ఉద్యోగాలు కాదు ప్రాణాలు ముఖ్యం: WHO, IMF
close
Published : 05/04/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగాలు కాదు ప్రాణాలు ముఖ్యం: WHO, IMF

జెనీవా: ఉద్యోగాల కన్నా ముందుగా ప్రజల ప్రాణాలు కాపాడటమే అత్యవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అధినేతలు అంటున్నారు. కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని ‘మానవత్వానికి చీకటి కాలం’గా అభివర్ణించారు. ఆర్థిక కార్యకలాపాలు సవ్యంగా సాగాలంటే ముందు కొవిడ్‌-19 వైరస్‌ నియంత్రణలోకి రావాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌, ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టాలినా జార్జీవా అన్నారు. ప్రస్తుతం సమతూకం సాధించడం కష్టమని అంచనా వేస్తున్నారు.

చైనాలో మొదట వెలుగుచూసిన నావెల్‌ కరోనా వైరస్‌ ప్రస్తుతం భూమండలం మొత్తం పాకేసింది. దాదాపు సగం దేశాలు ఏదో ఒక రూపంలో లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 లక్షల మందికి ఈ వైరస్‌ సోకగా 50వేలకు పైగా మృతిచెందారు. లాక్‌డౌన్‌లతో ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడం వల్ల ఉపాధికి ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ బ్రిటిష్‌ పత్రిక ‘ది డైలీ టెలిగ్రాఫ్‌’కు సంయుక్తంగా ఓ కథనం రాశారు.

‘కొవిడ్‌-19ను నియంత్రించేందుకు ప్రతి దేశం ప్రయత్నిస్తోంది. సమాజ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలను నిలిపివేసి ముందుకు సాగుతున్నాయి. చాలాచోట్ల ప్రజల ప్రాణాలా లేక ఉద్యోగాలు కాపాడాలా అన్న కోణంలో ఆలోచనలు సాగుతున్నాయి. కానీ ఇది తప్పుడు వైఖరి. ముందు వైరస్‌ను కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడటమే ఇప్పుడు అత్యంత ముఖ్యం. ఇప్పటికే చాలా పేద దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలు కరోనా ఊచకోతకు సిద్ధంగా లేవు’ అని వారు అన్నారు.

‘ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాలంటే కొవిడ్‌-19పై పోరాడాల్సిందే. ఈ విపత్తు సమయంలో ఎదుగుతున్న మార్కెట్ల ప్రజల కోసం నాయకులు ముందడుగు వేయాలి. ఉద్యోగులు, వస్తు సరఫరా, ఆర్థిక వ్యవస్థపై ప్రభావంతో మహమ్మారి నియంత్రణ కష్టమవుతోంది. అత్యవసర ఆర్థిక సాయం చేయాలని 85 దేశాలు ఐఎంఎఫ్‌ను కోరాయి. అందుకే 50 బిలియన్‌ డాలర్ల విపత్తు సహాయక నిధిని 100 బిలియన్‌ డాలర్లకు పెంచాం. వనరులు, సమయం తక్కువగా ఉండటంతో సరైన ప్రాధామ్యాలపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అందరం కలిసి పనిచేయాలి’ అని టెడ్రోస్‌, క్రిస్టాలినా ఆ కథనంలో రాశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని