Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at one pm
close
Published : 16/09/2021 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతించింది. నిమజ్జనం చేసుకోవచ్చని.. ఈ ఏడాదికి మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి వీల్లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం నిమజ్జనానికి అనుమతినిచ్చింది. 

2. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్‌

ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ఎన్నికలను సమర్థించిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చింది. 

3. సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య

సంచలనం సృష్టించిన సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నాష్కల్‌  రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు.  రాజు మృతిని డీజీపీ మహేందర్‌రెడ్డి ధ్రువీకరించారు.

హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్‌

4. కేసులు, మరణాల్లో ముందువరుసలో కేరళ

దేశంలో కొవిడ్‌ కొత్త కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 30,570 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న 431 మంది మృతి చెందడంతో కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,43,928 పెరిగింది. ఒకరోజులో 38 వేల మంది కోలుకున్నారు. కేరళలో నిన్న 17,681 మందికి వైరస్ సోకింది. 208 మంది మరణించారు.

5. మోడెర్నాతో కనీసం 6 నెలల రోగ నిరోధకత

కొవిడ్‌-19 నియంత్రణకు వాడే మోడెర్నా వ్యాక్సిన్‌తో కలిగే రోగనిరోధక శక్తి కనీసం ఆర్నెల్లు ఉంటుందని, ఈ వ్యాక్సిన్‌ వినియోగించిన వ్యక్తులకు మళ్లీ ఎక్కడా బూస్టర్‌ డోసు అవసరం కూడా రాలేదని ఓ అధ్యయనం తేల్చింది. ఓ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం మేరకు.. మనిషిలో సహజ రోగనిరోధకత వృద్ధి చెందే ఈ ఆర్నెల్ల కాలం ఎంతో కీలకం. 

6. ఎన్నికల ప్రణాళికల్లో నగదు బదిలీ హామీ అవినీతే! 

‘ఎన్నికల్లో అవినీతిపై ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు జంకుతున్నారు?’ అంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు.. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో నగదు బదిలీ హామీ ఇవ్వడం కూడా ఎన్నికల అవినీతి కిందికే వస్తుందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించాల్సిందిగా కూడా కోరింది.

7. ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయిన బైడెన్‌..!

చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో యూఎస్‌, బ్రిటన్, ఆస్ట్రేలియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానులు బోరిస్‌ జాన్సన్‌, స్కాట్ మోరిసన్ మధ్య వర్చువల్ సమావేశం జరిగింది. ఆ సమయంలో మాట్లాడిన బైడెన్.. ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయారు.

8. సోనూసూద్‌ నివాసానికి మరోసారి ఐటీ అధికారులు..!

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సోనూసూద్‌ నివాసానికి మరోసారి ఆదాయపు పన్నుశాఖ అధికారులు చేరుకున్నారు. నిన్న సోనూ నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరోసారి ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు.. లఖ్‌నవూకు చెందిన రియల్‌ఎస్టేట్‌ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

9. లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.23 సమయంలో నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 17560 వద్ద, సెన్సెక్స్‌ 132 పాయింట్లు పెరిగి 58,855 వద్ద ట్రేడవుతున్నాయి. ఎనర్జీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు తప్ప మిగిలినవన్నీ లాభాల్లో ఉన్నాయి. అత్యధికంగా టెలికాం సూచీ 2.7శాతం లాభపడింది. 

10. రోహిత్ శర్మ ఆ ఫామ్‌ని ఉపయోగించుకోవాలి: సాబా కరీమ్‌

సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫామ్‌ను ఉపయోగించుకోవాలని భారత మాజీ వికెట్ కీపర్ సాబా కరీమ్‌ అన్నాడు. రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తే అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగి కెప్టెన్‌గా విజయవంతమవుతాడని పేర్కొన్నాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని