Oxygen in online.. మోసపోతావు మహాజన్‌!
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen in online.. మోసపోతావు మహాజన్‌!

కరోనా వేళ విజృంభిస్తున్నసైబర్‌ నేరగాళ్లు 
ఐసీయూ పడకలు, సాయం అవసరమంటూ వల
జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు

ప్రజల కరోనా కష్టాలు సైబర్‌ నేరగాళ్లకు వరంలా మారాయి. వాక్సిన్‌ మొదలు అవసరమైన సేవలన్నీ అందిస్తామంటూ సైబర్‌ వల విసురుతున్నారు. ఆసుపత్రుల్లో ఎక్కడా పడకలు దొరక్క, ఆక్సిజన్‌ అందుబాటులో లేక అల్లాడుతున్న వారి అవసరాన్నే తమ ఆయుధంగా మార్చుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారి బారినపడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా మొదటిదశ మొదలై, లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పుడే సైబర్‌ నేరాల విజృంభణ మొదలైంది. విద్యార్థులకు ఆన్‌లైన్లో తరగతులు నిర్వహించడం, ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం వంటి కారణాల వల్ల అంతర్జాల వినియోగం పెరిగిపోయింది. ఇది సైబర్‌ నేరగాళ్లకు వరంలా మారింది. కరోనా రెండో దశలో కేసులు విపరీతంగా పెరుగుతుండటం, ఆసుపత్రులు ఖాళీ లేకపోవడంతో దీన్ని తమకు అవకాశంగా మలచుకుంటున్నారు.

ఇవే ఉదాహరణలు

నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కొనుగోలు చేసేందుకు గూగుల్‌లో వెతికింది. ఓ కంపెనీ తయారు చేస్తుందని తెలుసుకుని కస్టమర్‌ కేర్‌ నంబరుకు కాల్‌ చేశారు. అవతలివైపు వ్యక్తి కంపెనీ మేనేజర్‌ అంటూ పరిచయం చేసుకున్నాడు. ముందే డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశాడు. రెండింటి కోసం సదరు సంస్థ నిర్వాహకులు రూ. 1.14 లక్షలు మేనేజర్‌ సూచించిన ఖాతాలో చేశారు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో మోసపోయినట్లు తెలుసుకుని సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

సామాజిక మాధ్యమాల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను డోర్‌ డెలివరీ చేస్తామంటూ ఓ సంస్థ ఇచ్చిన ప్రకటన సిద్దిఅంబర్‌ బజార్‌కు చెందిన ఓ వ్యకికి కనిపించింది. అక్కడ పేర్కొన్న నంబర్లకు కాల్‌ చేసి మూడింటి కోసం రూ.2.73 లక్షలు సదరు వ్యక్తులు సూచించిన ఖాతాలో జమ చేశాడు. వారం గడిచినా డెలివరీ కాకపోవడంతో అనుమానమొచ్చి ఆరా తీయగా మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు.

నాగోల్‌ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి వాట్సప్‌ మెస్సేజ్‌ వచ్చింది. క్లిష్టపరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులను ఆదుకునేందుకు తామొక స్వచ్ఛంద సంస్థను స్థాపించామని, అవసరమైన వారు ఫోన్‌ చేస్తే ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలు ఇప్పిస్తామన్నది దాని సారాంశం. దీన్ని నిర్ధారించుకునేందుకు ఆ సందేశంలో ఉన్న నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. పడక ఇప్పిస్తాం కాని అడ్వాన్సు కింద రూ.పదివేలు కట్టాలని చెప్పడంతో యువకుడికి అనుమానం వచ్చింది. ఇలాంటి సందేశాలు ఇప్పుడు చాలా గ్రూపుల్లో వస్తున్నాయి.

ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ విలేకరి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంటే అతనికి చికిత్స చేయించాలంటూ వాట్సప్‌ గ్రూప్‌ల్లో ప్రచారం చేసి, పెద్దఎత్తున విరాళాలు పోగేసిన జంట అదృశ్యమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
ఆన్‌లైన్లో ప్రకటనలు నమ్మొద్దు- సజ్జనార్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

ఇప్పుడు కరోనాను అడ్డం పెట్టుకొని నేరస్థులు దోపిడీకి తెరలేపుతున్నారు. ఐసీయూలో పడకలు ఇప్పిస్తామని, ఆన్‌లైన్లో ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేస్తామని, ఇంకా మందులు, వాక్సిన్‌ వంటి వాటిపేరుతోనూ మోసాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అన్నింటికీ గూగుల్‌ను నమ్ముకుంటే కష్టమే. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఆసుపత్రుల్లో పడకల వంటివి ఇప్పిస్తామంటే నమ్మవద్దు. ఆసుపత్రికి వెళ్లి వ్యక్తిగతంగా విచారించుకోవాలి. అప్పుడు మాత్రమే నిర్ధారించుకొని అవసరమైన డబ్బు చెల్లించాలి. అంతేకాని ఆన్‌లైన్లో వచ్చిన ప్రకటన నమ్మి డబ్బు చెల్లిస్తే మోసం పోవడం తప్ప మార్గం ఉండదు. కాబట్టి కరోనా పేరుతో ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతున్న మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలి. - ఈనాడు, హైదరాబాద్‌  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని