రాహుల్! మీ పార్టీ పాలనలోని రాష్ట్రాన్ని చూడండి - punjab government is earning profits from the covid vaccination drive
close
Published : 04/06/2021 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాహుల్! మీ పార్టీ పాలనలోని రాష్ట్రాన్ని చూడండి

చండీగఢ్‌: కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమం నుంచి పంజాబ్ ప్రభుత్వం లాభం పొందుతోందనే విమర్శలు గుప్పుమన్నాయి. అధిక ధరలకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం టీకాలను దారి మళ్లిస్తోందంటూ ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అయితే టీకాలపై తనకు నియంత్రణ లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వివరణ ఇచ్చారు. అలాగే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తామని మీడియాకు తెలిపారు. ‘కరోనా చికిత్స, నమూనాల సేకరణ, నిర్ధారణ పరీక్షలు, టీకా శిబిరాల నిర్వహణ వంటి వ్యవహారాలు నేను చూసుకుంటాను. టీకాల అంశం నా పరిధిలోనిది కాదు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తాం’ అని ఆరోగ్య శాఖ మంత్రి బీఎస్ సిద్ధు శుక్రవారం వెల్లడించారు. 

టీకా తయారీ సంస్థల నుంచి పంజాబ్ ప్రభుత్వం రూ.400లకే కొనుగోలు చేస్తోందనీ, వాటిని రూ.1,060కి ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయిస్తోందనీ, ప్రభుత్వం ఒక్కోడోసుపై రూ.660 లాభం పొందుతోందనీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ గురువారం ట్విటర్ వేదికగా ఈ టీకా కుంభకోణాన్ని బయటపెట్టారు. ‘ప్రభుత్వం దగ్గర రూ.1,060కి కొనుగోలు చేసిన టీకా డోసులను ప్రైవేటు ఆసుపత్రులు రూ.1,560కి అందిస్తున్నాయి. దీంతో ఒక కుటుంబానికి మొదటి డోసు ఖర్చు సుమారు ఆరు నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు వస్తుంది. ఇదొక కుంభకోణం. టీకాలు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తోన్న ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలి. ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధుపై కేసు పెట్టాలి’ అని నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

అలాగే ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. ‘రాహుల్ గాంధీ! ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడం మాని, మొదట మీ పార్టీ పాలనలోని రాష్ట్రాన్ని చూసుకోండి. పంజాబ్‌కు 1.40లక్షలకు పైగా కొవాగ్జిన్ టీకా డోసులను రూ.400లకే అందించాం. వాటిని రూ.1,000 కింద 20 ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం అమ్మేసింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తోందంటూ ఇతర మంత్రులు కూడా విమర్శించారు. మరోవైపు టీకా ధరల్లో తేడాలు, కొరత దృష్ట్యా కేంద్రం అనుసరిస్తోన్న టీకా విధానంపై ఇప్పటికే సుప్రీం పలు ప్రశ్నలు సంధించింది.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని