Published : 12/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సౌర విద్యుత్తు ఆరంభమెప్పుడో..!

ఈనాడు, అమరావతి
నున్న సమీపంలో ఏర్పాటు చేసిన ప్యానెళ్లు

విజయవాడ దుర్గగుడికి చెందిన సౌర విద్యుత్తు ప్లాంట్‌ నిర్మాణానికి ఆటంకాలు తొలగడం లేదు. ఒక మెగావాట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ నిర్మాణం ఎప్పుడో పూర్తయిపోయినా.. విద్యుత్తును సబ్‌స్టేషన్‌కు తరలించేందుకు అవసరమైన లైన్‌ను ఏర్పాటు చేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పాతపాడులో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నున్నలో ఉన్న సబ్‌స్టేషన్‌కు తరలించాల్సి ఉంది. దీనికి అవసరమైన విద్యుత్తు స్తంభాలు, కేబుళ్ల ఏర్పాటు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్లాంట్‌ నిర్మాణం పూర్తయి ఇప్పటికి ఎనిమిది నెలలకు పైగా అవుతోంది. కేవలం నెల రోజుల్లో విద్యుత్తు లైన్‌ ఏర్పాటు చేసి.. ఆ తర్వాత సరఫరా ఆరంభించాలని భావించారు. కానీ.. పాతపాడు నుంచి నున్న వరకు లైన్‌ వేస్తుండగా.. ఈ మధ్యలో ఉన్న కొన్ని గ్రామాల్లో స్తంభాల ఏర్పాటుకు అభ్యంతరాలు వచ్చాయి. దీంతో.. ఈ ప్రక్రియ తీవ్ర జాప్యం అవుతోంది.

దుర్గగుడి, విద్యుత్తు బిల్లుల ఖర్చు ఏటా రూ.82 లక్షల వరకు అవుతోంది. దుర్గగుడితో పాటు కొండ కింద ఉన్న భవనాలు, జమ్మిదొడ్డి కార్యాలయం, సి.వి.రెడ్డి ఛారిటీస్‌, మాడపాటి సత్రం, ఉద్యోగుల క్వార్టర్లు సహా అన్నింటికీ కలిపి నెలకు రూ.6.84లక్షలకు పైగా విద్యుత్తు బిల్లుల కింద చెల్లిస్తున్నారు. నెలకు 1.12లక్షల యూనిట్ల చొప్పున ఏటా 13.50లక్షల యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. ఇంత భారీగా విద్యుత్తు ఖర్చవుతున్నందున ఓ సౌర విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే దుర్గగుడికి ఏటా రూ.95 లక్షల వరకు ఆదా చేయొచ్చని అధికారులు భావించారు. ప్లాంట్‌ ఖర్చు రూ.4.64కోట్లు. ప్రభుత్వ రాయితీగా రూ.92.8లక్షలు వచ్చాయి. దేవస్థానానికి రూ.3.71 కోట్లు ఖర్చయింది. ఏటా 16లక్షల యూనిట్ల విద్యుత్తు ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతుంది. దేవస్థానానికి ఏటా ఖర్చయ్యే 13.50లక్షల యూనిట్లను మినహాయించి.. మిగిలిన 2.50లక్షల యూనిట్లకు విద్యుత్తు శాఖే డబ్బులు తిరిగి చెల్లిస్తుంది. యూనిట్‌కు రూ.5.48 చొప్పున 2.50లక్షల యూనిట్లకు ఏటా రూ.13.70లక్షలను విద్యుత్తు శాఖ దేవస్థానానికే తిరిగి చెల్లిస్తుందని అంచనా. అంటే.. విద్యుత్తు బిల్లుల రూపంలో ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.82 లక్షలు, అదనంగా వచ్చే రూ.13.70లక్షలు కలిపితే.. ఏటా రూ.95.70లక్షల వరకు దేవస్థానానికి ఆదా అవుతుంది. ప్లాంట్‌కు పెట్టిన రూ.3.71కోట్లు.. నాలుగేళ్లలో తిరిగి వచ్చేస్తుంది. ఈ ప్లాంట్‌ నుంచి 20 ఏళ్లు విద్యుత్తు ఉత్పిత్తి జరుగుతుంది.

ప్లాంట్‌ నిర్మాణం త్వరగా పూర్తయినా..

దుర్గగుడికి సంబంధించిన సౌర విద్యుత్తు ప్లాంట్‌ నిర్మాణంలో ఆది నుంచి అనేక ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. నాలుగేళ్ల కిందట దీనికోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పాతపాడులో ఖాళీగా ఉన్న దేవస్థానానికి చెందిన ఐదెకరాల స్థలంలో ప్లాంట్‌ను నిర్మించాలని నిర్ణయించారు. కానీ.. అనేక అడ్డంకులు ఎదురవ్వడంతో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఏడాది కిందట కొత్తగా టెండర్లు పిలిచి ప్లాంట్‌ నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తిచేశారు. కానీ.. అక్కడి నుంచి మళ్లీ అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి. ప్లాంట్‌ నుంచి విద్యుత్తును సబ్‌స్టేషన్‌కు పంపించేందుకు అవసరమైన లైన్‌ నిర్మాణం నెలల తరబడి కొనసాగుతోంది. విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం తీగల ఏర్పాటు జరుగుతోంది. మధ్యలోని కొన్ని గ్రామాలవాసులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నెమ్మదించాయి. ప్రస్తుతం అన్ని ఆటంకాలు తొలగిపోయాయని, మరో నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తయిపోయి ప్లాంట్‌ అందుబాటులోనికి వస్తుందని దుర్గగుడికి చెందిన అధికారులు పేర్కొంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని