ఉపాధ్యాయుల్లో గుబులు..!
eenadu telugu news
Published : 26/07/2021 03:54 IST

ఉపాధ్యాయుల్లో గుబులు..!

ప్రాథమిక బడుల విభజనపై సమాచార సేకరణ

ఈనాడు-అమరావతి

జాతీయ కొత్త విద్యావిధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ కార్యాలయం గత కొద్దిరోజుల నుంచి జిల్లా విద్యాశాఖలను రోజుకో సమాచారం కోరుతోంది. దీనిపై ఉపాధ్యాయవర్గంలో గుబులురేగుతోంది. ప్రస్తుతం ఒకే ఊళ్లో రెండు, మూడు పాఠశాలలు ఉన్నాయి. గతంలో ప్రజాప్రతినిధులు కోరిందే తడవుగా వాటిని మంజూరు చేశారు. ఒకే పాఠశాల ప్రాంగణంలో ఒకటికి మించిన పాఠశాలలు, కిలోమీటరు పరిధిలో రెండు, మూడు పాఠశాలలు, వాటికి అదనంగా పూర్వ ప్రాథమిక విద్య బోధనకు అంగన్వాడీలు ఇలా అనేకం ఉన్నాయి. ఒకే ఊళ్లో ఇన్ని పాఠశాలలు ఉండటంతో వాటన్నింటిని ఆ ఊళ్లో ఉన్న ఉన్నత పాఠశాలకు మ్యాపింగ్‌ చేయాలని గతంలో ఆదేశాలు రాగా ప్రభుత్వం కోరిన విధంగా వాటి మ్యాపింగ్‌ చేసి సమాచారం పంపారు. అసలు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఎన్ని బడులు ఉన్నాయనే సమాచారం తాజాగా కోరారు. 100, 200, 500 మీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలు, వాటిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పిల్లల వివరాలను సైతం సేకరించి ఉన్నత పాఠశాలకు మ్యాపింగ్‌ చేసి ఆ ప్రక్రియను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం పాఠశాలలన్నీ ఒకేలా లేవు. అనేక మాధ్యమాలతో నడుస్తున్నాయి. అలాంటప్పుడు ఉన్నత పాఠశాలకు సమీపంలో ఉన్నవి మొత్తాన్ని దానికి అనుసంధానం చేసి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే అంతిమంగా పిల్లలు నష్టపోతారని అంటున్నారు.

బోధన చేసేది ఎవరు? 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో చేరిస్తే వారికి సబ్జెక్టు టీచర్లు బోధించాలా? సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు బోధించాలా అనే సమస్య వస్తుంది. సబ్జెక్టు టీచర్లు 3,4,5 తరగతుల పిల్లల స్థాయికి దిగి బోధింటం అనేది చాలా కష్టమని ఉపాధ్యాయులు అంటున్నారు. ఉపాధ్యాయుల పోస్టులకు వచ్చే ప్రమాదం లేకపోయినా వారిని ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మార్పిడి చేయటం వంటివి జరుగుతాయి.

ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందులే! మూడో తరగతి నుంచే ఉన్నత పాఠశాలల్లో పెడితే పర్యవేక్షించడం ఇబ్బందికరమని ప్రధానోపాధ్యాయవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం ఉన్నత పాఠశాలలకు ఒకలా, ప్రాథమిక విద్యార్థులకు మరోలా రెండు సమయాల్లో వేర్వేరుగా ఉంటున్నాయి. ఇది మరింత ఒత్తిడి పెంచుతుంది. ప్రాథమిక పాఠశాలల విభజనకు గుంభనంగా చేస్తున్న ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ ఈనెల 29న ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పాతతాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహణకు పిలుపునిచ్చామని ఆసంఘం జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని