close

తాజా వార్తలు

Updated : 29/11/2020 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోగి బంధువుల్లా వచ్చి డాక్టర్‌ని చంపేసి..

బంగారం, నగదు భారీగా చోరీ

అవనిగడ్డ,: అవనిగడ్డలోని లక్ష్మీనర్సింగ్‌ హోమ్‌ వైద్యులు కోట శ్రీహరిరావును (70) గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారు జామున దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాలలోకి వెళితే.. డాక్టర్‌ కింది అంతస్తులో ఆసుపత్రిని నిర్వహిస్తూ.. పైఅంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారూ వైద్యులు కావడంతో ఖమ్మం, హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన భార్య లక్ష్మి శుక్రవారం పిల్లల వద్దకు వెళ్లారు.

ఆలస్యం కావడంతో..: శ్రీహరిరావు రోజూ ఉదయం 9 గంటలకే పైనుంచి ఆసుపత్రికి వచ్చి రోగులను చూస్తారు. శనివారం 9.30 గంటలైనా ఆయన రాకపోవడంతో నర్సు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న డాక్టర్‌ను చూసి ఆమె..భయంతో కిందకు పరుగులు తీశారు. సిబ్బంది అంతా వెళ్లి చూసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. వారి సూచన మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రవికుమార్‌ తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..

పథకం ప్రకారమే : ఆయన వైద్యవృత్తితోపాటు భారీగా వ్యవసాయం చేయిస్తుంటారు. రోజూ ఆసుపత్రిలో రోగులను చూసిన తర్వాత పొలానికి వెళ్లడం అలవాటు. డాక్టర్‌ ఇంటిలో కుటుంబ సభ్యులు లేరని, ఆయన ఒంటరిగా ఉన్నారని తెలుసుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చోరీ చేసేందుకు పథకం వేశారు. రోగుల బంధువుల లాగా ఆసుపత్రిలోకి ప్రవేశించి అక్కడ నుంచే ఇంట్లోకి వెళ్లారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టారు. రెండు బీరువాల్లో ఉన్న బంగారు, నగదు తీసుకున్నారు. ఆ సమయంలో డాక్టర్‌ గమనించి వారిని అడ్డుకోవడంతో ఆయన్ను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆయన తలపైన మాత్రమే 8 గాయాలు ఉన్నాయని, ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం కోసమే ఈహత్య చేసి ఉంటారని సీఐ చెప్పారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బీరువాల్లో ఉన్న 100గ్రాముల బంగారం, నగదు ఎత్తుకెళ్లారని డాక్టర్‌ భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆధారాలు దొరకలేదు: ఎస్పీ

సంఘటన జరిగిన తీరును పరిశీలించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లభించలేదని, హత్యపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. స్థానిక డీఎస్పీ మెహబూబ్‌ బాషా, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ ధర్మేంద్ర, స్థానిక సీఐ రవికుమార్‌ల ఆధ్వర్యంలో 4 బృందాలు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన