భయం.. ఒత్తిడి.. ఆత్మహత్య...

ప్రధానాంశాలు

Updated : 17/09/2021 19:44 IST

భయం.. ఒత్తిడి.. ఆత్మహత్య...

తప్పించుకున్నా చంపేస్తారన్న భావనతోనే.. బలవన్మరణం

ఈనాడు, హైదరాబాద్‌: అభం..శుభం తెలియని చిన్నారికి చాక్లెట్‌ ఆశ చూపించి దారుణంగా అత్యాచారం చేసి... పాశవికంగా చంపేసిన ఉన్మాది రాజు చరిత్ర ముగిసింది. తాను కనిపిస్తే పోలీసులు లేదా జనం చంపేస్తారన్న ఒత్తిడితోనే రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య అతనిని వదిలిపెట్టి కుమార్తె సహా వెళ్లిపోయింది. తల్లి కూడా అతని వద్ద లేదు. దాంతో కుటుంబ పోషణకు డబ్బు సంపాదించే అవసరం లేకపోవడంతో మద్యం, తన పోషణ అవసరాలకు మాత్రమే భవన నిర్మాణ పనులకు వెళ్తుంటాడు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయిన రాజు... ఈనెల 9న సైదాబాద్‌ బస్తీలో ఉంటున్న చిన్నారిని తన గదికి తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. ఈ ఘటన వెలుగు చూశాక పోలీసులు తన ఇంటికి వస్తారన్న అంచనాతో వేరేచోటికి వెళ్లి పడుకున్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా.. వినాయకచవితి రోజు సంతోష్‌నగర్‌లో ప్రాంతంలో ఓ భవన నిర్మాణం పనికి వెళ్లాడు. ‘మద్యం తాగావ్‌.. పని సరిగా చేయలేవ్‌’ అంటూ అక్కడున్న మేస్త్రీ సగం రోజు కూలీ ఇచ్చి మధ్యాహ్నమే పనిలో నుంచి పంపించేశాడు. అక్కడి నుంచి రాజు సైదాబాద్‌ బస్తీకి వెళ్లకుండా మరోచోటికి వెళ్లిపోయాడు.

రెండ్రోజులు ఎల్బీనగర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో ..

హత్యాచార ఘటన జరిగాక రెండ్రోజులు ఎల్బీనగర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో ఉన్న హంతకుడు రాజును చివరిసారిగా .. ఉప్పల్‌లో ఈ నెల 11న సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. హత్యాచార ఉదంతంపై జరుగుతున్న పరిణామాలు  తెలుసుకున్నాడు. మద్యం తాగేందుకు డబ్బు సరిపోక అదేరోజు కల్లు తాగాడు. రాత్రంతా ఉప్పల్‌లో ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడుకున్నాడు. పోలీసులకు దొరికితే కాల్చేస్తారు.. ప్రజలు చూస్తే కొట్టి చంపేస్తారన్న భయం పెరగడంతో జనగామ జిల్లాలోని కొడకండ్లలోని సొంతూరుకు వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడని పోలీసులు విశ్లేషిస్తున్నారు. బస్సులు ఎక్కకుండా లారీలు, ఆటోల్లో ప్రయాణించి బుధవారం రాత్రి స్టేషన్‌ఘన్‌పూర్‌ చేరుకున్నాడు. గురువారం రైల్వేస్టేషన్‌కు దూరంగా వెళ్లి పట్టాలపై నడుచుకుంటూ వెళ్లాడు. ఉదయం సుమారు 8.40 గంటల ప్రాంతంలో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు సీసీ కెమెరాల్లో ఆకుపచ్చ గళ్ల చొక్కాతో కనిపించిన రాజు ఆత్మహత్య చేసుకున్న సమయంలో  ఒంటిపై సాదా (ప్లేన్‌) తెలుపు రంగు లాంటి చొక్కాతో కనిపించాడు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన