Covid19: టీకాల్లో జోడీ నంబర్‌1 దొరికేనా..! - why mixing covid19 vaccines
close
Published : 10/06/2021 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid19: టీకాల్లో జోడీ నంబర్‌1 దొరికేనా..!

వ్యాక్సిన్‌ కాంబినేషన్‌పై దృష్టి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని ప్రజలకు వైద్యులు రెండు డోసుల్లో వేర్వేరు టీకాలను వేశారు. ఇది చర్చనీయాంశమైంది. వాస్తవానికి వ్యాక్సిన్లను ఇలా కాంబినేషన్లతో వినియోగిస్తారు. దానిని హెటిరోలోగస్‌ ఇమ్యూనైజేషన్‌ అంటారు. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది అధికారుల పర్యవేక్షణలో కాదు.. నిర్లక్ష్య ఫలితం. ఇక ప్రపంచ వ్యాప్తంగా రెండు వేర్వేరు టీకాల డోసులు ఇవ్వడంపై ప్రయోగాలు మొదలయ్యాయి. భారత్‌లో కూడా ఈ విధానంపై దృష్టిపెట్టారు. త్వరలో ఈ విధానం ప్రభావాన్ని అంచనావేసే ప్రయత్నాలు మొదలు కానున్నాయి. అనుమతులు రావాల్సి ఉంది. భారత్‌లో ప్రస్తుతం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి టీకాలు అందుబాటులో ఉన్నాయి. 

రెండు విభిన్న డోసులపై ప్రయోగాలు ఎందుకు..?

రెండు విభిన్న టీకాలు వాడిన సందర్భాల్లో వ్యాధి నిరోధక శక్తి బలంగా స్పందిస్తుందని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌ భాగాలను తీసుకొని చేసే టీకాల్లో ఇటువంటి ప్రభావం కనిపిస్తుంది. భారత్‌లో ప్రస్తుతం కొవిషీల్డ్‌ వినియోగిస్తున్నారు. దీనిలో చింపాంజీ నుంచి సేకరించిన అడినోవైరస్‌ను వినియోగించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఇది శరీరానికి శిక్షణ ఇస్తుంది. దీని రెండు డోసుల్లో ఒకే రకమైన వైరస్‌ను వినియోగించారు. ఇక రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకా రెండు డోసుల్లో రెండు వేర్వేరు అడినోవైరస్‌లను వినియోగించారు. ఇది మెరుగైన సంరక్షణ ఇస్తుందని స్పుత్నిక్‌-వి తయారీ సంస్థ పేర్కొంది.  

మ్యూటేషన్లు.. వేరియంట్లను ఎదుర్కోవచ్చా..?

రెండు రకాల టెక్నాలజీలతో చేసిన టీకాలను వినియోగించినప్పుడు శరీరం విస్తృత స్థాయిలో వ్యాధినిరోధక శక్తిని సిద్ధం చేస్తుంది. ఉదాహరణకు ఒక వైరల్‌ వెక్టార్‌ టీకా, ఒక ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను వినియోగించడం వంటిది. ఈ రెండు టీకాలు శరీరాన్ని కరోనావైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌పై పనిచేసేలా సిద్ధం చేస్తాయి. రెండు వేర్వేరు విధానాల్లో ఉండటంతో వ్యాధినిరోధక శక్తి బలపడుతుందని ఆక్స్‌ఫర్డ్‌ గ్రూప్‌ ప్రొఫెసర్‌ మాథ్యూ స్నేప్‌ వివరించారు. ప్రస్తుతం ఆయన ఇటువంటి టీకాల ప్రయోగాల బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇక పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు శ్రీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘విభిన్న టీకాలను వాడటం వల్ల వైరస్‌ వేరియంట్లను సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు డెల్టా వేరియంట్‌పై  ఆస్ట్రాజెనికా టీకా కొంత తక్కువ సంరక్షణ కలిగిస్తోందని యూకే పరిశోధనలు తెలిపాయి. అలాంటప్పుడు రెండో డోస్‌ వేరే టీకా తీసుకొంటే విభిన్న యాంటీజెన్‌లకు శరీరం అలవాటు పడి రోగనిరోధక శక్తి మెరుగవుతుంది’’ అని తెలిపారు.  

కొరతకు చెక్‌ పెట్టొచ్చు..

చాలా చోట్ల టీకా కొరత ఉండటంతో ప్రజలు తొలి డోసు వేసుకొన్న టీకా కోసం కేంద్రాలకు రావడం.. అవి లేకపోతే తిరిగి వెళ్లిపోవడం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిని వ్యాక్సిన్‌ మిక్సింగ్‌తో అధిగమించవచ్చు. ‘‘తాత్కాలికంగా అయినా వేర్వేరు టీకాలు వేస్తే సమస్యను పరిష్కరించవచ్చు. ప్రజలే తాము తొలిడోసు తీసుకొన్న టీకా కోసం రావడం, లేదా నచ్చిన టీకా కోసం రావడం తగ్గిపోతుంది’’ అని ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌ పేర్కొన్నారు. అదే దీర్ఘకాలంలో అయితే మనం పొందే ఉత్తమ రక్షణ ఏమిటనే దాని ఆధారంగా ఉత్తమ ఫలితాలను ఎలా సాధించాలనే అంశంపై దృష్టిపెడతామని వెల్లడించారు.

టీకాపై ఆందోళనలు ఉన్నప్పుడు..

ఒక టీకా తీసుకొన్న తర్వాత ఏమైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ తలెత్తితే రెండో డోసు కింద మరో టీకా తీసుకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌, కెనడాల్లో ఆస్ట్రాజెనికా టీకాకు రక్తం గడ్డకట్టించే లక్షణాలు ఉన్నాయంటూ యువతకు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అలాంటి వారికి వేరే టీకా ఇచ్చి ఇమ్యూనైజేషన్‌ పూర్తి చేయవచ్చు. 

సమస్యలూ ఉన్నాయ్‌..

* కొవిడ్‌-19 టీకాలకు వేగంగా అనుమతులు మంజూరు చేశారు. ఇక కాంబినేషన్లలో టీకాలు ఇవ్వడం అనేది ఎంత వరకు సురక్షితమో తెలియదు. దీనిపై పూర్తిస్థాయిలో పరీక్షలు జరగాలి. 

* ఏ రెండు టీకాలను కాంబినేషన్‌గా ఇవ్వాలనే ఇంత వరకు నిర్ధారణ కాలేదు. 

* వ్యాక్సిన్లలో తేడాలు కూడా అడ్డంకిగా మారాయి. టీకాలు బయటకు తీశాక ఎంతకాలం నిల్వ ఉంటాయి. వాటిని ఎంత ఉష్ణోగ్రత వద్ద భద్రపర్చాలి, రవాణా, టీకాలకు ఉండే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 

*  the Com-COV ప్రయోగ పరీక్షల్లో ఆస్ట్రాజెనికా, ఫైజర్‌ టీకాలను కాంబినేషన్‌కు వాడారు. కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెరిగినట్లు గుర్తించారు. కాకపోతే ఇప్పటి వరకు టీకాలను కాంబినేషన్‌లో ఇవ్వడం వల్ల భారీ ప్రమాదం జరిగినట్లు ఎక్కడా సమాచారం లేదు. ‘‘మన రోగ నిరోధకశక్తి చాలా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. రెండు వేర్వేరు టీకాల వల్ల చిన్నచిన్న సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెరుగుతున్నట్లు గుర్తించాం. పెద్ద ఇబ్బందులు ఏమీలేవు’’ అని డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ పేర్కొన్నారు. 

గతంలో ఏవైనా టీకాలను ఈ రకంగా ఇచ్చారా..?

కొన్నేళ్లుగా ఈ విధానంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎబోలా వంటి వైరస్‌లను ఎదుర్కోవడానికి చేస్తున్నారు. ఒకే రకమైన టెక్నాలజీతో చేసిన టీకాలను మాత్రమే వాడారు. భారత్‌లో రోటా వైరస్‌ టీకాలను కాంబినేషన్లో వినియోగించడం చూస్తూనే ఉన్నాం. భారత్‌లో వాడే రోటావైరస్‌ టీకాలు భిన్నమైనవి కావడంతో ఈ విధంగా వాడుతున్నారు. 

ప్రస్తుతం ఏ దేశాల్లో ప్రయత్నించారు..?

కొన్ని దేశాల్లో ఈ సమ్మేళన విధానం అమలు చేశారు. కెనడా, యూకే, కొన్ని ఐరోపా సమాఖ్య దేశాలు వీటిలో ఉన్నాయి. వీరు ఆస్ట్రాజెనికా మొదటి డోసు తర్వాత సమస్యలను తప్పించేందుకు ఈ విధానం వాడారు. స్పెయిన్‌, దక్షిణ కొరియాల్లో కూడా వాడారు. ఆస్ట్రాజెనికా టీకాకు కాంబినేషన్‌లో ఎంఆర్‌ఎన్‌ఏఈ టీకాలను ఇచ్చారు. రష్యా కూడా ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్‌-వి టీకాలను ఈ రకంగా ఇవ్వాలని చూస్తోంది.  

భారత్‌లో పరిస్థితి ఏంటి?

డిసెంబర్‌ నాటికి వైరల్‌ వెక్టార్‌, ఎంఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ విధానాల్లో చేసిన ఏడెనిమిది టీకాలు అందుబాటులో ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో మరిన్ని కాంబినేషన్లలో టీకాలను ప్రయత్నించవచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని