గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చిందంతే! - heroins special story
close
Published : 09/11/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చిందంతే!

వేగంగా దూసుకెళ్తోన్న వాహనం మార్గమధ్యంలో ఏదైనా అడ్డొస్తే నెమ్మదిగా వెళ్తుంది. కొంతసమయం తీసుకుని మళ్లీ అదే స్థాయిలో దూసుకెళ్తుంది. కొందరు కథానాయికల విషయంలోనూ ఇంతే. కెరీర్‌ ప్రారంభంలో జోరు చూపించి ఏవేవో కారణాల వల్ల కాస్త తెరమరుగవుతారు. విరామం తీసుకున్నా.. కొన్నాళ్లకు పూర్వ వైభవం అందుకుంటారు. ఓ వైపు ప్రధాన పాత్ర.. మరో వైపు అతిథి పాత్ర చేస్తూ ఆశ్చర్యంలో పడేస్తారు. ఈ జాబితాలో నిలిచిన ప్రియమణి, శ్రియ, పూర్ణ, శ్రుతిహాసన్‌ సినీ కెరీర్‌ను పరిశీలిస్తే...

అటు బాబాయ్‌తో.. ఇటు అబ్బాయ్‌తో 

‘ఎవరే అతగాడు’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ప్రియమణి. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ పరిశ్రల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో   నటించింది. 2016లో వచ్చిన ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె మరే తెలుగు సినిమాలో కనిపించలేదు.  అలాంటిది ఆమె చేతిలో ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. వెంకటేష్‌ కథానాయకుడుగా శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తోన్న ‘నారప్ప’లో ప్రియమణి నాయికగా   అవకాశం చేజిక్కించుకుంది. దీంతోపాటు రానా హీరోగా వేణు ఊడుగుల రూపొందిస్తున్న ‘విరాటపర్వం’లో కామ్రేడ్‌ భారతక్కగా నటిస్తోంది.

సరికొత్త ‘గమనం’

శ్రియ శరన్‌ తెలుగు తెరతోనే నాయికగా మెరిసింది. తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లోనూ పేరు సంపాదించింది. తొలినాళ్లలో వరుసగా తెలుగు    సినిమాల్లో కనిపించిన శ్రియ 2018లో వచ్చిన ‘గాయత్రి’ తర్వాత ఇప్పటి వరకు దర్శనమివ్వలేదు. 2019లో ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’ చిత్రంలోని ఓ గీతంలో నర్తించి ఆకట్టుకుంది. ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. సుజనా రావు తెరకెక్కిస్తున్న ‘గమనం’లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతుందీ చిత్రం. భారీ అంచనాల నడుమ రాజమౌళి రూపొందిస్తున్న ‘రౌద్రం రుధిరం రణం (ఆర్‌ఆర్‌ఆర్‌)’లో కీలక పాత్ర పోషిస్తోంది.

పెద్ద చిత్రాల్లో తొలిసారి 

అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించకపోయినా   ప్రేక్షకుల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. కోలీవుడ్, మాలీవుడ్, సాండిల్‌వుడ్‌లలోనూ తన ప్రతిభ చూపింది. 2019లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ తర్వాత పూర్ణ టాలీవుడ్‌లో సందడి చేయలేదు. ఇప్పుడు వరస అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిలో పడింది. పూర్ణ ప్రధాన పాత్రధారిగా ‘బ్యాక్‌డోర్‌’, ‘సుందరి’ తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్‌ నాయిక కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రాబోతున్న ‘తలైవి’లో ఓ ముఖ్య పాత్ర భూమిక పోషిస్తుంది. ఏ.ఎల్‌.విజయ్‌ దర్శకుడు. ఇవే కాదు   బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో ఓ నాయికగా ఎంపికైందని సమాచారం.

మరోసారి ‘శ్రుతి’ కలిపింది 

ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌ వారసురాలిగా తెరంగ్రేటం చేసింది శ్రుతి హాసన్‌. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మంచి విజయం అందుకుంది. టాలీవుడ్‌ అగ్ర నాయకుల పక్కన ఆడిపాడిన ఈ భామ కొంత విరామం తీసుకుంది. 2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ తర్వాత శ్రుతి తెలుగు సినిమా చేయలేదు. ఆ లోటును భర్తీ చేసేందుకు గతంలో నటించిన ఇద్దరు సీనియర్‌ హీరోలతో మళ్లీ చేయి కలిపింది. అందులో ఒకటి రవితేజ్‌ నటిస్తోన్న ‘క్రాక్‌’. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మరొకటి ‘వకీల్‌ సాబ్‌’. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు తెరకెక్కిస్తున్నారు.

చిత్రసీమలో విజయానికే ప్రామాణికం. అలాంటిది ఈ నాయికలు తెలుగులో నటించిన చివరి చిత్రం  ఆశించినంత విజయం సాధించకపోయినా... సుదీర్ఘ విరామం తీసుకున్నా.. ప్రతిష్టాత్మక చిత్రాల్లో అవకాశం దక్కించుకోవడం విశేషం.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని