కొత్తరకంపై ‘కొవాగ్జిన్‌’ పనిచేస్తుంది..! - Covaxin can work against mutated coronavirus Bharat Biotech
close
Published : 30/12/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తరకంపై ‘కొవాగ్జిన్‌’ పనిచేస్తుంది..!

స్పష్టంచేసిన భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్‌: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం వైరస్‌పై ‘కొవాగ్జిన్’‌ టీకా పనిచేస్తుందని భారత్‌ బయోటెక్‌ స్పష్టంచేసింది. వివిధ మార్పులకు గురైన (మ్యుటేషన్‌ చెందిన) కరోనా వైరస్‌ నుంచి కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ రక్షణ కల్పిస్తుందని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డెరెక్టర్ ‌(సీఎండీ) డాక్టర్‌ కృష్ణ ఎల్ల వెల్లడించారు. వ్యాక్సిన్‌ వినియోగం కోసం అత్యవసర లైసెన్స్‌ ఇవ్వాలని ఇప్పటికే నియంత్రణ సంస్థలను సంప్రదించినట్లు పేర్కొన్నారు.

‘కరోనా వైరస్‌లో చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి. వైరస్‌లో ఎన్ని మార్పులు చోటుచేసుకున్నప్పటికీ రెండు అంశాల కారణంగా టీకా రక్షణ కల్పిస్తుంది. పూర్తి రక్షణ కల్పించే ఈ రెండు భాగాలు కూడా క్రియారహితం (ఇనాక్టివేటెడ్‌) చేసిన ఈ వ్యాక్సిన్‌లో ఉంటాయి. వైరస్‌లో సంభవించే మార్పులను కూడా అవే ఎదుర్కొంటాయి’ అని ఐఐసీటీ ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో డాక్టర్‌ కృష్ణ ఎల్ల స్పష్టంచేశారు. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌పై టీకా పనిచేస్తుందా? అని అడిగిన ప్రశ్నకు డాక్టర్‌ కృష్ణ ఎల్ల ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇది ఊహించని విషయం కాదని.. వైరస్‌ మానవులకు సంక్రమిస్తున్నా కొద్ది మార్పులకు గురవుతుందని వెల్లడించారు.

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ)తో కలిసి భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు దాదాపు 20వేల మంది వాలంటీర్లపై కొనసాగుతున్నాయని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైరస్‌ సోకినవారు కూడా టీకా తీసుకోవాలని సూచించింది.

ఇదిలా ఉంటే, బ్రిటన్‌లో కనుగొన్న కొత్తరకం వైరస్‌ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ, కెనడా, జపాన్‌, లెబనాన్‌, సింగపూర్‌తో పాటు భారత్‌లోనూ ఈ కొత్తరకం కరోనా వైరస్‌ వెలుగుచూసింది. అయితే, ఈ వైరస్‌ వల్ల ప్రమాదమేమీ లేనప్పటికీ.. అత్యంత వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున దీన్ని అడ్డుకునేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థతో పాటు అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..
విశ్వవ్యాప్తంగా ఎంతమంది టీకా తీసుకున్నారంటే..!
టీకాపై నమ్మకం: తంటాలుపడుతోన్న చైనా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని