మార్గం సుగమం..వీరులకు వందనం
close
Published : 29/09/2021 06:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్గం సుగమం..వీరులకు వందనం

రహదారిపై రాళ్ల తొలగింపు

యథావిధిగా కొనసాగుతున్న రాకపోకలు

వారంతా యంత్రాలతో పోటీపడ్డారు. చిందిన స్వేదం వారికి లక్ష్యం గుర్తు చేసింది. అలుపు అన్నదే లేనట్లు... సొలుపు తమకు రానట్లు పనిచేశారు. అవిశ్రాంతంగా, అలవోకగా ఒకటి కాదు... రెండు కాదు... 30 గంటలపాటు శ్రమించారు. రాత్రి, పగలుకు తేడా మరిచి, ముందున్న లక్ష్యాన్ని కరిగించి ఎట్టకేలకు వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. అందుకే రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రజలు, వాహన వినియోగదారులు వారిని కొనియాడుతున్నారు. వీరులారా వందనం అంటూ చేతులు జోడిస్తున్నారు.

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లాలోని పొట్టంగి-సుంకి మార్గంలో ఘాట్‌ రోడ్డుపై మంగళవారం సాయంత్రం నుంచి రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఆదివారం రాత్రి ఘాట్‌ రోడ్డుపై నాలుగు చోట్ల కొండచరియలు విరిగిపడగా సోమవారం వేకువజాము నుంచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడడంతోపాటు పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టి, బురద, వర్షపు నీటితో ఘాట్‌ రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ముఖ్య మార్గంగా గుర్తింపు పొందిన ఘాట్‌ రోడ్డుపై అడ్డంకులు తొలగించేందుకు సహాయ బృందాలు 30 గంటలపాటు శ్రమించాయి. రోడ్డు పరిస్థితి దారుణంగా తయారవడంతో ముందుగా చిన్న వాహనాలను అనుమతిస్తున్నారు. పరిస్థితి మెరుగుపడ్డాక పెద్ద వాహనాలు విడిచిపెడతారు. ఎంతో శ్రమించి రాకపోకలు పునరుద్ధరించిన అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ మొహమ్మద్‌ అబ్దల్‌ అక్తర్‌ అభినందించారు. దీంతో రెండు రోజులుగా రాకపోకలు జరగక ఇబ్బందులు పడిన వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. తక్షణమే ఘాట్‌ రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు..

ఘాట్‌ రోడ్డుపై కొండచరియలు విరిగిపడడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి సహాయక చర్యలు ప్రారంభించారు. యంత్రాల సహాయంతో ఎన్‌హెచ్‌ఏఐ (భారత జాతీయ రహదారి సంస్థ), రెవెన్యూ అధికారులు, వాహనదారులు శ్రమించి రాత్రి 8 గంటల వరకు మూడు చోట్ల కొండచరియలు, మట్టి తొలగించారు. తిరిగి మంగళవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సాయంత్రం వరకు కొండచరియలు, మట్టి, బురద తొలగించే పనులు కొనసాగాయి. కొరాపుట్‌ ఎమ్మెల్యే, జిల్లా ప్రణాళిక సంఘం ఛైర్మన్‌ రఘురామ్‌ పడాల్‌ ఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించి అధికారులతో మాట్లాడారు. తహసీల్దార్‌ హరపడ మండల్‌, సమితి అభివృద్ధి అధికారి దేవ్‌ భూషణ్‌, ఠాణా అధికారి కైబల్య సెఠి, సుంకి అవుట్‌ పోస్ట్‌ ఎస్సై సంగ్రామ్‌ కేసరి స్వయిన్‌ల పర్యవేక్షణలో సహాయక కార్యక్రమాలు కొనసాగాయి. సుమారు 40 గంటలపాటు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ఆంధ్ర నుంచి పాలు, దినపత్రికలు, ఇతర నిత్యావసర వస్తువులు కొరాపుట్‌ జిల్లాకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అరకు, పార్వతీపురం మీదుగా రాకపోకలు సాగించారు.

అడ్డంకులు తొలగించే పనులు

 

 

 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని