సొంతింటికి పండగ హుషారు
close
Updated : 03/10/2020 05:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సొంతింటికి పండగ హుషారు

ఈనాడు, హైదరాబాద్‌

కొవిడ్‌తో కొత్త ఇంటి ఆలోచనలు కొన్నాళ్లు వాయిదా వేసినా..ఇక ఇప్పుడు కొనేందుకు ముందుకొస్తున్నారు. లాక్‌డౌన్‌లో రెండునెలల పాటు పూర్తిగా నిలిచిపోయిన విక్రయాలు జులై నుంచి పెరుగుతూ వస్తున్నాయి. సెప్టెంబరు నాటికి మెరుగయ్యాయి. వ్యవస్థీకృత నిర్మాణ రంగంలో 1650 వరకు ఇళ్లను విక్రయించారు. క్రితం ఏడాదితో పోలిస్తే తక్కువే అయినా లాక్‌డౌన్‌ అనంతరం చెప్పుకోతగ్గ స్థాయిలో కొనుగోళ్లు జరగడం సానుకూలాంశమని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. రాబోయేది పండగల కాలం కావడంతో నిర్మాణదారులు ఈ సీజన్‌పైనే పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు. రాయితీలు, బహుమతులతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇల్లు కొనేవారు సైతం పండగ సీజన్‌ను సెంటిమెంట్‌గా భావిస్తూ తమ బడ్జెట్‌లో దొరికే స్థిరాస్తుల వైపు చూస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో తెలుసుకొని
స్థిరాస్తులు కొనే స్థోమత ఉన్నప్పటికీ భవిష్యత్తుపై భయాలతో లావాదేవీలకు కొంతకాలంపాటు చాలామంది దూరంగా ఉన్నారు. ఇంకొందరు ధరలు ఏమైనా దిగి వస్తాయేమోనని ఎదురుచూశారు. ఆరునెలలైనా ఎక్కడా తగ్గిన దాఖలాలు కన్పించలేదు. కొవిడ్‌కు ముందున్న స్థాయిలోనే కొనసాగుతున్నాయి. కొందరు మాత్రం గతంలో కంటే ఎక్కువే చెబుతున్నారు. మార్కెట్‌ గురించి స్థిరాస్తి సంఘాలు, వ్యాపారులు చెప్పడమే కాదు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

 


దేశంలో మిగతా నగరాలకంటే

నగరంలో ఒడుదొడుకులు ఎదురైనప్పుడు విక్రయాలు మందగించాయి, తప్ప ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయని నిర్మాణదారులు అంటున్నారు. గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో ఇంటి ధరల పెరుగుదల దేశంలో మిగతా నగరాల కంటే అధికంగా ఉంది. దేశ సగటు పెరుగుదల రేటు 6 శాతం ఉంటే మన దగ్గర 29 శాతం పెరిగింది. ఇది కూడా కొనుగోలుదారులను కొనిపించేలా చేస్తోంది. 2018 ద్వితీయార్థలో ఫ్లాట్‌ సగటు చదరపు అడుగు ధర రూ.4,863 ఉండగా గత ఏడాదికి రూ.5047కి పెరిగింది. ఈ ఏడాది కొంచెం అటూఇటుగా ఉంది. పెద్దగా మారలేదు కానీ మున్ముందు ఇది కూడా పెరుగుతుందని బిల్డర్లు అంటున్నారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తిచేసుకుని సిద్ధంగా ఉన్నవి తక్కువగా ఉన్నాయని.. ఇవి పూర్తైతే కొత్తవాటిలో ఇప్పటి ధరలు దొరకవని చెబుతున్నారు.
భవిష్యత్తుపై ఆశాభావం..
కొవిడ్‌ నుంచి కోలుకుని పుంజుకునేందుకు హైదరాబాద్‌ లాంటి నగరానికి ఎంతో సమయం పట్టదని..మౌలిక వసతుల పరంగా దేశంలోని మిగిలిన నగరాల కంటే మెరుగ్గా ఉండటంతో పెట్టుబడులు వరస కడుతున్నాయని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. కొవిడ్‌ సమయంలోనూ పలు అంతర్జాతీయ సంస్థలు ఇటు చూడటం ఇందుకు నిదర్శనం. అమెరికాకు చెందిన దిగ్గజ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ భాగ్యనగరంలో తమ అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. డాటా కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే పలు సంస్థలు సంసిద్ధం వ్యక్తం చేశాయి. కొన్ని ప్రాంగణాలు నిర్మాణంలో ఉన్నాయి. మరోవైపు ఔషధనగరి వస్తుండటం, టీఎస్‌ బీసాస్‌ వంటి సంస్కరణలు స్థిరాస్తి మార్కెట్‌కు దోహదం చేసే అంశాలని అంటున్నారు. వీటన్నింటితో మార్కెట్‌ వేగంగా కోలుకుని పూర్వ స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు. అప్పటివరకు వేచి చూస్తే ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయని.. ముందే అందిపుచ్చుకోవాలని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు.
రూ.40-50 లక్షల స్థాయిలో..
అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లకు ఎక్కువ డిమాండ్‌ ఉన్నప్పటికీ వీటి లభ్యత నగరంలో తక్కువగా ఉంది. రూ.40-50 లక్షల ధరల శ్రేణిలో ఇల్లు కావాలని ఎక్కువమంది చూస్తున్నారు. కొత్తవి దొరక్కపోతే ఐదు నుంచి పదేళ్ల క్రితం కట్టిన పాత ఇళ్లైనా సరే అంటున్నారు. ఈ ధరల్లో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న బిల్డర్లు కట్టే సాధారణ అపార్ట్‌మెంట్లలోనే వీటి లభ్యత ఉంది. పేరున్న సంస్థలు ఈ బడ్జెట్‌లో చాలా పరిమితంగా మాత్రమే గేటెడ్‌ కమ్యూనిటీల్లో కడుతున్నారు. మౌలిక వసతులున్న ప్రాంతాల్లో ఫ్లాట్‌ కొనాలంటే రూ.65-80 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రధాన నగరం, ఐటీ కారిడార్‌లో కావాలంటే రూ.కోటి పైనే. ఇక్కడే విశాలంగా, విలాసవంతంగా ఉండాలంటే రూ.2-5 కోట్ల వరకు అవుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని