close
Published : 12/04/2021 23:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సినిమాలు వదిలేద్దామనుకున్నా: అభిషేక్‌ బచ్చన్‌

ముంబయి: ఈ మధ్యే విడుదలైన ‘బిగ్‌ బుల్‌’ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ నటన బాగుందంటూ విమర్శకులతో సహా అంతా మెచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో.. ‘ఒకప్పుడు నేను సినిమాల్లోంచే వైదొలగాలి అనుకున్నా’ అనే సంచలన సంగతి బయట పెట్టాడు ఛోటా బచ్చన్‌. నాన్న అండ లేకపోతే ఈపాటికే సినిమాలకు గుడ్‌బై చెప్పేవాడినని అన్నాడు. ఈ విషయాలన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

‘గురు’, ‘రావణ్’‌, ‘ఢిల్లీ-6’ తదితర నిమాలతో మంచి నటుడని నిరూపించుకున్నాడు అభిషేక్‌. అయితే గతంలో అతడి సినిమాలు వరుసగా ఫెయిల్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. నటించడం రాదని చాలామంది విమర్శించారు. తండ్రికి తగ్గ తనయుడు కాదంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ట్రోల్‌ చేశారు. అప్పుడు సినిమాల్లోంచే తప్పుకోవాలని భావించాడట జూనియర్‌ బచ్చన్‌. ‘ఒక మనిషి వ్యక్తిగతంగా ఫెయిలైతే ఎవరూ పట్టించుకోరు. జనం ఎక్కువగా ఆసక్తి చూపించే సినిమాల్లాంటి ప్లాట్‌ఫాంపై వైఫల్యం చెందినప్పుడు అంతా విమర్శిస్తారు. ట్రోల్‌ చేయడానికి సోషల్‌ మీడియా ఉండనే ఉంది. కొందరైతే నాకు అసలు నటనే రాదని ఆడిపోసుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఒకానొక సమయంలో పరిశ్రమకు రావడమే నేను చేసిన తప్పేమో అనిపించింది. ఎంత ప్రయత్నించినా సక్సెస్‌ కాలేకపోతున్నానని నిరాశ ఆవహించింది. నాన్న దగ్గరకు వెళ్లి నేను ఈ పరిశ్రమకు సరిపోను అని చెప్పా’ అంటూ ఆ ఇంటర్వ్యూలో తన మనసులోని బాధేంటో చెప్పాడు.

అదే సమయంలో అమితాబ్‌ ఇచ్చిన ధైర్య వచనాలు మళ్లీ నటన పట్ల ప్రేమను పెంచాయట. ‘ఇండస్ట్రీని వదిలిపోయే పిరికివాడిలా ఉండేలా నేను నిన్ను పెంచలేదు. ప్రతి ఉదయం నువ్వు కొత్త పోరాటం మొదలుపెట్టాలి. నువ్వేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నించాలి. దానికి తగ్గట్టే ప్రతి సినిమాకు నువ్వు మెరుగవుతున్నావు. నటనలో రాటుదేలిపోతున్నావు. అలాంటప్పుడు ఈ నిర్ణయం ఎందుకు’ అని వెన్ను తట్టారట. ‘సినిమా జయాపజయాల గురించి పట్టించుకోవద్దు. కేవలం నీ పనిపై ధ్యాస పెట్టు. బాగా నటించేలా కృషి చెయ్‌’ అని చెప్పారని అభిషేక్‌ అన్నాడు. ఈ మాటలే అతడిలో అంతులేని విశ్వాసం నింపాయట.

బిగ్‌బుల్‌ గురించి బిగ్‌ బీ

బిగ్‌బుల్‌లో అభిషేక్‌ చూపించిన నటనకు తండ్రిగా గర్వపడుతున్నానని చెప్పారు బిగ్‌ బీ. బిగ్‌ బుల్‌ సినిమా తొంభైల్లో పాపులర్‌ అయిన స్టాక్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ట్విటర్‌ మాధ్యమం ద్వారా అభిషేక్‌ నటనపై ప్రశంసలు కురిపించారు అమితాబ్‌ బచ్చన్‌. ‘కొడుకు ఎదుగుదల చూడటం ప్రతి తండ్రికి గర్వంగానే ఉంటుంది. నేనూ బిగ్‌ బుల్‌లో అభిషేక్‌ నటన చూశాక అలాగే గర్వ పడుతున్నా. ఆ ఎగ్జైట్‌మెంట్‌ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నా. ఈ సినిమాని ఇప్పటికే మూడుసార్లు చూశా. రాత్రి మరోసారి చూడబోతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు అమితాబ్‌ బచ్చన్‌.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని