MAA Election: ఆ సభ్యుల్ని సస్పెండ్‌ చేయాలి - actress karate kalyani in naresh media conference
close
Published : 26/06/2021 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Election: ఆ సభ్యుల్ని సస్పెండ్‌ చేయాలి

కరాటే కల్యాణి ఆగ్రహం

హైదరాబాద్‌: ఒక కమిటీ ఫోర్స్‌లో ఉండగానే అందులోని సభ్యులు మరో ప్యానల్‌లో చేరడం తప్పు అని నటి కరాటే కల్యాణి అన్నారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలకు తన ప్యానల్‌ను పరిచయం చేస్తూ నటుడు ప్రకాశ్‌రాజ్‌ శుక్రవారం మీడియా సమావేశం పెట్టిన విషయం విదితమే. అయితే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో చేరిన కొంతమంది, ప్రస్తుతం పదవిలో ఉన్న ‘మా’ కమిటీలోనూ సభ్యులుగా ఉన్నారని ఆమె అన్నారు.

‘‘అమ్మ నాకు జన్మనిస్తే.. సిని‘మా’ పరిశ్రమ నాకు పునర్జన్మ ఇచ్చింది. ఎక్కడో పుట్టిన ఓ అమ్మాయి ఇప్పుడు కరాటే కల్యాణిగా మీ ముందుకు వచ్చిందంటే కారణం సినిమా వల్లే. అబద్ధాలు చెప్పడం నాకు రాదు. నేను ఎప్పుడూ నిజమే మాట్లాడతా. గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ప్రస్తుతం ‘మా’ కమిటీలో ఒక సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. కరోనా కాలంలోనూ మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాం. కళాకారులకు సాయం చేస్తూనే ఉన్నాం. ఎంత చేసినా సరే.. కొంతమంది ఇంకా మమ్మల్ని తప్పుపడుతూనే ఉన్నారు. మాతో ఫైట్‌ చేస్తూనే ఉన్నారు. ‘మా’ సభ్యులు ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు. అయితే ఒక కమిటీ ఫోర్స్‌లో ఉన్నప్పుడు అందులోని సభ్యులు కొత్త ప్యానల్‌లో చేరడం తప్పు. వాళ్లని సస్పెండ్‌ చేయాలి. ‘మా’ మసకబారిపోయిందంటూ వ్యాఖ్యానించడం తప్పు’’ అని కరాటే కల్యాణి అన్నారు.

అనంతరం శివబాలాజీ మాట్లాడుతూ ‘‘కమిటీ సభ్యులుగా ఇప్పటివరకూ మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఒకవేళ ఎవరికైనా వాటిపై సందేహాలు ఉంటే తప్పకుండా మీరు మమ్మల్ని అడగవచ్చు. ‘మా’ కార్యాలయంలోని రికార్డ్స్‌లో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి విషయాన్ని నమోదు చేయించాం. గత ఎన్నికల సమయంలో నరేష్‌ అడిగితేనే పోటీ చేశాను. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆ కారణం చేతనే ఎన్నికల్లో జాయింట్‌ సెక్రటరీగా పోటీ చేసి విజయం సాధించాను. మొదటి రెండు నెలలు అసలు అసోసియేషన్‌ కమిటీలో ఏం జరుగుతుందోనని గమనించాను. అప్పట్లో నేను చూసింది కేవలం గొడవలే. ఎందుకంటే ఓటు ద్వారా వేర్వేరు ప్యానల్స్‌కు చెందిన సభ్యుల్ని ఎన్నుకుంటారు. అలా వాళ్లంతా కలిసి కమిటీగా ఏర్పడుతారు. అప్పుడు కమిటీగా అందరూ ఒకే తాటి మీదకు రావాల్సింది పోయి, వాళ్లల్లో వాళ్లకే భిన్నాభిప్రాయాలుంటాయి. దానివల్ల ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పట్టాలెక్కవు. ఏ పని మొదలుపెట్టినా ప్రశ్నించేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇంతకాలం అందరికీ సమాధానం చెబుతూనే వచ్చాం. సేవ చేయడమే మా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పని చేశాం. ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించింది. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు సమయం ఉంది. ఈ వ్యవధిలో మాకెన్నో పనులు ఉన్నాయి. ఎవరైనా రావొచ్చు.. వారియర్స్‌లా కాదు, మదర్‌ థెరిస్సాలా రండి. సేవ చేయండి. గుర్తింపు పొందండి. పనిచేయండి’’ అని శివబాలాజీ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని