ఈ బాబు మరీ వివాదాస్పదం!
logo
Published : 24/02/2021 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ బాబు మరీ వివాదాస్పదం!

ఈనాడు, అమరావతి

దుర్గగుడి ఈవో సురేష్‌బాబు

దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలను దుర్గగుడి టెండర్ల ప్రక్రియలో కార్యనిర్వహణాధికారి ఉల్లంఘించారు. మూడు సింహాల చోరీ కేసులో ప్రమేయం ఉన్న మాక్స్‌ డిటెక్టివ్‌ అండ్‌ గార్డింగ్‌ సర్వీసు ప్రైవేటు లిమిటెడ్‌కు వర్క్‌ ఆర్డరు ఇచ్చారు. భద్రత విషయంలో పూర్తిగా వైఫల్యం, నిర్లక్ష్యం కనిపిస్తోంది. సీఓఈ టెండర్లను ఆమోదించనప్పటికీ మొత్తం సొమ్ములు సెక్యురిటీ ఏజెన్సీకి చెల్లించారు. ఇది చాలా దారుణమైన విషయం. కాబట్టి ఈ టెండర్ల ప్రక్రియలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ సస్పెండ్‌ చేయాలి. ఇది వెంటనే అమలు జరగాలి..’

- దేవదాయ శాఖ కమిషనర్‌ అర్జున్‌రావు ఆదేశాలివి.

కానీ ...

ఈ విభాగంలో కేవలం సూపరింటెండెంట్‌పైనే సస్పెన్షన్‌ వేటు పడింది. టెండర్లను సహాయ కార్యనిర్వణాధికారి తోపాటు కార్యనిర్వహణాధికారి పర్యవేక్షిస్తుంటారు. వారిపై చర్యలు లేవు. ఏఈఓ వెంకటరెడ్డిపై మాత్రం సస్పెన్షన్‌ వేటు వేయలేదు. ఈ ప్రక్రియలో ఈఓ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో ఆయనపై కూడా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. కేవలం సెక్యూరిటీ టెండర్లను మాత్రమే కాదు.. పారిశుద్ధ్య టెండర్లు, మూడు వెండిసింహాల మాయం తదితర అంశాల్లో ఈవో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నట్లు అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

దుర్గగుడి వివాదాలకు కేంద్రంగా మారుతోంది. కార్యనిర్వాహక అధికారిగా (ఈవో) సురేష్‌బాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ వివాదాలు ముసురుకున్నాయి.. దేవదాయశాఖకు, అవినీతి నిరోధకశాఖకు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. ప్రాథమికంగా సాక్ష్యాలు ఉన్నట్లు గుర్తించిన అనిశా ఆకస్మికంగా తనిఖీలకు పూనుకుంది. దుర్గగుడిలో కొంతమంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. ప్రతి పనిలో కమిషన్లదే రాజ్యంగా మారింది. విభాగాధిపతుల నుంచి ఉన్నతాధికారి వరకు కళ్లకు గంతలు కట్టుకోవడంతో అక్రమానిదే రాజ్యమయ్యింది.. బినామీలు చెలరేగిపోయారు. రూ.కోట్లు దోచుకున్నారు.

శ్రీదుర్గా మల్లేశ్వర్ల స్వామి దేవస్థానం ఈవో పోస్టుకు కనీసం ఆర్‌జేసీ స్థాయి అధికారిని నియమించాలి. గతంలో ఈవోగా సూర్యకుమారి ఐఏఎస్‌ను నియమించారు. తర్వాత కోటేశ్వరమ్మ ఐఆర్‌ఎస్‌ అధికారిణి వచ్చారు. కొంతకాలం పద్మ ఉన్నారు. అన్నవరం దేవస్థానంలో సహాయ కమిషనర్‌ స్థాయిలో ఉన్న సురేష్‌బాబును ఇక్కడ నియమించారు. 2019 ఆగస్టు 21న సురేష్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఓ విశ్రాంత అధికారి దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డిప్యూటీ కమిషనర్‌ హోదా కూడా లేని అధికారిని ఎలా నియమిస్తారని కేసు దాఖలు చేశారు. దీంతో అఘమేఘాలపై ఆయనకు డిప్యుటీ కమిషనర్‌ పదోన్నతి కల్పించారు. ఈ వివాదానికి చెక్‌పెట్టేందుకు ఇంఛార్జి ఆర్‌జేసీగా ప్రకటించారు. ఇదంతా అధికారుల సహకారం, రాజకీయ పలుకుబడితోనే చేశారని విపక్షాలు ఆరోపించాయి.

రూ.4 కోట్ల టెండర్‌..!

రూ.4కోట్ల విలువైన పారిశుద్ధ్య టెండర్లను నిబంధనలు ఉల్లంఘించి కట్టబెట్టారు. ఈ విషయంలో కమిషనర్‌ ఆదేశాలను సైతం పట్టించుకోలేదు. పారిశుద్ధ్య టెండర్లను పిలవగా ముగ్గురు దాఖలు చేశారు. దీనిలో ఎల్‌1గా వచ్చిన సంస్థకు అప్పగించలేదు. తర్వాత ఎల్‌2ను కాదని ఎల్‌3 గా వచ్చిన సంస్థకు ఇచ్చారు. దసరా ఉత్సవాలకు ఈ టెండర్లను అత్యవసరం పేరుతో ఇచ్చి ఆ తర్వాత ప్రతి నెలా పొడిగిస్తూ వచ్చారు. కనీసం టెండర్లను ఖరారు చేయకుండా దాటవేశారు. ఈ పారిశుద్ధ్య టెండర్లను ఓ నేతకు బినామీకి అప్పగించారు. దీనిలో భారీగా చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా అనిశాకు ఫిర్యాదులు వెళ్లాయి. మూడు సింహాల వ్యవహారంలోనూ ఈవో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కనిపించకుండా పోయిన వెండి సింహాలు స్టోర్‌ రూంలో ఉన్నాయని ఒకసారి, తనిఖీ చేయాలని ఒకసారి పొంతన లేకుండా చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం చేశారు. సంబంధిత బాధ్యులను గుర్తించడంలోనూ అలసత్వం ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వివాదం జరిగినా దుర్గగుడి అధికారులు మౌనంగా ఉన్నారు. సీఓఈ ఆమోదించకుండానే సెక్యూరిటీ టెండర్ల విషయంలో పెద్దఎత్తున బిల్లులు చెల్లించారు. దర్శనటిక్కెట్ల గోల్‌మాల్‌ సరేసరి. రీసైక్లింగ్‌ చేసి టిక్కెట్లు విక్రయించినట్లు పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. చీరల విక్రయాల్లోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది. ప్రసాదం కౌంటర్‌లో, సామగ్రి కొనుగోలులో ఇలా ప్రతి సెక్షన్‌లో అక్రమాలను ఏసీబీ గుర్తించింది. ఇంత జరిగినా ఈవోకు తెలియకుండా పోతుందా అనేది చర్చనీయాంశమయ్యింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని