చిత్రనగరిగా భాగ్యనగరి.. హైదరాబాద్‌లో జోరుగా సినిమా షూటింగ్‌లు - cinema shootings in hyderabad
close
Updated : 23/07/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్రనగరిగా భాగ్యనగరి.. హైదరాబాద్‌లో జోరుగా సినిమా షూటింగ్‌లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌లో ఓవైపు జోరువాన కురుస్తోంది. మరోవైపు అదే జోరులో సినిమా షూటింగ్‌లూ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినిమా ప్రియులు ఎదురుచూస్తున్న భారీ సినిమాల చిత్రీకరణలు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. కేవలం టాలీవుడ్‌ సినిమాకే పరిమితం కాకుండా.. కోలీవుడ్‌, బాలీవుడ్‌ ఇలా అన్ని పరిశ్రమల సినిమాలకు భాగ్యనగరం వేదికైంది. జక్కన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో మొదలు పెడితే.. అజిత్‌ ‘వాలిమై’ వరకూ అన్నింటికీ కేరాఫ్‌ అడ్రస్‌గా హైదరాబాద్‌ మారింది. ఇంతకీ ఇక్కడ ఏ సినిమాలు చిత్రీకరణ జరుపుకొంటున్నాయో తెలుసా..?

ఆర్‌ఆర్‌ఆర్‌.. భారీ బడ్జెట్‌ సాంగ్‌

జక్కన్న టీమ్‌ ఇప్పటికే దాదాపు మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓ ప్రచార గీతం పనుల్లో నిమగ్నమైంది. టాలీవుడ్‌లో ఇప్పుడిదే హాట్‌టాపిక్‌.. ఎందుకంటే దాదాపు రూ.3కోట్ల బడ్జెట్‌తో ఆ సాంగ్‌ను తీర్చిదిద్దుతున్నారట. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియాభట్‌ ఈ పాటలో సందడి చేయనున్నారు. అంతేకాదు.. రాజమౌళితో పనిచేసిన హీరోలు ప్రభాస్‌, రవితేజ, రానా కూడా ఈ పాటలో తళుక్కుమంటారని ప్రచారం సాగుతోంది. ఈ పాట చిత్రీకరణ కోసం బాలీవుడ్‌ బ్యూటీ అలియా ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుంది.


శరవేగంగా.. శాకుంతలం

సమంత అక్కినేని ప్రధానపాత్రలో డైరెక్టర్‌ గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ చిత్రీకరణ కూడా హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఇటీవల అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ కూడా సెట్లో అడుగుపెట్టింది. అమీర్‌పేటలోని సారథి స్టూడియోస్‌లో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. గండిపేటచెరువు సమీపంలోనూ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. కరోనా వల్ల ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ జూలై 15న పునఃప్రారంభమైంది.


రాధేశ్యాముడు వచ్చేశాడు..

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ కూడా మళ్లీ సెట్స్‌ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ‘ఆదిపురుష్‌’లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ కోసం హైదరాబాద్‌ చేరుకున్నాడు. జూలై 23 నుంచి ఆగస్టు 05 వరకూ ఈ సినిమా షూటింగ్‌ జరగనున్నట్లు సమాచారం. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ సినిమాను రాధాకృష్ణకుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఇంటర్వెల్‌ సీన్‌ కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ సెట్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు రెండో వారంలో ప్రభాస్‌ టీమ్‌ ఒక అప్డేట్‌ ఇచ్చే అవకాశం ఉంది.


ధర్మస్థలి తెరచుకుంది..

కనీవినీ ఎరుగని రీతిలో ధర్మస్థలి పేరుతో ఏర్పాటు చేసిన సెట్‌లో ‘ఆచార్య’ షూటింగ్‌ జరుగుతోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ‘ధర్మస్థలి తెరచుకుంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది’ అని చిత్రబృందం ప్రకటించింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయనున్నారు. చిరంజీవి ఆచార్యగా, రామ్‌చరణ్‌ సిద్ధ పాత్రలో కనిపిస్తున్నారు.  కాజల్‌ నాయిక. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


పుష్పరాజ్‌కు తాత్కాలిక బ్రేక్‌..!

త్వరలోనే పుష్పరాజ్‌(అల్లు అర్జున్‌)కు విలన్‌ (ఫాహద్‌ ఫాజిల్‌)కు మధ్య ఓ భారీ ఫైట్‌ సన్నివేశం చిత్రీకరించనున్నారు. కొన్ని కీలక సన్నివేశాలు హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. అయితే.. సెట్లో ఓ ప్రముఖ వ్యక్తికి ఆరోగ్యం బాగాలేని కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా ఆపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మలయాళంలోనూ ఈ చిత్రం డబ్బింగ్‌ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా చిత్రంగా ‘పుష్ప’ తెరకెక్కుతోంది. అల్లు అర్జున్‌ సరసన రష్మిక సందడి చేయనుంది. మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది.


సర్కారువారి పాట హీరోహీరోయిన్లపై..

కరోనా సెకండ్‌వేవ్‌కు ముందు దుబాయ్‌లో షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘సర్కారువారి పాట’ మళ్లీ పట్టాలెక్కింది. హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన షూటింగ్‌లో భాగంగా మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌పై పలు సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌.. పొడవాటి జుట్టు, మెడపై పచ్చబొట్టుతో మాస్‌ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.


వాలిమై.. హైదరాబాద్‌ టు ఉత్తరభారతం

ఇటీవల బైక్‌తో విన్యాసాలు చేసిన తాలా అజిత్‌ ఇప్పుడు అదే బైక్‌ మీద ఉత్తర భారతాన్ని చుట్టే పనిలో పడ్డాడు. ఆయన నటిస్తున్న ‘వాలిమై’ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లోనే జరిగింది. ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందీ చిత్రం. తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మాత. మోస్ట్‌ వెయిటింగ్‌ సినిమాల లిస్టులో ఈ చిత్రం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


భాగ్యనగరంలో ‘బ్రో డాడీ’ సందడి

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రోడాడీ’. పృథ్వీరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేస్తూ సెట్‌కి సంబంధించిన వీడియోను పంచుకున్నారు మోహన్‌లాల్‌. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శిని, పృథ్వీ రాజ్‌, మీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.


‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ఇన్‌ హైదరాబాద్‌

రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రం రూపొందుతోంది. దివ్యాంశ కౌశిక్‌, రాజీషా విజయన్‌ హీరోయిన్లు. వాస్తవ సంఘటనల ఆధారంగా, ఒక విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. రవితేజ ఒక పవర్‌ఫుల్‌ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.


ఇలాంటి పెద్ద సినిమాలతో పాటు రామ్‌ పోతినేని సినిమా రాపో19, ధనుష్‌, మాళవిక మోహన్‌ జంటగా నటిస్తున్న మరో చిత్రం, మరెన్నో చిన్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు జోరుగా షూటింగ్‌ పనులు కానిస్తున్నాయి. దీంతో పాటు నాగార్జున ‘బంగార్రాజు’గా త్వరలోనే రంగంలోకి దిగనున్నాడు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ తీర్చిదిద్దినట్లు సమాచారం. వచ్చే నెల నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, కృతిశెట్టి సందడి చేయనున్నారు. అంతేకాదు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ బృందం షూటింగ్‌ కోసం కూడా త్వరలోనే హైదరాబాద్‌ బాటపట్టనుందట. త‌మిళ స్టార్‌ హీరో విశాల్ నటిస్తున్న ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ క్లైమాక్స్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా.. చిత్రీకరణ సమయంలో విశాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ప్రస్తుతం చిత్రీకరణ ఆగిపోయింది. శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని