ప్రకృతితో ఒప్పందాన్ని విస్మరిస్తే ఎలా?: పూరీ - How can we forget an agreement with nature said purijagannadh
close
Published : 18/11/2020 17:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రకృతితో ఒప్పందాన్ని విస్మరిస్తే ఎలా?: పూరీ

 

హైదరాబాద్‌: ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లోకెల్లా ప్రకృతిని ప్రేమించే నాగరికత మనదే అని పూరీ జగన్నాథ్‌ పేర్కొన్నారు. అలాంటి సంస్కృతిని మనం విస్మరిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ‘పూరీ మ్యూజింగ్స్’‌లో భాగంగా ఈ సారి ఆయన ‘గొప్ప సంస్కృతి’ గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. 

‘‘అగ్ని, వాయు, వరుణ. వీళ్లే మన దేవుళ్లు. మన చుట్టూ ఉన్న అన్ని రకాల జంతువులనూ ఏదో ఒక దేవుడి వాహనంగా చూశాం. ఆవు లాంటి సాధు జంతువులను సైతం దైవంగా భావిస్తాం. ఏనుగులో వినాయకుడిని చూస్తాం. పూజలు చేస్తాం. వన భోజనాలకు వెళతాం. చీమలకు ఆహారంగా పనికొస్తుందని ఇంటి ముందు వేసే ముగ్గులో బియ్యప్పొడి కలిపి వేస్తాం. ఎవరైనా మరణిస్తే పిండాలు పెడ్తూ కాకుల కోసం ఎదురుచూస్తాం. మత్స్యావతారం, కూర్మావతారం, నృసింహవతారం, వరాహవతారం అంటూ దశావతారాల్లో జంతువులను చూశాం. చెట్లను పూజిస్తాం. ప్రతి ఊరిలో ఉన్న అమ్మవార్లందరూ చెట్లే. చల్లని నీడనిచ్చే ఆ చెట్టు కిందే పండుగ చేసుకుంటాం. నాగులచవితి, పంచమి నాడు పాములను పూజిస్తాం. సృష్టికి మూలమైన శివ లింగానికి పూజలు చేస్తాం. రుతువులకు విలువనిస్తూ వాటి ప్రకారమే పండుగలు జరుపుకుంటాం. ప్రతి నదినీ గౌరవిస్తాం. అన్ని నదులకూ దేవతల పేర్లే పెట్టుకున్నాం. పూజలు చేస్తూ గంగలో మునుగుతాం. ఇలా ప్రకృతిని ప్రేమిస్తూ, పూజించే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ, మనం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.’’

‘‘ఆవుని పూజిస్తాం. అదే ఆవుని నాలుగు రోజుల తర్వాత మట్టుపెడతాం. అత్యధికంగా గొడ్డుమాంసం ఎగుమతి భారతదేశం నుంచే జరుగుతోంది. ఏనుగుని పూజిస్తాం. అదే దంతాలున్న ఏ ఏనుగునూ ప్రాణాలతో వదల్లేదు. లెక్కల ప్రకారం 30వేల ఏనుగులను మట్టుపెట్టాం. అత్యధికంగా తోలు ఎగుమతి భారతదేశం నుంచే జరుగుతోంది. కుంకుమ రాసిన చెట్టును తప్ప మిగిలిన అన్ని నరికివేస్తాం. ఏటా లక్షల హెక్టార్లలో అటవీ నిర్మూలన జరుగుతోంది. శివుని మెడలో పాముని తప్ప మిగతా ఏ పాము కనిపించినా కర్రతో దెబ్బలు వేస్తాం. కుంభమేళాల పేరుతో దేవతల్లాంటి నదులను పాడుచేశాం. ప్రపంచంలోనే కలుషిత నది అయిన గంగా నది, ప్లాస్టిక్‌తో రోజుకు వంద శవాలు తేలుతూ ఉంటుంది. వాటి మధ్యనే మనం మూడు మునకలు వేస్తూ పుణ్యం అని భావిస్తాం. మన సంస్కృతిని నియమానుసారంగా పాటించకపోవడం వల్ల అది సూడో సంస్కృతిగా మారింది. మాటలు తప్ప చేతలు లేవు. నిజానికి ‘అవతార్‌’ చిత్రంలోని పెద్ద చెట్టు నీడలో వాళ్లలా జీవించే గొప్ప సంస్కృతి మనది. పక్షులతో, జంతువులతో కలిసి జీవించేవాళ్లం. ఇప్పటికైనా దీన్ని అర్థం చేసుకుంటే మనకు మంచి రోజులు వస్తాయి. ప్రకృతితో ఒప్పందం చేసుకొని ఇక్కడకు వచ్చాం. ఆ ఒప్పందాన్ని విస్మరిస్తే ఎలా?’’ అని పూరీ ప్రశ్నించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని