VIVEKA MURDER CASE: సునీల్‌ ప్రమేయంపై ఆధారాలున్నాయి: సీబీఐ

తాజా వార్తలు

Published : 05/08/2021 01:45 IST

VIVEKA MURDER CASE: సునీల్‌ ప్రమేయంపై ఆధారాలున్నాయి: సీబీఐ

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో  సునీల్‌ కుమార్‌ యాదవ్‌ పాత్రపై  ఆధారాలు లభించాయని సీబీఐ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. సునీల్‌ ప్రమేయంపై సెక్షన్‌ 164 కింద వాచ్‌మెన్‌ రంగన్న వాంగ్మూలం ఇచ్చారని  సీబీఐ తెలిపింది. సునీల్‌ యాదవ్‌ను సుదీర్ఘ విచారణ చేయాలని భావించామని, అయితే విచారణకు హాజరు కాకుండా పారిపోయాడని రిపోర్టులో పేర్కొంది. ఈనెల 2న గోవాలో సునీల్‌ను అరెస్టు చేశామని వెల్లడించింది. 
‘‘సునీల్‌ను సుదీర్ఘ విచారణ చేయాలి. కుట్రకోణం వివరాలను అతను బహిర్గతం చేయట్లేదు. సీబీఐ ప్రశ్నలకు సహకరించట్లేదు. హత్యకేసులో చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉంది. హత్యకు వాడిన ఆయుధాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సునీల్‌ను కస్టడీకి ఇవ్వకపోతే విచారణ జాప్యం జరిగే అవకాశముంది. సునీల్‌ను 13 రోజుల కస్టడీకి ఇవ్వాలి’’ అని సీబీఐ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో కోరారు. పులివెందుల కోర్టులో ఇవాళ మధ్యాహ్నం సునీల్‌ను హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది.

సీబీఐ అధికారులు వేధిస్తున్నారు: సునీల్‌ తల్లిదండ్రులు

సీబీఐ అధికారులు తమను తీవ్రంగా వేధించారని సునీల్‌ తల్లిదండ్రులు క్రిష్ణయ్య, సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల కోర్టు బయట వారు మీడియాతో మాట్లాడుతూ ‘‘విచారణ పేరుతో కడప జిల్లా కేంద్ర కారాగార అతిథిగృహానికి 20 రోజుల పాటు పిలిచి కొట్టారు. ఏ పనీ చేసుకోనీయకుండా వేధిస్తుండటంతో హైకోర్టులో వ్యాజ్యం వేసి గోవా పారిపోయాం. బెయిల్‌ వచ్చే వరకు అక్కడే ఉండాలనుకున్నాం. కానీ, సీబీఐ అధికారులు మా జాడ తెలుసుకొని గోవాలో అరెస్టు చేసి కడప తీసుకొచ్చారు. దాదాపు రెండేళ్లపాటు సిట్‌ అధికారులు, ఇప్పుడు సీబీఐ అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు. ఈ నరకయాతన భరించలేక ఒక సారి ఉరేసుకోవడానికి ప్రయత్నించాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని