ఐల్యాష్‌ కర్లర్‌ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - common mistakes you should avoid while using eyelash curler in telugu
close
Published : 16/09/2021 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐల్యాష్‌ కర్లర్‌ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వంపులు తిరిగిన కనురెప్పలు ముఖ సౌందర్యాన్ని ఇనుమడిస్తాయి. అందుకే వాటిని తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవడానికి అమ్మాయిలు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇందుకోసం ప్రస్తుతం ఐల్యాష్‌ కర్లర్స్‌ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే వీటిని వాడే క్రమంలో చాలామంది చేసే పొరపాట్లు కనురెప్పలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. తద్వారా కనురెప్పల వెంట్రుకలు నిర్జీవమైపోవడం, రాలిపోవడం, కర్లర్‌తో పూర్తి ఫలితాలు పొందలేకపోవడం.. వంటివి అందులో కొన్ని! మరి, ఐల్యాష్‌ కర్లర్‌ వాడే క్రమంలో చేయకూడని ఆ పొరపాట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

మస్కారాకు ముందే..!

కనురెప్పలు నల్లగా, ఒత్తుగా కనిపించాలని మస్కారా పెట్టుకోవడం సహజమే! అయితే ముందు మస్కారా పెట్టుకొని ఆ తర్వాత ఐల్యాష్‌ కర్లర్‌తో కనురెప్పల్ని తీర్చిదిద్దుకుంటే అవి సులభంగా వంపులు తిరుగుతాయని అనుకుంటారు చాలామంది. నిజానికి దీనివల్ల రెప్పలు డ్యామేజ్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. మస్కారా కనురెప్పల్ని బిగుతుగా మార్చుతుంది.. తద్వారా వాటిని వంపులు తిరిగేలా చేయడానికి కర్లర్‌ను మరింతగా ప్రెస్‌ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రెప్పలపై ఒత్తిడి పెరిగి అవి రాలిపోవడం, మధ్యలోనే కట్‌ అయిపోవడం.. వంటివి జరుగుతాయి. కాబట్టి కర్లర్‌ ఉపయోగించాలనుకునే వారు మస్కారా పెట్టుకోవడానికి ముందుగానే రెప్పల్ని వంపులు తిరిగేలా చేసుకొని.. ఆపై మస్కారా వేసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది.

పదే పదే వద్దు!

అవసరం ఉన్నా, లేకపోయినా కొంతమంది తరచూ ఐల్యాష్‌ కర్లర్‌ని వాడుతుంటారు. మరికొందరు.. కనురెప్పలు మరింత వంపులు తిరగాలన్న ఉద్దేశంతో కర్లర్‌ని రెప్పలకు పెట్టి కాసేపు అలాగే ఉంచుతారు. ఈ రెండూ సరైన పద్ధతులు కావంటున్నారు నిపుణులు. ఐల్యాష్‌ కర్లర్‌ను రెప్పలకు పెట్టి అలాగే కొన్ని సెకన్ల పాటు ఉంచడం, పదే పదే కర్ల్‌ చేయడం.. వంటి వాటి వల్ల రెప్పలు డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అలాగే అదిమి పట్టకుండా కనురెప్పల మొదళ్ల నుంచి చివర్ల దాకా కర్లర్‌తో ఓ నాలుగైదు సార్లు సున్నితంగా ప్రెస్‌ చేస్తూ (మరీ గట్టిగా ప్రెస్‌ చేయకూడదు) కర్ల్స్‌ చేసుకుంటే సరిపోతుంది.

శుభ్రం చేస్తున్నారా?

అన్ని సౌందర్య సాధనాలను శుభ్రం చేసినట్లే ఐల్యాష్‌ కర్లర్‌నూ ఎప్పటికప్పుడు క్లీన్‌ చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే మస్కారాకు ముందే కర్లర్‌ని ఉపయోగిస్తాం.. కాబట్టి దీనిపై మురికి పేరుకుపోయే అవకాశమే లేదనుకుంటారు కొందరు. కానీ దీనిపైనా దుమ్ము-ధూళి, ఇతర మేకప్‌ అవశేషాలు.. వంటివి చేరి.. తిరిగి దాన్నే ఉపయోగించడం వల్ల కనురెప్పలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే ఉపయోగించిన ప్రతిసారీ.. రబ్బింగ్‌ ఆల్కహాల్‌లో ముంచిన కాటన్‌ బాల్‌తో కర్లర్‌ను శుభ్రం చేసి.. ఆపై పొడి కాటన్‌ బాల్‌తో మరోసారి తుడిచేస్తే సరిపోతుంది.. ఇక్కడ రబ్బింగ్‌ ఆల్కహాల్‌కు బదులు మేకప్‌ రిమూవర్‌ని కూడా ఉపయోగించచ్చు.

అలాగే మేకప్‌ ఉత్పత్తులకు/సౌందర్య సాధనాలకు ఎక్స్‌పైరీ తేదీ ఉన్నట్లే ఐల్యాష్‌ కర్లర్‌కూ ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా కర్లర్‌ను మార్చుకోవడం మంచిది.

వేడి చేయచ్చు.. కానీ!

వాడే ముందు ఐల్యాష్‌ కర్లర్‌ను వేడి చేయమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో చాలామంది చేసే పొరపాటేంటంటే.. ఎక్కువగా వేడి చేస్తే కనురెప్పలు సులభంగా వంపులు తిరుగుతాయి.. ఎక్కువ సమయం అలాగే ఉంటాయి అని! కానీ దీనివల్ల వెంట్రుకలు తేమను కోల్పోయి నిర్జీవమైపోతాయి.. రాలిపోతాయి. కాబట్టి కర్లర్‌ను వేడి చేసి వాడాలనుకునే వారు గోరువెచ్చగా మాత్రమే చేసుకోవాలి. ఇందుకోసం బ్లో డ్రయర్‌ని ఉపయోగించచ్చు. కొన్ని సెకన్ల ముందు డ్రయర్‌ ముందు కర్లర్‌ని ఉంచితే సరిపోతుంది. ఒకవేళ మాకు ఇలా వద్దు అనుకున్న వాళ్లు వేడి చేయకుండానే కర్లర్‌ని కూడా వాడుకోవచ్చు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

* ఐల్యాష్‌ కర్లర్‌తో కనురెప్పల్ని తీర్చిదిద్దుకున్నప్పుడు రెప్పలు త్వరగా వంపులు తిరగాలంటే ఇయర్‌ బడ్‌తో కాస్త పెట్రోలియం జెల్లీని రెప్పలపై రాయచ్చు. ఇది రెప్పలు తేమను కోల్పోకుండా కూడా కాపాడుతుంది.

* ముందుగా కనురెప్పల్ని మేకప్‌ రిమూవర్‌తో శుభ్రం చేసుకొని.. ఆ తర్వాత కర్లర్‌ ఉపయోగిస్తే లుక్‌ ఇనుమడిస్తుందని సలహా ఇస్తున్నారు నిపుణులు. అయితే రిమూవర్‌ కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడడం ముఖ్యం.

* కర్లర్‌ ఉపయోగించే క్రమంలో దానివల్ల కంటికి డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడడమూ ముఖ్యమే!

ఇంకా కర్లర్‌ ఉపయోగించే క్రమంలో మీకేమైనా సందేహాలుంటే నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవచ్చు..!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని