ఇక అక్కడ అత్యాచారం‌ చేస్తే ఉరిశిక్షే..!

తాజా వార్తలు

Published : 13/10/2020 01:29 IST

ఇక అక్కడ అత్యాచారం‌ చేస్తే ఉరిశిక్షే..!

చట్టసవరణకు బంగ్లాదేశ్‌ కేబినెట్‌ నిర్ణయం

ఢాకా: బంగ్లాదేశ్‌లో అత్యాచారం కేసులు భారీగా పెరగడంలో దేశం మొత్తం నిరసనలతో అట్టుడికిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. అత్యాచారం కేసుల్లో దోషులకు ఉరిశిక్ష విధించేందుకు వీలుగా చట్టాన్ని సవరించేందుకు ప్రధానమంత్రి షేక్‌ హసీనా నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆర్డినెన్స్‌ రూపంలో దీన్ని తీసుకొస్తామని ప్రకటించింది.

బంగ్లాదేశ్‌లో గతకొంత కాలంగా అత్యాచార కేసులు భారీస్థాయిలో పెరిగిపోయాయి. కేవలం ఈ సంవత్సరం తొమ్మిది నెలల్లోనే దాదాపు వెయ్యి అత్యాచార కేసులు నమోదైనట్లు మానవహక్కుల స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. దీంతో మహిళాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వీధుల్లోకి వచ్చి భారీ ఆందోళనలు చేపట్టాయి. అంతేకాకుండా ప్రభుత్వ తీరుపై సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం అత్యాచార కేసుల్లో మరణశిక్ష విధించేందుకు అంగీకరించింది. దీనిలోభాగంగా వుమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ రిప్రెషన్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. తాజా చట్టం ప్రకారం, అత్యాచారం కేసుల్లో దోషిగా తేలితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు కఠినకారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇదివరకు అత్యాచారం కేసులో నేరం రుజువైతే గరిష్ఠంగా జీవితఖైదు మాత్రమే ఉండేది. ప్రస్తుతం దీన్ని మరణశిక్షకు పెంచనున్నారు. అయితే, ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరగడం లేనందున రెండు రోజుల్లో దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అనిసుల్‌ హక్‌ ప్రకటించారు.

కొన్నిరోజుల క్రితం, దేశరాజధానికి 200కి.మీ దూరంలో ఉన్న నౌకాలీ ప్రాంతంలో ఓ మహిళపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ దుర్మార్గాన్ని వీడియోలో చిత్రీకరించారు. అనంతరం, నెల తర్వాత ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతకుముందే, అధికార పార్టీకే చెందిన విద్యార్థి సంఘం నాయకులు మరో గ్యాంగ్‌రేప్‌ కేసులో అరెస్టయ్యారు.దీంతో ఆందోళనలు రాజధాని ఢాకాతోపాటు పలు నగరాలకు విస్తరించాయి. దీంతో ‘రేపిస్టులను ఉరితియ్యాలి, రేపిస్టులను క్షమించకూడదు’ అంటూ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. మహిళలపై అత్యాచారాలపై సుదీర్ఘంగా భారీ స్థాయిలో నిరసన, ఆందోళనలు జరగడం బంగ్లాదేశ్‌ చరిత్రలోనే తొలిసారి. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం, అత్యాచార కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు సన్నద్ధమైంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని