
* ఎస్‌బీఐ యోనో యాప్‌లో గానీ, బ్రాంచికి వెళ్లి గానీ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 
* ముంద‌స్తు చెల్లింపు ఛార్జీల‌ను ఎస్‌బీఐ ర‌ద్దు చేసింది. కాల‌ప‌రిమితి కంటే ముందుగానే చెల్లించినా ఎలాంటి రుస‌ములూ విధించ‌రు.

చివరగా..: గోల్డ్ లోన్‌ విషయంలో ముఖ్యంగా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల్సింది వ‌డ్డీ రేట్లే అయినా మిగిలిన అంశాల‌నూ ప‌రిశీలించాలి. అందులో ఒక‌టి కాల‌ప‌రిమితి. కొన్ని బ్యాంకులు తిరిగి చెల్లింపుల‌కు ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఇస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌, కెన‌రా బ్యాంక్‌, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లు ఒక సంవ‌త్స‌రం కాల‌ప‌రిమితితో బంగారంపై రుణాలు ఇస్తుండ‌గా, కోటక్‌ మ‌హీంద్రా బ్యాంక్‌, బంధ‌న్‌ బ్యాంకులు వ‌రుస‌గా నాలుగు, మూడు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితో రుణాలు మంజూరు చేస్తున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని