నాణ్యత తగ్గడమే ధాన్యం సేకరణకు ప్రతిబంధకం
logo
Published : 13/06/2021 03:38 IST

నాణ్యత తగ్గడమే ధాన్యం సేకరణకు ప్రతిబంధకం

‘ఈనాడు’తో సంయుక్త కలెక్టర్‌ కె.మాధవీలత

ఈనాడు, అమరావతి

ఏడాది రబీ ధాన్యం సేకరణలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.మాధవీలత అభిప్రాయపడ్డారు. నాణ్యత ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఎదురైందని ఆమె చెప్పారు. మరో 50వేల టన్నుల వరకు ధాన్యం సేకరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వర్షాల వల్ల రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని సానుభూతి వ్యక్తం చేశారు. భూముల రీసర్వే ప్రతి మండలంలో ప్రారంభించామని చెప్పారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారి కోసం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా రెండు పట్టణాలను ఎంపిక చేసి స్మార్ట్‌టౌన్‌ల నిర్మాణం చేపట్టనున్నామని ప్రకటించారు. జగనన్న కాలనీల లేఅవుట్లు చదును చేస్తున్నామని, లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జాతీయ రహదారుల కోసం భూసేకరణ వేగవంతం చేస్తున్నామని చెప్పారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, ఇతర విషయాలపై ఆమె శనివారం ‘ఈనాడు’తో ముచ్చటించారు. ఆ వివరాలు జేసీ మాటల్లోనే..!

మరో 50వేల టన్నుల సేకరణ

రబీలో మరో 50వేల టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అవనిగడ్డ, బందరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. జిల్లాలో దాదాపుగా దాలువా ధాన్యం పూర్తయింది. 5లక్షల టన్నుల వరకు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గతేడాది 3.5లక్షల టన్నులు సేకరించాం. ఈ ఏడాది కూడా ఆ మేరకు సేకరిస్తాం. ఇప్పటివరకు 3లక్షల టన్నులు సేకరించాం. మరో 50వేల టన్నులు సేకరిస్తాం. రూ.500 కోట్ల ధాన్యం 25వేల మంది రైతుల నుంచి సేకరించాం. రైతులకు డబ్బులు చెల్లించడం కొంత జాప్యం అయింది. ఇప్పటి వరకు రూ.120 కోట్లు చెల్లించాం. ఇంకా రూ.380 కోట్ల వరకు ఆమోదం తెలిపాం. బ్యాంకుల వద్ద పురోగతిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి సమస్యలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఈసారి రబీ సాగులో ధాన్యం నాణ్యత ప్రమాణాలు లేవు. ముక్కపాయ వస్తోంది. దీంతో ఎఫ్‌సీఐ, మిల్లర్లు అంగీకరించడం లేదు. అప్పటికి చాలా మిల్లర్లకు నచ్చచెప్పి కొనుగోలు చేయించాం. రైతులకు మద్దతు ధర దక్కేలా చూశాం. కొంతమంది మాత్రం ఇతరులకు విక్రయించినట్లు తెలిసింది. ఈసారి ఆర్‌బీకేలకు అనుసంధానం చేయడం వల్ల కూడా అలావాటు ప్రకారం సొసైటీల వద్దకు రైతులు వెళ్లారు. వచ్చే సంవత్సరం నుంచి ఆర్‌బీకేలకు అలవాటు పడతారని ఆశిస్తున్నాను. ప్రతి వారం రైతుల సమస్యలపై ప్రత్యేకంగా డయల్‌యువర్‌ జేసీ నిర్వహించి ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాం. గత ఏడాది కొన్ని వరి వంగడాలు వద్దని సూచించినా రైతులు అవే సాగు చేయడం వల్ల కూడా సమస్య వచ్చింది. ఈ ఏడాది ముందుగానే రైతులను అప్రమత్తం చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు ఉన్నా.. నేరుగా ఫిర్యాదు చేయవచ్ఛు ఖరీఫ్‌లో తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసి రైతులకు మద్ధతు ధర అందేలా చూశాం.

90 రోజుల్లో నివేశన స్థలం..

కొత్తగా 26,092 మందికి నివేశన స్థలాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. వీరికి ఇప్పటికే ఉన్న లేఅవుట్‌లు 2148లలో ఇచ్చేందుకు ఏర్పాటు చేశాం. 1059 లేఅవుట్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. 431 లేఅవుట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకుని అన్ని అర్హతలు ఉన్నవారని ఎంపిక చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న నివేశన స్థలాల లేఅవుట్లను చదును చేసే కార్యక్రమం చేపట్టాం. వీరికి దాదాపు 1.7లక్షల మందికి గృహ నిర్మాణం చేపట్టనున్నారు. మూడు రకాలుగా గృహ నిర్మాణం చేసుకొనే వెసులుబాటు లబ్ధిదారులకు కల్పించారు. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి.


మధ్య తరగతికి స్మార్టు టౌన్‌ షిప్‌..

జిల్లాలో ఎగువ, మధ్య తరగతి కుటుంబాలకు నివేశన స్థలం చౌకగా ఇచ్చేందుకు ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుగా గుడివాడ, బందరు ఎంపిక చేశాం. ఇక్కడ స్థల సేకరణ జరుగుతోంది. మధ్య తరగతి కుటుంబాలకు లాభాపేక్ష లేకుండా నివేశన స్థలాలను ప్రభుత్వం విక్రయిస్తుంది. కొంత మంది దీనికి ఆసక్తి వ్యక్తం చేశారు. గుడివాడలో 300 ఎకరాలను సేకరించేందుకు ఏర్పాటు చేశాం. బందరులో కూడా స్థల సేకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్మార్టు టౌన్‌ షిప్‌లలో మౌలిక వసతులను ప్రభుత్వం సమకూర్చుతుంది. ఆదర్శ టౌన్‌షిప్‌లుగా నిర్మాణం చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని