‘చెడ్డీ గ్యాంగ్‌’కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

తాజా వార్తలు

Published : 11/03/2021 01:32 IST

‘చెడ్డీ గ్యాంగ్‌’కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

తీర్పు వెల్లడించిన అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి కిరణ్మయి

నిజామాబాద్‌ (న్యాయ విభాగం): నిజామాబాద్‌లో దాదాపు ఏడాదిన్నర కిందట దొంగతనాలకు పాల్పడిన ‘చెడ్డీ గ్యాంగ్‌’ ముఠాకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు నిజామాబాద్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి కిరణ్మయి బుధవారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2019 నవంబర్‌ 4న నిజామాబాద్ లలీతానగర్‌లోని పెద్ద తిమ్మయ్య ఇంట్లోకి ఏడుగురు వ్యక్తులు మారణాయుధాలతో ప్రవేశించి సుమారు 15 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఆ మరుసటి రోజు నిజామాబాద్‌ ఐదో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అదే ఏడాది డిసెంబర్‌ 29న ఓ కేసు విషయంలో రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు ఈ చెడ్డీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. వారిని విచారించగా.. నిజామాబాద్‌ జిల్లాలోనూ దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించడంతో వారిని నిజామాబాద్‌ పోలీసులకు అప్పగించారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూటర్‌ అల్లూరి రాంరెడ్డి పోలీసుల తరఫున వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కిరణ్మయి ఈ ముఠాలోని మహారాష్ట్రకు చెందిన ఆరుగురు సభ్యులు చౌహాన్‌ తారాసింగ్‌, ఎండీ సోనూ, బిట్టు, గుఫ్తాన్‌, సైఫ్‌ అలీ, సాధిక్‌లకు ఏడేళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు. ముఠాకు చెందిన మరో నిందితుడు ఎండీ సాజిద్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో తనపై నమోదైన కేసును కొట్టివేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని