close
‘ఇండియా ఇన్నోవేషన్‌ యాక్సెలరేటర్‌’కు 10 అంకుర సంస్థల ఎంపిక

ఫేస్‌బుక్‌, టీ-హబ్‌ సంయుక్త కార్యక్రమం

ఈనాడు, హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌, టీ-హబ్‌ సంయుక్తంగా చేపట్టిన ‘ఇండియా ఇన్నోవేషన్‌ యాక్సెలరేటర్‌’ కార్యక్రమానికి ప్రధానంగా కృత్రిమ మేథస్సు (ఏఐ) విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న 10 అంకుర సంస్థలను ఎంపిక చేశారు. సామాజిక సమస్యలకు కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ఇండియా ఇన్నోవేషన్‌ యాక్సెలరేటర్‌’ కార్యక్రమాన్ని కొంతకాలం క్రితం ఫేస్‌బుక్‌, టీ-హబ్‌ చేపట్టాయి. ప్రజారోగ్యం, వ్యవసాయం, రక్షిత మంచినీరు, పరిశుభ్రత, పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు... తదితర కీలకమైన విభాగాల్లో పనిచేస్తున్న అంకుర సంస్థలను ప్రోత్సహించాలనేది ఈ ప్రయత్నం ప్రధానోద్దేశం. దీనికింద ఎంపిక చేసిన సంస్థలకు పరిశ్రమలోని నిపుణుల నుంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. కార్యకలాపాల నిర్వహణలో, ఐటీ ఉత్పత్తులు- సేవల రూపకల్పన విషయంలో, మార్కెటింగ్‌- విక్రయాల మద్దతు ఇస్తారు. భాగస్వామ్యాలు కుదురుస్తారు. ఎంపికైన అంకురాలకు ఫేస్‌బుక్‌కు చెందిన ‘ఎఫ్‌బీస్టార్ట్‌’ నుంచి సాంకేతిక సహాయం, యాడ్‌ క్రెడిట్‌లు లభిస్తాయి. అంతేగాక టీ-హబ్‌ మద్దతు, పీడబ్ల్యూసీ ఇండియా సలహా సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా 140 అంకుర సంస్థలు యాక్సెలరేటర్‌ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను గురుగ్రామ్‌లోని ఫేస్‌బుక్‌ కార్యాలయంలో పరిశీలించారు. చివరికి అత్యుత్తమంగా కనిపించిన 10 సంస్థలను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా టీ-హబ్‌ సీఈఓ మాట్లాడుతూ సామాజిక సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే అంకుర సంస్థలకు అన్ని విధాలుగా అండగా నిలవాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. టీ-హబ్‌ భాగస్వామ్యంతో ఫేస్‌బుక్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు, పరిశ్రమలోని అన్ని విభాగాలకు చెందిన నిపుణుల అనుభవాలు దీనివల్ల స్టార్టప్‌లకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఎన్నో సమస్యలకు వినూత్న పరిష్కారాన్ని కనుగొనే శక్తి కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్నట్లు ఫేస్‌బుక్‌ ఇండియా భాగస్వామ్యాల విభాగం డైరెక్టర్‌ మనీష్‌ చోప్రా అభిప్రాయపడ్డారు. సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్టార్టప్‌లకు అండగా నిలవటానికి తాము ఆసక్తిగా ముందుకు వచ్చినట్లు వివరించారు.

ఆ అంకుర సంస్థలు ఇవే...
* ఎఫ్‌టీక్యాష్‌
* స్టాట్‌విగ్‌
* సైంజీ ‌
* బ్లూస్కై అనలిటిక్స్‌
* పెన్సీవ్‌
* గ్రీన్‌టర్న్‌ ఐడియా ఫ్యాక్టరీ ‌
* సెస్సేగ్రాస్‌
* మారుత్‌ డ్రోన్స్
* షార్ట్‌లిస్ట్‌ ప్రొఫెషనల్స్‌ ‌
* ఇన్నర్‌అవర్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.