అందరూ మెచ్చిన మగధీరుడు.. మన చిట్టిబాబు - birthday special story on ram charan
close
Updated : 27/03/2021 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరూ మెచ్చిన మగధీరుడు.. మన చిట్టిబాబు

‘ఒక్క నిమిషం లేటవ్వకుండా సెట్టుకొస్తాడు’ - నిర్మాతల మాట.
‘నిత్య విద్యార్థిలా ఇంకా కొత్తగా చేద్దాం అని తపిస్తాడు’ - ప్రతి దర్శకుడి కితాబు.
‘మమ్మల్ని సొంత మనుషుల్లా చూస్తాడు మా అన్న’ - అభిమానుల ఆనందం. 
రామ్‌చరణ్ సినీ ప్రయాణంలో ఇటువంటి ప్రశంసలెన్నో… ఎన్నెన్నో! 
మరి ఇంట్లో వాళ్లు… ఆత్మీయులు.. సన్నిహితులు తన గురించి ఏం చెబుతారో తెలుసా! 
మీరే చదవండి! మెగా పవర్‌ స్టార్‌కి 36వ జన్మదిన శుభాకాంక్షలు.

గర్వంగా ఉంది

‘‘నటనలోనూ, డాన్సులోనూ నన్ను మరిపిస్తాడు చరణ్‌. చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌లు చేసేవాడు. ‘చిరుత’లో చరణ్‌ నటన చూసి ఆశ్చర్యపడ్డా. తనకు టీనేజ్‌లోనే గుర్రపు స్వారీ నేర్పించాం. ఆ అనుభవం ‘మగధీర’లో బాగా పనికొచ్చింది. ఖైదీ సినిమా నాకెంత పేరు తెచ్చిందో ‘రంగస్థలం’ చరణ్‌కి అంత పేరు తెచ్చింది. నటుడిగా పరిణతి చెందాడు. నిర్మాతగా ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి పాత్రను ఇచ్చి నా కల నెరవేర్చాడు. తన లాంటి కొడుకు ఉండటం ఎంతో గర్వంగా ఉంది’’ - చిరంజీవి

గిచ్చేవాణ్ని!

‘‘చరణ్‌ చిన్నప్పుడు అన్నయ్య షూటింగుల్లో బిజీగా ఉండేవారు. దాంతో తను ఎక్కువగా నా దగ్గరే ఉండేవాడు. ఒకసారి విదేశాలకు వెళ్లినప్పుడు చరణ్‌ని నావెంట తీసుకెళ్లాను. అక్కడ అల్లరి చేయకుండా ఉండేందుకు గిచ్చేవాణ్ని! మేమిద్దరం చాలా సరదాగా ఉంటాం. నిలకడగా ఉండే మనస్తత్వం వల్ల చరణ్‌ గొప్ప విజయాలు సాధిస్తున్నాడు’’ - పవన్‌ కళ్యాణ్‌

అత్యుత్తమ నిర్మాత

‘‘ఆరెంజ్‌’ సినిమా ద్వారా చరణ్‌కు సక్సెస్‌ అందించలేనందుకు చాలా బాధగా అనిపిస్తుంది. నిర్మాతగా ఖైదీ 150 సినిమా తీసి విజయం సాధించాడు చరణ్‌. ఆ విజయాన్ని నేనూ ఆస్వాదించాను. అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమాలు చేస్తున్న చెర్రీ ఎప్పుడూ విజయాలు సాధించాలి’’ - నాగబాబు

సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ

‘‘సినిమాలకు సంబంధించిన విషయాలను పెద్దగా పట్టించుకోను కానీ, చెర్రీ ఆహారం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటా. బయట ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం చరణ్‌ చాలా సరదాగా ఉంటాడు. తనకు సెన్సాఫ్‌ హ్యూమర్‌ చాలా ఎక్కువ. ఎక్కువగా వ్యాయామం చేస్తాడు. నాకిష్టం లేకపోయినా తన వల్ల నేనూ వ్యాయామం చేయాల్సి వస్తోంది’’ (నవ్వుతూ).  - ఉపాసన

గర్వం లేనివాడు

‘‘చరణ్‌ నేనూ కలిసి పెరిగాం. చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నా, స్టార్‌ హీరో కొడుకుని అన్న గర్వం చరణ్‌లో కనిపించలేదు. ఎంత ఫేమ్‌ ఉన్నా చాలా కష్టపడతాడు. అందుకే చరణ్‌ను నేను చాలా ఇష్టపడతాను. మెగా స్టార్‌, పవర్‌ స్టార్‌ తర్వాత అంతటి స్థానంలో ఉండే అర్హత చరణ్‌కి మాత్రమే ఉందని నా అభిప్రాయం’’ - అల్లు అర్జున్‌ 

చరణ్‌ అన్న నా ధైర్యం

‘‘చిన్నప్పుడు నాకు చీకటంటే భయం. ఒకసారి చరణ్‌ అన్న వాళ్ల ఇంటికి వెళ్లాను. ఇంట్లో చరణ్‌ అన్న మాత్రమే ఉన్నాడు. నన్ను చీకటి గదిలో పెట్టి బాగా ఏడిపించాడు. అందుకే చరణ్‌ అన్న అంటే భయపడేవాణ్ని. పెద్దయ్యాక ఆ భయం పోయింది. చరణ్‌ అన్న నటించడం మొదలు పెట్టాక అన్నను చూసి నేనూ అలా నటించాలనుకున్నా. నేను హీరో అయ్యాక నాకు ఏ సమస్య వచ్చినా వెంటనే గుర్తుకొచ్చేది చరణ్‌ అన్నే’’ - వరుణ్‌ తేజ్‌

ప్రాణ స్నేహితుడు

‘‘చరణ్‌ నేనూ మంచి స్నేహితులం. చదువుకొనే రోజుల్లో బాగా అల్లరి చేసేవాళ్లం. కాలేజ్‌ ఎగ్గొట్టి బయట తిరిగేవాళ్లం. ఇప్పటికీ మా మధ్య స్నేహం అలాగే కొనసాగుతుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వల్ల మా ఇష్టాఇష్టాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఇప్పటికీ తరచు చరణ్‌ నేనూ కలుస్తూనే ఉంటాం. చరణ్‌ హార్డ్‌ వర్క్‌కి హేట్సాఫ్‌ చెప్పొచ్చు’’ - రానా

ఈ స్నేహం ఇలాగే..

‘‘చరణ్‌ మంచి నటుడు. కష్ట సుఖాలను పంచుకునే మిత్రుడు. చరణ్‌కి నాకు మధ్య స్నేహం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ద్వారా మరింత పెరిగింది. ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆ దేవుణ్ని కోరుకుంటున్నాను’’ - ఎన్టీఆర్‌

నేను మెచ్చే నటుడు చరణ్‌

‘‘చరణ్‌ నటించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఒక్కో సీన్‌లో చాలా పరిణతి కలిగిన నటుడిగా కనిపిస్తాడు. మగధీర క్లైమాక్స్‌లో డ్రమ్‌కి ఆనుకొని కాజల్‌ వైపు నిస్సహాయంగా చూసే సీన్‌లో చాలా బాగా నటించాడు. అప్పటికి ఇప్పటికీ చరణ్‌ నటనలో చాలా ఇంప్రూవ్‌మెంట్‌ కనిపిస్తోంది’’ - రాజమౌళి

మిత్రమా!

‘‘నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ చరణ్‌. నేను చెర్రీని మిత్రమా అని పిలుస్తాను. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్‌ ఉంది. అడిగిన వెంటనే సాయం చేసే మనస్తత్వం చెర్రీది. నాన్న గారు, చిరంజీవి అంకుల్‌ టైంలో సినిమాలకు పోటీ ఉండేది. కానీ మా జెనరేషన్‌లో అలాంటిదేం లేదు. మా మధ్య స్నేహమే తప్ప ఎలాంటీ పోటీ లేదు’’ - మంచు మనోజ్‌

- శ్రీ స్వామిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని