logo

సర్వం తానై.. సమరానికి సై

రాజధాని పరిధిలో మూడు లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మహానగరంలో కీలకమైన కాంగ్రెస్‌ నేతలతో వారం రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు.

Updated : 07 May 2024 08:19 IST

ఆ ‘మూడు’ దక్కాల్సిందేనంటూ నేతలకు సీఎం దిశానిర్దేశం
స్వయంగా పర్యవేక్షిస్తూ.. శ్రేణుల్లో జోష్‌ నింపుతూ..
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధాని పరిధిలో మూడు లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మహానగరంలో కీలకమైన కాంగ్రెస్‌ నేతలతో వారం రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచి పార్టీ నేతలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని సూచిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ బాధ్యత నిర్వహించాలన్న దానిపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలోని కొందరు కీలక నేతలతోనూ సీఎం స్వయంగా మాట్లాడుతున్నారని, మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో విజయంపై ఆయన పట్టుదలగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండడంతో కాంగ్రెస్‌ నేతల్లోనూ వేగం పెరిగింది.


అంతర్గత ఒప్పందాలు..

తర పార్టీ నేతలతోనూ సీఎం చర్చిస్తున్నారు. పోలింగ్‌ రోజు కాంగ్రెస్‌ అభ్యర్థి విజయంలో సహకరించేలా అంతర్గత ఒప్పందాలు చేసుకుంటున్నారని సమాచారం. రాజధానికి చెందిన ఓ పార్టీ ఈ మేరకు కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కీలకమైన సికింద్రాబాద్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం కోసం సహకరించేందుకు సంబంధిత పార్టీ నిర్ణయించిందని, ఇందంతా అంతర్గత ఒప్పందమేనని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం నగరంలో ప్రచారం నిర్వహించారు. వచ్చే నాలుగైదు రోజుల్లోనూ మరిన్ని కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.


సర్వే నివేదిక ఆధారంగా..!

చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పార్టీ బలహీనంగా ఉందన్న విషయం పార్టీ దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షణ మొదలు పెట్టారు. ఇప్పటికే నాలుగైదు సార్లు సర్వేలు చేయించినట్లు తెలిసింది. బల్దియా పరిధిలో డివిజన్ల వారీగా, గ్రామీణ ప్రాంతాల్లో మండలాల వారీగా సీఎం సర్వే చేయించారు. ఈ నివేదికల ఆధారంగా ఆయన స్వయంగా కార్యాచరణకు దిగారు. ప్రతికూలంగా ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇప్పటికే స్థానిక నేతలతో ఆయన చర్చించారు. మొన్నటి వరకు నియోజకవర్గ నేతలకే పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కిందిస్థాయిలోని మరో పది మంది నేతలకూ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని