close
Published : 13/03/2020 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రివ్యూ: అంగ్రేజీ మీడియం

చిత్రం: అంగ్రేజీ మీడియం

నటీనటులు: ఇర్ఫాన్‌ఖాన్‌, కరీనా కపూర్ ఖాన్‌, రాధికా మదన్‌, దీపక్‌ దొబ్రియాల్‌, రణవీర్‌ షోరే, పంకజ్‌ త్రిపాఠి తదితరులు(అతిథి పాత్రలు: అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌, ఆలియా భట్‌, జాన్వీ కపూర్‌, అనన్య పాండే, కృతిసనన్‌, కియారా అడ్వాణీ)

సంగీతం: సచిన్‌ జిగార్‌, తనిష్‌ బాగ్చి

సినిమాటోగ్రఫీ: అనిల్‌ మెహతా

ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌

నిర్మాత: దినేశ్‌ విజయన్‌, జ్యోతి దేశ్‌ పాండే

దర్శకత్వం: హోమీ అదజానియా

బ్యానర్‌: మ్యాడ్‌డాక్‌ ఫిల్మ్స్‌, లండన్‌ కాలింగ్‌ ప్రొడక్షన్‌

విడుదల తేదీ: 13-03-2020

విలక్షణ నటుడిగా ఇర్ఫాన్‌ఖాన్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకు తగినట్లే ఆయన పాత్రలను ఎంచుకుంటారు. 2017లో ఇర్ఫాన్‌ నటించిన ‘హిందీ మీడియం’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా ఇర్ఫాన్‌ నటించిన తాజా చిత్రం ‘అంగ్రేజీ మీడియం’. కరీనా కపూర్‌, రాధికా మదన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ ఈ సినిమాలో నటించిన ఇర్ఫాన్‌కు ఇది ఊరటనిచ్చిందా? 

కథేంటంటే: స్కూల్‌ విద్య పూర్తి చేసుకున్న చంపక్‌ బన్సల్‌(ఇర్ఫాన్‌ ఖాన్‌) కుమార్తె తారికా బన్సల్‌(రాధికా మదన్‌) ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లాలనుకుంటుంది. అక్కడ ఓ ప్రముఖ యూనివర్సిటీలో చదవాలంటే రూ.కోటి ఫీజు కట్టాల్సి ఉంటుంది. అది చంపక్‌ బన్సల్‌కు తలకు మించిన భారం. అయినా సరే అక్కడే చదవాలన్నది కూతురి కల. వారంలో ఫీజు కట్టకపోతే ఆ సీటు కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో కోటి రూపాయలు సంపాదించడానికి చంపక్‌ చేసిన ప్రయత్నాలేంటి? లండన్‌లో పోలీస్‌గా పనిచేసే నైనా కోహ్లీ(కరీనా)కు, చంపక్‌ల మధ్య సంబంధం ఏంటి? చంపక్‌ తన కూతురి కోరికను నెరవేర్చాడా లేదా అన్నది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే:  హిందీ మీడియంలో చదివి ఇంగ్లిష్‌ సరిగా రాక అవమానాలకు గురవుతున్న ఓ తండ్రి, తన కుమార్తెను ఓ కార్పొరేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చేర్చాలనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడన్నది ‘హిందీ మీడియం’ చిత్రంలో చక్కగా చూపించారు. విద్యా వ్యవస్థ వ్యాపారమయంగా మారిన దుస్థితిని ఆ చిత్రం కళ్లకు కట్టింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘అంగ్రేజీ మీడియం’ తెరకెక్కించారు. భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూ తాజా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు హోమీ అదజానియా. విదేశాల్లో చదువుకోవాలని తారికా బన్సల్‌ చిన్నప్పటి నుంచి కలలు కనడం, చదువులో అంత గొప్ప స్టూడెంట్‌ కాకపోయినా తారికాకు లండన్‌లో చదువుకునే అవకాశం రావడం, చంపక్‌ బన్సల్‌ చేసిన ఓ తప్పు కారణంగా తారిక లండన్‌ వెళ్లలేకపోవడం, ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న చంపక్‌ తన కూతురిని లండన్‌కు పంపడం తదితర సన్నివేశాలతో ప్రథమార్ధాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలన్నీ సాదాసీదాగానే సాగిపోతాయి. 

తన సోదరుడి కారణంగా చంపక్‌ లండన్‌ వెళ్లాల్సి వస్తుంది. దీంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. అనుకోకుండా చంపక్‌ ఓ నేరంలో ఇరుక్కుంటాడు. దీంతో అక్కడ పోలీస్‌ ఆఫీసర్‌గా నైనా కోహ్లీ రంగ ప్రవేశంతో కథ మరో ట్విస్ట్‌ వస్తుంది. అక్కడి నుంచి అంతా కథ ఫన్నీగా ఉన్నా, కథనం పట్టు తప్పినట్లు అనిపిస్తుంది. ఉప కథలు ప్రేక్షకుడిని కాస్త గందరగోళానికి గురి చేస్తాయి. బహుశా అదజానియాతో పాటు భవీశ్‌ మందాలియా, గౌరవ్‌ శుక్లా, వినయ్‌ చావల్‌, సారా బొందినార్‌ రచయితలు కావడం కూడా ఓ కారణం కావచ్చు. అయితే, తండ్రీ-కూతుళ్ల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడి గుండెలకు హత్తుకుంటాయి. వీటితో పాటు, కారు ఛేజ్‌లు, ఫేక్‌ ఏజెంట్లు, కారు ఛేజ్‌లతో సినిమాను హాస్యభరిత మెలోడ్రామాగా తీర్చిదిద్దాడు అదజానియా. 

ఎవరెలా చేశారంటే:  క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూనే ఇర్ఫాన్‌ ఈ చిత్రంలో నటించారు. తెరపై ఆయన నటన ఆకట్టుకుంటుంది. మరోసారి తనదైన నటనతో కట్టిపడేశారు. తండ్రి పాత్రలో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన మెప్పిస్తుంది. ఇక ఇర్ఫాన్‌ కూతురిగా రాధికా మోహన్‌ కూడా చక్కగా నటించింది. పంకజ్‌ త్రిపాఠిది చిన్న పాత్రే అయినా గుర్తుండిపోతుంది. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన నటుడు దీపక్‌ దొబ్రియాల్‌. ఆయన కూడా ఆ పాత్రలో అలరించాడు. కికు శారదా, డింపుల్‌ కపాడియాలు నవ్వించారు. పోలీస్‌ ఆఫీసర్‌గా కరీనా కపూర్‌ ఖాన్‌ ప్రత్యేక పాత్రలో నటించారు. స్వతంత్ర భావాలు కలిగిన మహిళగా ఆమె చక్కగా నటించారు. 

సాంకేతికంగా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలకు ఎక్కువ ప్రాధాన్యం లేదు. ‘ఏక్‌ జిందారీ’ పాట కథా నేపథ్యంలో వినిపిస్తూ ఉంటుంది. తారలందరూ కలిసి సందడి చేసిన ‘కుడిను నచ్నేదే..’ మాత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. లండన్‌ అందాలను అనిల్‌ మెహతా చక్కగా చూపించారు. దర్శకుడు అదజానియా ఎంచుకున్న పాయింట్‌ మంచిదే అయినా దాన్ని చెప్పడంలో తడబడ్డాడు. బలమైన, భావోద్వేగ సన్నివేశాలను ఇంకా రాసుకోవాల్సింది. కామెడీ, ఎమోషన్‌‌, లవ్‌ తదితర అంశాలను కలిపి కాక్‌టెయిల్‌గా మార్చాడు. సినిమా చూడటం ప్రారంభించిన ప్రేక్షకుడు కథకు కనెక్ట్‌ కావడానికి సమయం పడుతుంది. ద్వితీయార్ధాన్ని కూడా ఇంకాస్త బలంగా చూపించవచ్చేమో. 

బలాలు బలహీనతలు
+ ఇర్ఫాన్‌ఖాన్‌, రాధికా మదన్‌ - ప్రారంభ సన్నివేశాలు
+ తండ్రీ కూతుళ్ల మధ్య సన్నివేశాలు - అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు
+ కామెడీ  

చివరిగా: కూతురు కన్న కలను నిజం చేసే తండ్రి కథ ‘అంగ్రేజీ మీడియం’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని