బెయిల్‌పై వచ్చి.. చనిపోయినట్లు నమ్మించి!

తాజా వార్తలు

Published : 08/10/2020 01:52 IST

బెయిల్‌పై వచ్చి.. చనిపోయినట్లు నమ్మించి!

లఖ్‌నవూ: అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి శిక్ష తప్పించుకోవడానికి పథకం వేసి ఎదురుదెబ్బ తిన్నాడు. తాను చనిపోయినట్లు నమ్మించేందుకు ఓ వ్యక్తిని హతమార్చి చివరికి పోలీసులకు చిక్కాడు. తనతో పాటు తన భార్యను, బంధువును కూడా కటకటాలపాల్జేశాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

మేరఠ్‌‌కు చెందిన రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చాడు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఓ పథకం వేశాడు. రాజ్‌కుమార్‌ తాను నివాసం ఉండే ప్రాంతంలోని ఓ మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తికి తన బట్టలు, కొంత డబ్బు ఇచ్చాడు. డబ్బు తీసుకున్న వ్యక్తి ఆ బట్టలను వేసుకోడానికి అంగీకరించాడు. భార్య, మరో బంధువు సాయంతో రాజ్‌కుమార్‌ ఆ మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు.

చనిపోయిన వ్యక్తిని పోలీసులు రాజ్‌కుమార్‌ అని అనుకోవాలని అతని ముఖాన్ని ఛిద్రం చేశారు. దాంతో పాటు తన ఆధార్‌కార్డును రాజ్‌కుమార్‌ మృతదేహం వద్ద పడేశారు. సెప్టెంబరు 23న పోలీసులు అటవీ ప్రాంతంలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ వారికి రాజ్‌కుమార్‌ ఆధార్‌కార్డు లభ్యమైంది. చనిపోయిన వ్యక్తి ముఖంపై ఆనవాళ్లు లేకపోవడం, మృతదేహం ఉన్న ప్రదేశంలో రాజ్‌కుమార్‌ ఆధార్‌కార్డు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. రాజ్‌కుమారే ఈ హత్య చేశాడనే ప్రాథమిక అంచనాతో వాళ్లు దర్యాప్తు ప్రారంభించారు. 

భర్త మృతికి సంబంధించి రాజ్‌కుమార్‌ భార్యతో మాట్లాడిన పోలీసులు అతడి ఫోన్‌ నంబర్‌ తీసుకున్నారు. ఆ నంబర్‌ ఆధారంగా రాజ్‌కుమార్‌ సెల్‌ఫోన్‌ అలీఘఢ్‌ ప్రాంతంలోని ఓ మొబైల్‌ దుకాణంలో ఉన్నట్లు కనుగొన్నారు. అక్కడికి వెళ్లిన పోలీసులు రాజ్‌కుమార్‌ ఫోటోను చూపించగా 24వ తేదీ అతడే తనకు సెల్‌ఫోన్‌ విక్రయించినట్లు మొబైల్‌ దుకాణం యజయాని తెలిపారు. దీంతో పోలీసులు అనుమానించిందే నిజమైంది. రాజ్‌కుమార్‌ భార్యను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజ్‌కుమార్‌ ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకున్నారు. తాను తప్పించుకోవడానికి మరో వ్యక్తిని హత్య చేసిన రాజ్‌కుమార్‌ మళ్లీ పోలీసులకు చిక్కాడు. అతడికి సహకరించిన అతడి భార్యను, సమీప బంధువును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని