రూపురేఖల్లోనే కాదు.. మార్కుల్లోనూ కవలలే
close
Published : 14/07/2020 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూపురేఖల్లోనే కాదు.. మార్కుల్లోనూ కవలలే

నోయిడా: కవలలు అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చేది ఒకే రూపురేఖలు. తరచూ చూసేవారు కూడా కాస్త పరిశీలించి చూస్తేగానీ గుర్తుపట్టలేరు. ఇక ఒకే రకం డ్రెస్‌ వేసుకుంటే దగ్గరి బంధువులు గుర్తుపట్టడం కూడా కాస్త కష్టమే. అంతలా వారి రూపురేఖలు కలిసిపోతాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ, నోయిడాకు చెందిన కవలలు మాత్రం వీటన్నింటితో పాటు మార్కులు కూడా ఒకేలా సాధించారు. అదీ ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకం మార్కులు. 

వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన మానసి, మాన్య మార్చి 3, 2003న జన్మించారు. ఇద్దరి పుట్టుకకు మధ్య తొమ్మిది నిమిషాల వ్యవధి అని కుటుంబ సభ్యులు తెలిపారు. పుట్టిన సమయాలొక్కటే వీరి మధ్య తేడా అంటున్నారు తల్లిదండ్రులు. రూపురేఖలతో పాటు ఇద్దరి గొంతుకలు కూడా ఒకేలా ఉంటాయట. అలాగే ఆహారపు అలవాట్లు, క్రీడలపై ఆసక్తి.. ఇలా అన్నింటిలోనూ వారి అభిరుచి ఒకేలా ఉంటుందట. ఇద్దరికీ బ్యాడ్మింటన్‌ ఆడడం అంటే చాలా ఇష్టమట. అన్నింటిలో వీరి అభిరుచులు, ఇష్టాల్లో ఒకే పోలికలు ఉన్నట్లు మార్కుల్లోనూ అదే తీరు కొనసాగించారు. 

సోమవారం విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఇద్దరూ 95.8శాతం మార్కులు సంపాదించారు. ఇద్దరూ సైన్స్‌ గ్రూప్‌నకు చెందినవారే. ప్రతి సబ్జెక్టులో ఇరువురికి ఒకే రకం మార్కులు వచ్చాయని మాన్య తెలిపింది. చదువుకునేటప్పుడు ఇద్దరూ కలిసి చదువుకునేవారమని.. ఎవైనా సందేహాలుంటే ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్లమని తెలిపింది. ఫిజిక్స్‌లో మానసి కాస్త తనకంటే చురుగ్గా ఉండేదని.. తాను కెమిస్ట్రీ బాగా అర్థం చేసుకునేదాన్నని మాన్య వివరించింది. అయినా.. మార్కులు మాత్రం ఒకే రకంగా వచ్చాయని పేర్కొంది. 

నిత్యం ఒకే రూపురేఖలతో కళ్ల ముందు తిరుగుతూ ఆనందాన్ని పంచే పిల్లలు ఇప్పుడు మార్కుల్లోనూ అదే తీరు కొనసాగించడంతో వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు టీచర్లు, స్కూల్‌ యాజమాన్యం, బంధువులూ హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి..

సీబీఎస్‌ఈ ఫలితాల్లో బాలికల హవామరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని