Sunil Gavaskar: పుజారా విధానమే అది.. నమ్మకం లేదంటే వేరొకరిని తీసుకోండి - if team feels pujaras method doesnt work it can look for someone else says gavaskar
close
Published : 04/08/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sunil Gavaskar: పుజారా విధానమే అది.. నమ్మకం లేదంటే వేరొకరిని తీసుకోండి

ముంబయి: టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారాకు క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అండగా నిలిచారు. సంప్రదాయ క్రికెటింగ్‌ ఆడుతూనే పుజారా మ్యాచులు గెలిపించాడని ప్రశంసించారు. అతడు నెమ్మదిగా పరుగులు చేస్తున్నాడని భావిస్తే కోహ్లీసేన అతడి స్థానంలో మరొకరిని ఎంచుకోవచ్చని వెల్లడించారు. ఇంగ్లాండ్‌లో ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ బాగుంటాడని, కీపర్‌గా రిషభ్ పంత్‌ను తీసుకోవాలని సూచించారు.

‘అంతర్జాతీయ క్రికెట్లో పుజారా ఒక పద్ధతికి అలవాటు పడ్డాడు. ఆ విధానాన్నే అతడు నమ్ముతున్నాడు. జట్టు యాజమాన్యానికి ఆ పద్ధతిపై నమ్మకం లేకుంటే మరొకరిని తీసుకోవచ్చు. కానీ పుజారా విధానం టీమ్‌ఇండియాకు విజయాలను అందించింది. ఒక ఎండ్‌లో గోడలా పుజారా ఉన్నాడనే ధైర్యంతో మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ సులువుగా పరుగులు చేస్తున్నారు’ అని గావస్కర్‌ తెలిపారు. ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పుజారా ఒక్క శతకమూ చేయలేదు. 30 సగటుతో మాత్రమే పరుగులు చేయడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి.

శుభ్‌మన్‌ గిల్‌ లేకపోవడంతో రోహిత్‌ శర్మతో కలిసి కేఎల్‌ రాహుల్‌ను ఓపెనింగ్‌ చేయించాలని సన్నీ అంటున్నారు. ‘మూడు రోజుల మ్యాచులో రాహుల్‌ శతకం చేశాడు. ఓపెనర్‌గా అతడే మెరుగు. 2019 సీజన్లో మయాంక్‌ అదరగొట్టిన మాట నిజమే. కానీ ఆసీస్‌ పర్యటనలో అతడు ఇబ్బంది పడ్డాడు. శతకం చేయడం వల్ల రాహుల్‌ ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. 2018లో ఇంగ్లాండ్‌లో అతడు టెస్టు శతకం చేసిన సంగతి మర్చిపోవద్దు’ అని తెలిపారు. కాగా మయాంక్‌ కంకషన్‌కు గురైన సంగతి తెలిసిందే.

జట్టు ఐదుగురు బ్యాట్స్‌మన్‌, కీపర్‌తో బరిలోకి దిగితే రిషభ్ పంత్‌ను ఎంచుకోవడం మంచిదని సన్నీ తెలిపారు. స్పిన్‌కు స్పందించే ఉపఖండంలో వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలు ఎక్కువగా అవసరం ఉంటాయని పేర్కొన్నారు. పేస్‌, స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్‌లో పంత్‌కే అవకాశం ఇవ్వాలని సూచించారు.

ఈ పర్యటనలో భారత్‌ 4-0 లేదా 3-1 తేడాతో సిరీసు గెలుస్తుందని అంచనా వేశారు. 25లో 22 రోజులు ఎండ బాగా ఉంటే కోహ్లీసేన సిరీసు గెలవడం ఖాయమని వెల్లడించారు. 2018తో పోలిస్తే ఇంగ్లాండ్‌ పేసర్‌ అండర్సన్‌ మూడేళ్లు వయసు పెరిగాడని అదే కోహ్లీ మూడేళ్లు అనుభవం సంపాదించాడని అన్నారు. విరాట్‌కోహ్లీ, పుజారా గొప్ప బ్యాట్స్‌మెన్‌ అని పరుగుల దాహంతోనే ఉంటారని పేర్కొన్నారు. వారు పరుగులు చేసే విధానమే భిన్నమని వివరించారు. గొప్ప ఆటగాళ్లు ఆడిన బంతిని మర్చిపోయి తర్వాతి బంతిపైనే దృష్టి సారిస్తారని వెల్లడించారు. బుధవారం నుంచి ఇంగ్లాండ్‌, భారత్‌ తొలి టెస్టు ఆరంభమవుతున్న సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని