‘జాంబీరెడ్డి’ టైటిల్‌కు కారణమదే: ప్రశాంత్‌వర్మ - chat with zombie reddy film crew
close
Updated : 03/02/2021 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జాంబీరెడ్డి’ టైటిల్‌కు కారణమదే: ప్రశాంత్‌వర్మ

ఈటీవీ భారత్‌తో చిత్రబృందం చిట్‌చాట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇంద్ర’లో చిన్ననాటి చిరంజీవిగా.. ‘కలిసుందాం రా’లో చిరువెంకటేశ్‌గా.. ఇలా ఎన్నో సినిమాల్లో స్టార్‌ హీరోలకు బ్యాక్‌డ్రాప్‌ పాత్రలను పోషించి మెప్పించిన నటుడు తేజ సజ్జ. చాలాకాలం తర్వాత ఇటీవల ‘ఓబేబీ’లో కీలకపాత్ర చేసి అలరించాడు. ఇప్పుడు ఓ వినూత్నమైన చిత్రం ‘జాంబీరెడ్డి’తో హీరోగా వస్తున్నాడు. డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆనంది, దక్ష నగార్కర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో తేజ, డైరెక్టర్‌ ప్రశాంత్‌.. చిట్‌చాట్‌లో ‘ఈటీవీ భారత్‌’తో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

‘ఇంద్రసేనారెడ్డి’ నుంచి ‘జాంబీరెడ్డి’ ప్రయాణం ఎలా ఉంది
తేజ: చాలా సంతోషంగా ఉంది. దాదాపు 10ఏళ్ల తర్వాత మళ్లీ చేస్తున్నాను. మధ్యలో ‘ఓబేబీ’ సినిమా చేశాను. డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో మళ్లీ ఈ సినిమా ద్వారా వస్తున్నాను. మంచి సినిమాలో చేస్తే ఎవరైనా ఆదరిస్తారు. ‘ఓ బేబీ’లో అదే జరిగింది. జాంబీరెడ్డి కూడా అంతే మంచి సినిమా. ఇది పూర్తిగా ఒక కొత్త కథ. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తారన్న నమ్మకం ఉంది. 

జాంబీ.. ఆ ఆలోచన ఎలా వచ్చింది

ప్రశాంత్‌వర్మ: నేనెప్పుడూ కొత్తరకమైన కంటెంట్‌తో సినిమా చేయాలని చూస్తాను. కొత్త జోనర్స్‌లో సినిమాలు చేసి ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నిస్తూ ఉంటా. ‘జాంబీలు వస్తే ఎలా ఉంటుంది..?’ అనే ఆలోచన చాలాకాలం నుంచి నాలో ఉంది. అది ఇప్పుడు సాధ్యమైంది. జాంబీల మీద ఇంతకు ముందు హార్రర్‌ సినిమాలు చాలా వచ్చాయి. అయితే.. లాక్‌డౌన్‌లోని భయానక వాతావరణం వల్ల జనాలు కామెడీ సినిమాలను కోరుకుంటున్నారు. అందుకే ఈ సినిమాను కామెడీ చిత్రంగా తెరకెక్కించాం. 

‘జాంబీరెడ్డి’ అనే టైటిల్‌కు కారణం..?

ప్రశాంత్‌వర్మ: ‘రెడ్డి’ అంటే మన తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకరకమైన ఎమోషన్‌ ఉంటుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ సినిమా అంటే రెడ్డి అనే పేర్లను అభిమానులు కచ్చితంగా కోరుకుంటారు. ఈ సినిమాలో జాంబీలు రాయలసీమ నుంచి వస్తాయి కాబట్టి.. ‘జాంబీరెడ్డి’ అని టైటిల్‌ పెట్టాం. అంతే తప్ప వేరే ఎలాంటి ఉద్దేశం లేదు. అయితే.. మొదట్లో కొంతమంది ఫోన్‌ చేసి టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు.

సినిమాల్లో మీకంటే జూనియర్‌ అయిన డైరెక్టర్‌తో పని చేయడం ఎలా అనిపించింది

తేజ: ఇండస్ట్రీలో సీనియర్లు, జూనియర్లు అలాంటిదేం ఉండదు. మా సినిమాలో కూడా 40ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఉన్నారు. ప్రశాంత్‌వర్మ చేసిన ముందు సినిమాలు చూసిన వాళ్లందరికీ ఆయన సత్తా ఏంటో తెలుసు. ఆయనతో కలిసి నేను సినిమా చేయడం నా అదృష్టం. మొదటి సినిమాతోనే ఆయనేంటో నిరూపించుకున్నారు. ఆర్టిస్టుల నుంచి నటన రాబట్టడంతో పాటు సంగీతం.. ఇలా ప్రతీ విషయంలోనూ పట్టున్న డైరెక్టర్‌. 

మీరు హీరో కావడంపై మెగాస్టార్‌ స్పందన..?

తేజ: నాలుగైదేళ్ల నుంచి హీరో అయిపోతా అని చెప్తూ వస్తున్నా. అయితే.. ముందు డిగ్రీ పూర్తిచెయ్‌ అన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా చేస్తున్నట్లు ఆయనకు తెలుసు. నాకు విషెస్‌ కూడా చెప్పారు. ఈ సినిమా చూసిన తర్వాత.. ‘మన పిల్లోడు మంచి సినిమా చేశాడు’ అని ఆయన కచ్చితంగా ఫీల్‌ అవుతారు. ఎలాగైనా నేను హీరో కావాలని తీసిన సినిమా కాదిది. మంచి కంటెంట్‌ ఉంది కాబట్టే ఇందులో చేశాను. అందరూ లవ్‌స్టోరీలు చేస్తున్నారు కాబట్టి.. మేం భిన్నంగా ఈ సినిమా చేశాం. మంచి కథ కోసం వచ్చే జనానికి సినిమా కచ్చితంగా నచ్చుతుంది. 

ఈ కథ ఇంకెవరికైనా చెప్పారా..?

ప్రశాంత్‌వర్మ: లేదు. మొదట తేజకే చెప్పాను.

ఎంతమంది జాంబీలుగా ఉండబోతున్నారు.

ప్రశాంత్‌వర్మ: దాదాపు మీకు తెలిసిన వాళ్లంతా జాంబీలుగా కనిపిస్తారు. తాడిపత్రిలో ఉన్న అతి పురాతనమైన ఆలయంలో ఈ సినిమా షూట్‌ చేశాం. అది ఈ సినిమాకు చాలా కలిసొస్తుంది. 

తేజ హీరోగా తొలి సినిమా.. కెమెరా ముందు ఎలా చేశాడు

ప్రశాంత్‌వర్మ: తేజ.. తన రియల్‌ లైఫ్‌లో ఉన్నట్లే.. కెమెరా ముందు కూడా ఉంటాడు. చాలా సహజంగా చేస్తాడు. పైగా వీర లెవల్లో నటించే నటించే సినిమాలు తేజకు ఎప్పుడూ రాలేదు. ఈ సినిమాలో హీరో పేరు మారియో. గేమ్‌ డిజైనింగ్‌ చేస్తూ ఉంటాడు.

ఎలాంటి హోంవర్క్‌ చేశారు..?

తేజ: ఈ సినిమా కోసం బాగా హోంవర్క్‌ చేసింది డైరెక్టర్‌ మాత్రమే. నేను మాత్రం పెద్దగా ఏం కష్టపడలేదు. నన్ను ఎవరూ పెద్దగా కష్టపెట్టలేదు. సినిమా షూటింగ్‌ మొత్తం సరదాసరదాగా సాగిపోయింది. 

హీరోయిన్ల పాత్ర ఎలా ఉంటుంది.

తేజ: పల్లెటూరి అమ్మాయిగా ఆనంది కనిపిస్తుంది. ఆమె చాలా బాగా సూట్‌ అయింది. సిటీ అమ్మాయిగా దక్ష చేసింది.

జాంబీలకు మేకప్‌ వేయడం.. ఆ వాతావరణం తీసుకురావడం ఎలా సాధ్యమైంది

ప్రశాంత్‌వర్మ: మేకప్‌ కోసం బాలీవుడ్ లేదా హాలీవుడ్‌ నుంచి స్పెషలిస్టులను తీసుకువద్దామని అనుకున్నాం. కానీ.. మనదగ్గర కూడా మంచి టాలెంట్‌ ఉందని ఆలోచించి.. ఇక్కడి వారితోనే సినిమా చేశాం. అందర్నీ జాంబీలుగా చూపించడం చాలా కష్టమైన పని. కానీ.. బాషగారు ఈ విషయంలో చాలా శ్రమించారు. షూటింగ్‌ సమయంలో పడుకున్న తర్వాత కూడా జాంబీలే కలలోకి వచ్చేవి. అలాంటి వాతావరణాన్ని ఆయన క్రియేట్‌ చేశారు. 

ఈ సినిమా హ్యాట్రిక్‌ అవుతుందనుకుంటున్నారా..?

ప్రశాంత్‌వర్మ: నా చివరి రెండు సినిమాలకు మధ్య ఎక్కువ సమయం లేకపోయింది. ఇప్పుడు మాత్రం కావాల్సినంత సమయం దొరికింది. గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాం. ఈ సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత అందరూ కచ్చితంగా స్మైల్‌తో వెళతారు. 

ఇంకా ఏమైనా సినిమా ఆఫర్లు వస్తున్నాయా..?

తేజ: చాలా వస్తున్నాయి. కానీ.. ప్రస్తుతం ఫోకస్‌ మొత్తం ‘జాంబీరెడ్డి’ మీదే. ‘ఇష్క్’ మాత్రం జాంబీరెడ్డి’ షూటింగ్‌ సమయంలోనే ఒప్పుకొన్నాను. తర్వాత చేయాల్సింది ఆ సినిమానే.

మెగాస్టార్‌ దగ్గర ఏం నేర్చుకున్నారు..?

ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విషయం నేర్చుకుంటాం. అయితే.. ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నాం అనే విషయం వివరించి చెప్పలేం. అది మనలో అంతర్గతంగా ఉంటుంది. వాళ్లను చూస్తుంటే మనకు తెలియకుండానే ఏదో ఒక విషయం నేర్చుకుంటాం. 

అభిమానులకు ఏం చెప్తారు..?

తేజ: ట్రైలర్‌లో చూపించిన లైన్‌ సినిమాలో ఉంటుంది. మంచి సినిమా చూడాలనుకునేవాళ్లు కచ్చితంగా థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. చాలా రోజుల నుంచి సినిమాలు లేవు. యాక్షన్‌ సినిమాలు వచ్చాయి.. కానీ కామెడీ థ్రిల్లర్‌ రావడం ఇదే మొదటిసారి. మంచి సినిమా అందరూ చూడాలి. ఫిబ్రవరి 5న వచ్చి మాది ఎంత మంచి సినిమానో మీరే చెప్పాలి. థియేటర్లో కూర్చీపై నిల్చొని విజిల్స్‌ వేసే సన్నివేశాలు చాలా ఉంటాయి.

జాంబీకి ముగింపు ఉంటుందా..? ఇంకో సినిమా వస్తుందా..?

ప్రశాంత్‌వర్మ‌: ఈ సినిమాకు ముగింపు ఉంటుంది.. కొనసాగింపూ ఉంటుంది. మళ్లీ తేజ డేట్స్‌ ఇస్తే తర్వాతి ప్రాజెక్ట్‌ ఉంటుంది. ఇప్పుడు కడప, కర్నూల్‌ వచ్చిన జాంబీలు ఆ తర్వాత హైదరాబాద్‌కు వస్తాయేమో..!(నవ్వుతూ). ఇలా అభిమానులు ఆదరించినన్ని రోజులు కొనసాగింపు సినిమాలు తీస్తూనే ఉంటాం.

ఇదీ చదవండి..

సూసైడ్‌ ఆలోచనలు విపరీతంగా బాధించాయిAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని