Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు - morning news at nine am
close
Published : 25/09/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. మైత్రీ బంధం.. మరింత దృఢం

వ్యూహాత్మక భాగసామ్యంలో భారత్‌, అమెరికా మైత్రీ బంధం మరింత దృఢతరం కానుంది. పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాద ముప్పు నివారణ, అఫ్గానిస్థాన్‌ పరిణామాలు, కొవిడ్‌పై ఉమ్మడిపోరు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం సహా ఆర్థిక, రక్షణ సంబంధ వ్యవహారాల్లో పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని, స్నేహాన్ని మరిన్ని కొత్త రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించాయి. శుక్రవారం ఉదయం శ్వేతసౌధానికి చేరుకున్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు.

కమలా హారిస్‌కు అపూర్వ కానుకలు

2. సివిల్స్‌లో తెలుగు తేజాలు

సివిల్‌ సర్వీసెస్‌లో మరోసారి తెలుగు అభ్యర్థులు  సత్తా చాటారు. వందలోపు ర్యాంకుల్లో ఎనిమిది మంది నిలిచారు. అందులో అయిదుగురు అమ్మాయిలు కావడం విశేషం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ  నుంచి కనీసం 40 మంది ఎంపికైనట్లు ప్రాథమిక సమాచారం. హైదరాబాద్‌లో స్థిరపడిన వరంగల్‌కు చెందిన శ్రీజ 20వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్‌గా నిలిచారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన అన్నదమ్ములు రాళ్లపల్లి జగత్‌సాయి 32వ ర్యాంకు, రాళ్లపల్లి వసంత్‌కుమార్‌ 170వ ర్యాంకు సాధించడం విశేషం.

3. ఇంట్లో మరణించినా.. కరోనా పరిహారం

కొవిడ్‌ బారినపడి ఆసుపత్రుల్లోనే కాదు.. ఇళ్లలోనూ మరణిస్తుంటారు. ఆసుపత్రుల్లోనే కాకుండా ఇళ్లలో మృతి చెందిన వారికి కూడా కరోనా పరిహారం అందనుంది. అయితే.. ‘కరోనాతో మృతి చెందారు’ అంటూ వైద్యుడు జారీ చేసే మరణ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత అధికారులకు సమర్పించాలి. దీని ఆధారంగా బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం అందుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సాధారణంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 25 రోజుల్లోపే 95 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. కొవిడ్‌గా తేలిన తేదీ నుంచి 30 రోజుల్లోపు సంభవించే మరణాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

4. మద్యం విక్రయాలు పెరిగితే.. తగ్గాయంటారా?

దేశంలోనే అతి పెద్ద లిక్కర్‌ డాన్‌ సీఎం జగన్‌రెడ్డి అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో శుక్రవారం మాట్లాడారు. ‘సీఎం డ్యాష్‌బోర్డు గణంకాల ప్రకారం 2020 సెప్టెంబరు వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలు 62.82 లక్షల కేసులుంటే.. ఈ ఏడాది 1.15 కోట్లకు చేరింది. దాదాపుగా 53 లక్షల కేసుల మద్యం విక్రయాలు పెరిగాయి. అదే బీరు అమ్మకాలు గతేడాది సెప్టెంబరు 23 నాటికి 14.97 లక్షల కేసులు ఉంటే, ఈ ఏడాది సెప్టెంబరుకు 36.59 లక్షలు విక్రయించారు. దాదాపుగా 53 లక్షల కేసుల ఐఎమ్‌ఎల్‌, 21 లక్షల బీరు అమ్మకాలు పెరిగితే సీఎం సిగ్గులేకుండా మద్యం అమ్మకాలు తగ్గాయని చెబుతున్నారు’ అని మండిపడ్డారు.

5. వానల్లోనూ.. కారెందుకు కాలుతోంది!

వానాకాలంలోనూ రహదారులపైనే కార్లు తగలబడిపోతున్నాయి. ఇటీవల శంషాబాద్‌ బాహ్య వలయ రహదారిపై జరిగిన ఓ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. వాహనం నడుపుతున్న వైద్యుడు అందులోనే సజీవ దహనమయ్యాడు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. కొత్త మోడళ్ల కార్లు వస్తున్నాయి. అగ్నిమాపక వ్యవస్థ ఉన్న ఖరీదైన వాహనాలు తయారవుతున్నాయి. అగ్ని ప్రమాదాలకు గురికాకుండా కొన్ని పరికరాలను కార్లలో ఉంచినా సరే.. అంతర్గత లోపాలు, సరైన పరిశీలన లేకపోవడంతో కార్లలో మంటలు వ్యాపిస్తున్నాయి.

6. బాలుకు... ప్రేమతో

అప్పుడే ఏడాది కాలం గతం ఒడిలోకి జారిపోయింది. ఆకాశమంత ఏకాంతం... అంతే తెలియని నిశ్శబ్దం.. ఏ పెదవిలో చేరి పదాలు- మధుర నదీ నదాలుగా పరవళ్లు తొక్కుతాయో.. ఏ గొంతులో చేరి స్వరాలు- సరిగమల వరాలుగా సొగసులు ఒలికిస్తాయో.. ఏవీ.. ఎక్కడ? కన్నుమూసిన పాటవా.. ? రెప్పమాటున పొంగిన కన్నీటివా.. ? తీగతెగిన వీణవా.. మూగవైన వేణువా..? తెల్లవారకముందే నింగి నుంచి మాయమైన నిండు చంద్రుడా అమ్మ ఒడికి చేరాలని తరలివెళ్లిన సరస్వతీ పుత్రుడా సకలజగన్మిత్రుడా..శాపవశాత్తు ఇలపై పుట్టిన గంధర్వుడా..

7. విజయాన్ని లాగేసింది

మ్యాచ్‌ను పేలవంగా ఆరంభించినా, మధ్యలో గొప్పగా పుంజుకున్న చెన్నై ఐపీఎల్‌ రెండో అంచెలో మరో స్ఫూర్తిదాయక విజయాన్నందుకుంది. శుక్రవారం ఆ జట్టు 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట బెంగళూరు 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. పడిక్కల్‌ (70; 50 బంతుల్లో 5×4, 3×6), కోహ్లి (53; 41 బంతుల్లో 6×4, 1×6) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  బ్రావో (3/24) ఆ జట్టును దెబ్బ తీశాడు. చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నందుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (38; 26 బంతుల్లో 4×1, 1×6), అంబటి రాయుడు (32; 22 బంతుల్లో 3×4, 1×6), డుప్లెసిస్‌ (31; 26 బంతుల్లో 2×4, 2×6) సత్తా చాటారు.

8. బుల్లెట్టు పాటే ఆడపిల్లైంది!

అమ్మాయి నుంచి అమ్మమ్మల దాకా.. పిల్లాడి నుంచి ముసలివాళ్ల దాకా... పెళ్లి బారాత్‌ నుంచి పార్టీలో డీజేదాకా... ఎక్కడ చూసినా బుల్లెట్టు బండి పాటే తెలుగు నేలని ఊపేస్తోంది... డుగ్గు డుగ్గు డుగ్గంటూ కుర్రకారుని స్టెప్పులేయిస్తోంది... రాసింది షాద్‌నగర్‌ యువకుడు కాటుక లక్ష్మణ్‌. పదేళ్లుగా కలంతో దోస్తీ చేస్తున్న ఈ కళాకారుడిని ఈ ఒక్క గీతం అందలం ఎక్కించేసింది. సోషల్‌ మీడియాలో, పెళ్లి వేడుకల్లో, గణేష్‌ మండపాల్లో.. ఎక్కడ చూసినా ఈ బుల్లెట్టు బండి పాటే. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఆడబిడ్డా ఈ పాటని సొంతం చేసుకుంటోంది.

9. వాట్సప్‌ ‘గురు’ మహేశ్‌ భగవత్‌

సివిల్స్‌లో మౌఖిక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విలువైన సలహాలు.. సూచనలిస్తూ వాట్సప్‌ ‘గురు’గా పేరొందిన రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. శుక్రవారం విడుదలైన యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో ఆయన సలహాలు, సూచనలు పాటించిన వంద మందికిపైగా అత్యుత్తమ ర్యాంకులు పొందారు. మెయిన్స్‌కు ఎంపికైన వారి ఆలోచనలు, దృక్పథాలను తెలుసుకుని మార్పులు సూచిస్తూ వారి విజయానికి సహకరిస్తున్నానని సీపీ మహేశ్‌భగవత్‌‘ఈనాడు’తో చెప్పారు.మౌఖిక పరీక్షకు వారం రోజుల ముందు అనీషా శ్రీవాత్సవ్‌ తన తండ్రితో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి మాట్లాడారన్నారు.

10. జోరు సరే.. జర భద్రం

ఒక్కో షేరుకు ఉన్న వాస్తవిక విలువ ఎంత, ఏ ధరలో దాన్ని కొనవచ్చు, మంచి ప్రతిఫలం రావడానికి ఎంతకాలం ఉండాలి. ఆ క్రమంలో ఎదురయ్యే రిస్కు ఏమిటి? అనే ప్రాథమిక సూత్రాలు పక్కకు వెళ్లిపోతున్నాయి. ఈరోజు కొని, తెల్లారేసరికి ధనికులం అయిపోవాలనే ఆలోచనే ఎక్కువమంది మదుపరులలో కనిపిస్తోంది. ఇవి ప్రమాదకర సంకేతాలని నిపుణులు భావిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌లో రికార్డుల మోతమోగుతోంది. సూచీలు పైపైకి పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్‌ 60,000 పాయింట్లు అధిగమిస్తే, నిఫ్టీ 17,800 పాయింట్ల పైకి చేరింది. షేర్ల ధరలు పైపైకి పోతున్నాయి. ఒకపక్క విదేశీ సంస్థలు, మరోపక్క దేశీయ పెట్టుబడి సంస్థలు.. అదనంగా చిన్న మదుపరులు పోటీపడి పెట్టుబడులు పెడుతూ స్టాక్‌మార్కెట్ల చరిత్రను తిరగరాస్తున్నారు.

60000  సరికొత్త శిఖరాన సెన్సెక్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని