వీరింతే.. తీరింతే! - eag
close
Updated : 30/07/2021 06:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీరింతే.. తీరింతే!

 ఆకర్షణీయ ప్రగతిలో నాణ్యత గాలికి 

మొక్కుబడి పనులతో నిధుల స్వాహా..

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కాకినాడ నగరం

రామకృష్ణారావుపేటలో బాగున్న రోడ్డుపైనే మళ్లీ నిర్మాణం

కాకినాడ నగర ఆకర్షణీయ పనుల్లో నాణ్యత లేమి రాజ్యమేలుతోంది. గతంలో ప్రణాళిక లేమితో.. ప్రస్తుతం పర్యవేక్షణ లోపంతో ఆడిందే ఆటలా సాగిపోతోంది. పనులు జరిగే కొన్నిచోట్ల నిపుణుల పరిశీలన ఊసే లేకుంటే.. మరికొన్నిచోట్ల నిబంధనలకు పాతరేసి... నాణ్యతకు తిలోదకాలిస్తున్న తీరు తారసపడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అధికారులు మొక్కుబడి వైఖరితో.. గుత్తేదారులు నాణ్యతకు పాతరేసి... ప్రజాధనం వెనకేసే తీరు స్పష్టమవుతోంది. నాణ్యత, నిర్వహణపై దృష్టిసారించి.. ప్రగతి పనులు చక్కదిద్దాల్సిన తరుణమిది.

కాకినాడ ఆకర్షణీయ నగరంలో రూ.1,005 కోట్లతో అభివృద్ధికి నిర్దేశించిన వివిధ రకాల పనులు గడువు దాటినా ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఆధునిక సాంకేతికతను జోడించి కొత్త ఆవిష్కరణలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశం నెరవేరాలంటే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావాలి. గతంతో పోలిస్తే.. పనులు సమర్థంగా పట్టాలెక్కినా.. నిర్మాణాలూ మరింత నాణ్యంగా, వేగంగా సాగేలా కేఎస్‌సీసీఎల్‌తోపాటు.. క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలు నిశితంగా దృష్టి సారించాలి.

రూ.కోట్లు ఖర్చయినా..

స్మార్ట్‌ రోడ్డులో దెబ్బతిన్న డ్రెయినేజీ పైకప్పు

కాకినాడ నగరంలో సర్పవరం కూడలి నుంచి జగన్నాథపురంలోని బాలయోగి విగ్రహం వరకు రహదారిని రూ.115 కోట్లు వెచ్చించి స్మార్ట్‌ రోడ్డుగా అభివృద్ధి చేశారు. ఈ రెండు వరుసల రహదారికి ఇరువైపులా నడక దారి, సైక్లింగ్‌ ట్రాక్‌, భూగర్భ విద్యుత్తు, వైఫై కేబుల్‌ పనులు చేపట్టారు. ఈ నిర్మాణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో నిర్మాణం రోడ్డు పొడవునా ఒకే రీతిన జరగలేదు. అక్కడ అందుబాటులో ఉన్న స్థలాన్ని వాడుకుని ఎక్కడిక్కడ నిర్మాణాలు చేపట్టడంతో లక్ష్యం దెబ్బతింది. ప్రస్తుతం ఈ పనులు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. నడకదారిలో సిమెంటు బ్లాకులు ఊడిపోయాయి. వర్షం పడితే నీరు నిలిచిపోతుంది. కొన్నిచోట్ల పలకలు తొలగించి నీరు వెళ్లడానికి తాత్కాలిక ఏర్పాట్లుచేశారు. సమర్థ నిర్వహణ లేదు. ఈ రోడ్డు అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు వెచ్చించినా ఆకర్షణీయ లక్ష్యం మాత్రం ఆశించిన స్థాయిలో నెరవేరడంలేదు.

నిర్మాణాలు సాగుతున్నాయ్‌..

లోపాలు వెలుగుచూసిన మహాలక్ష్మినగర్‌లో డ్రెయిన్‌

ఆకర్షణీయ అభివృద్ధిలో భాగంగా రూ.235 కోట్లతో 30 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.674 కోట్లతో మరో 39 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. గోదావరి కళాక్షేత్రం, సైన్స్‌ సెంటర్‌, కన్వర్టబుల్‌ స్టేడియం, ఆధునిక శ్మశాన వాటికలు, జంతు వధశాల, పలు భవనాలు, మురికివాడల్లో రహదారులు, డ్రెయినేజీలు, కల్వర్టులు, వీధి దీపాల ఏర్పాటు పనులు చేపడు తున్నారు.

* గైగోలుపాడులో గతంలో ఉన్న రోడ్డునే ఎండ్‌ టు ఎండ్‌ పేరుతో రూ.లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశారు .ఈ మార్గం అక్కడక్కడ శిథిలమైనా నిర్వహణ లేదు.
* నూకాలమ్మ ఆలయ సమీపంలో స్మార్ట్‌ రోడ్డుతోపాటు డ్రెయిన్‌ నిర్మించారు. ఇది శిథిలం కావడంతో అదే స్థానంలో డ్రైనేజీతోపాటు ఇతర వనరులూ సమకూరుస్తున్నారు.
* వీధి దీపాల విషయంలోనూ అడుగడుగునా లోపాలే. సంబంధిత ప్రాజెక్టుకు 10 శాతం డిపాజిట్‌ గుత్తేదారుకు ఇవ్వలేదు.
* కొన్ని పనుల రీబౌండింగ్‌ హేమరీ పరీక్షల్లో 20 టన్నుల సామర్థ్యానికి కొన్నిసార్లు 15 టన్నులు వస్తున్నట్లు గుర్తించారు. అవి నెలరోజుల్లో సరిచేయాలని ఆదేశించారు.

ఎక్కడికక్కడ లోపాలు..

ఐకే రోడ్డుకు వెళ్లే మార్గంలో దెబ్బతిన్న కాలిబాట

నగరంలో కీలకమైన స్మార్ట్‌ రోడ్డు పనులు సరిగా లేవు. ఈ నిర్మాణం మొదట్లో ఆకర్షణీయంగా కనిపించినా.. తర్వాత క్రమంలో ఎక్కడికక్కడ శిథిలాలు కన్పిస్తున్నాయి. ఫుట్‌పాత్‌ నిర్మాణానికి వేసిన సిమెంటు దిమ్మెలు ఊడిపోగా.. భూగర్భ డ్రెయినేజీ, వైర్ల జంక్షన్‌ బాక్సుల వద్ద పైకప్పులు ధ్వంసం అయ్యాయి. చాలాచోట్ల వీటిని సరిచేయాల్సిందిపోయి... సిమెంటు పూతలతో కప్పేస్తుండటం గమనార్హం.

గుర్తించి సరిదిద్దుతున్నాం

కాకినాడ స్మార్ట్‌ సిటీ పనులు చివరి దశలో ఉన్నాయి. కాంక్రీట్‌ పనులు జరుగుతున్నప్పుడే సీవ్‌ టెస్ట్‌ చేస్తున్నాం. క్యూబ్స్‌ను సామర్థ్య పరీక్షకు పంపుతున్నాం. నిర్మాణం పూర్తయ్యాక కోర్‌ కటింగ్‌, రీబౌండింగ్‌ హేమర్‌ పరీక్షలు చేస్తున్నాం. ప్రతి పనికీ కార్పొరేషన్‌తోపాటు థర్డ్‌పార్టీ క్వాలిటీ చెక్‌ జరుగుతోంది. ఇప్పటికి పది పనుల్లో లోపాలు గుర్తించాం. గుత్తేదారుకు చెల్లించాల్సిన మొత్తంలో 10 శాతం మా దగ్గరే ఉంచుతున్నాం. నాణ్యతతో పనులు చేస్తేనే ఆ మొత్తం చెల్లిస్తున్నాం. పనుల్లో లోపాలు గుర్తించినా, సమస్య ఉన్నా 1800 425 0325 ఫోన్‌చేసి సమాచారం ఇవ్వొచ్చు.     - స్వప్నిల్‌ దినకర్‌, సీఈవో- ఎండీ, కేఎస్‌సీసీఎల్‌


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని