ఆ బాధ్యత మేం తీసుకున్నాం
close
Updated : 29/07/2021 04:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ బాధ్యత మేం తీసుకున్నాం

- ఎన్వీ ప్రసాద్‌

‘‘తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. అంత అభివృద్ధి చెందిన ఆ రంగాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత మనపై ఉంది’’ అన్నారు ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌. ఆయన మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై పారస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఇష్క్‌’. తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించారు. చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఎన్వీ ప్రసాద్‌ బుధవారం విలేకర్లతో ముచ్చటించారు.

‘‘నిర్మాణంతోపాటు... పంపిణీ, ప్రదర్శన రంగాల్లో మేం కొనసాగుతున్నాం. మేం ఎక్కడో ఒక చోట బాధ్యత తీసుకోవాలి కదా. ఈసారి కొవిడ్‌ తర్వాత మొదటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే బాధ్యతని తీసుకున్నాం. మంచి సినిమా అయితే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. థ్రిల్‌ని పంచే ఓ మంచి చిత్రమిది. ఇలాంటి సినిమాల్ని థియేటర్‌లో చూస్తే కలిగే అనుభూతి వేరు. థియేటర్లని కాపాడుకోవల్సిన బాధ్యత మనపై ఉంది’’.

* ‘‘తెలుగు రాష్ట్రాలు రెండు అయ్యాక ఏ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉండాల్సిందే.కొవిడ్‌ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటారు. మనం స్వీకరించాల్సిందే. థియేటర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోనూ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రదర్శన రంగంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ వ్యవస్థని కాపాడాల్సిన ఆదుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది కాబట్టి, సానుకూలంగా స్పందిస్తుందని నమ్ముతున్నాం. విజయవాడలో గురువారం ప్రదర్శనకారులంతా సమావేశమై, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. 30 నుంచి రెండు రాష్ట్రాల్లో సినీ ప్రదర్శనలు ఎప్పట్లాగే కొనసాగుతాయనే నమ్మకం ఉంది’’.

* ‘‘దక్షిణాది చిత్ర పరిశ్రమలతో పాటు.. హిందీ పరిశ్రమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా రంగానికి కల్పించిన వెసులుబాట్లు, ఇక్కడున్నన్ని సౌకర్యాలు దేశంలో ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే అనుమతులు లభిస్తాయి. విశాఖ, రాజమండ్రి, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్నన్ని చిత్రీకరణలు ఎప్పుడూ జరగలేదు. రెండేళ్ల కిందటే అనుమతుల మంజూరుని సరళతరం చేసింది. చిత్రీకరణలకి అంత చక్కటి వాతావరణం కల్పించిన ప్రభుత్వం, థియేటర్ల విషయంలోనూ తప్పక సానుకూల ధోరణిని కనబరుస్తుందనే నమ్మకం ఉంది’’.

* ‘‘మా సంస్థలో చిరంజీవి కథానాయకుడిగా ‘లూసిఫర్‌’ రీమేక్‌కి రూపొందుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆగస్టు 13 నుంచి హైదరాబాద్‌లోనే చిత్రీకరణ మొదలు పెడతాం. దీంతోపాటు మరో పెద్ద సినిమా త్వరలోనే పట్టాలెక్కుతుంది’’.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని