close

ఈస్థోనియాలో ‘ఇ-రెసిడెన్సీ’ ఉంటే..

ఐరోపా అంతా వ్యాపార కార్యకలాపాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులు  ఐరోపా మార్కెట్లోకి విస్తరించేందుకు వీలుకల్పించే ఈస్థోనియా ‘ఇ-రెసిడెన్సీ’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆ దేశ రాయబారి రిహో క్రూవ్‌ కోరారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో ‘ఇ-రెసిడెన్సీ’ ప్రత్యేకతలను వివరించారు. ఐరోపాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఎంపిక చేసిన దేశమైన ఈస్థోనియా నాలుగేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ప్రారంభించిన మొదటి దేశం కూడా ఇదే. దీని ప్రకారం మనదేశంతో సహా ఏదేశం నుంచి అయినా ఈస్థోనియాలో డిజిటల్‌ పద్ధతిలో కంపెనీ ప్రారంభించవచ్చు. ఇందుకు 100 యూరోలు చెల్లిస్తే సరిపోతుంది. ఈస్థోనియాలో కంపెనీ ఉంటే, దాని ద్వారా  ఐరోపా యూనియన్‌ (ఈయూ) దేశాల్లో ఎటువంటి అవరోధాలు లేకుండా వ్యాపార కార్యకలాపాలు సాగించే అవకాశం కలుగుతుంది. మనదేశం నుంచి ఇప్పటికే 2,174 మంది ఇ-రెసిడెంట్లు 275 కంపెనీలు ప్రారంభించారని ఈస్థోనియా రాయబారి రిహో క్రూవ్‌ వెల్లడించారు. లై-ఫై టెక్నాలజీ మీద పెట్టుబడులు పెట్టిన దీపక్‌ సోలంకి ఇందులో ఉన్నారు. ఈ పద్ధతిలో దీపక్‌ సోలంకి ప్రారంభించిన ఈస్థోనియా కంపెనీ లై-ఫై సేవలు విస్తరించేందుకు బోయింగ్‌, ఎయిర్‌బస్‌ వంటి అగ్రశ్రేణి కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, తన ఇ-రెసిడెన్సీ హోదాతో ఈస్థోనియాలో గత ఏడాదిలో రిలయన్స్‌ జియో అనుబంధ సంస్థను ప్రారంభించారు.

భారత్‌- ఈస్థోనియా- ఐరోపా యూనియన్‌ మధ్య బలమైన సంబంధాలు ఉన్న నేపధ్యంలో ఈయూ దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు విస్తరించటానికి మనదేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు భవిష్యత్తులో ‘ఇ-రెసిడెన్సీ’ సదుపాయాన్ని ఇంకా పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటారని ఆశిస్తున్నట్లు ఈస్తోనియా రాయబారి ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం మనదేశం నుంచే కాకుండా ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 157 దేశాల నుంచి 50,000 మంది ఇ-రెసిడెంట్లు చేరారు. ఇటువంటి వారి సారధ్యంలోని 6,000 స్టార్టప్‌ సంస్థలు ఈయూ దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరించాయి. వినూత్నమైన వ్యాపారాలోచనలు ఉంటే.... ఐరోపా దేశాల్లో పెట్టుబడి సమకూర్చటానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నట్లు, దీన్ని భారతదేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రధానంగా స్టార్టప్‌ సంస్థలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇ-రెసిడెన్సీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రిహో క్రూవ్‌ పేర్కొన్నారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.