ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం

జ్వరాల సర్వేకు అందరూ సహకరించాలి

డెంగీ జ్వర పీడితుల కోసం ఆసుపత్రుల్లో ఏర్పాట్లు

కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎం.సుహాసిని

ఈనాడు, అమరావతి

ర్షాకాలంలో విష జ్వరాలు రావడం సాధారణమే. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డెంగీ లాంటి జ్వరాలను ఎదుర్కొని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ఇంటింటికి సిబ్బంది వెళ్లి జ్వరాలున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి ఉన్న లక్షణాలను బట్టి డెంగీ, కొవిడ్‌, ఇతర జ్వరాల అనేవి గుర్తించి.. అవసరమైన పరీక్షల కోసం నమూనాలు పంపిస్తున్నారు. వ్యాధి నిర్థరణ జరిగిన తర్వాత అవసరమైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నాం. ప్రస్తుతం వచ్చే జ్వరాల్లో ఇంటి దగ్గరే ఉండి మూడు రోజుల్లో తగ్గిపోయేవే అధికంగా ఉంటాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అని కృష్ణా జిల్లా వైద్యాధికారిణి డాక్టర్‌ ఎం.సుహాసిని పేర్కొన్నారు. ‘ఈనాడు’ ముఖాముఖిలో ఆమె పలు విషయాలను వెల్లడించారు.

* విజయవాడ కొత్తాసుపత్రి, మచిలీపట్నం జిల్లా ఆసుపత్రి, గుడివాడ, నూజివీడు ఏరియా ఆసుపత్రుల్లో డెంగీ నిర్థరణ కోసం ఎలీసా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇక్కడికి నమూనాలు వచ్చిన తర్వాత డెంగీ నిర్థరణ జరిగితే.. ఆసుపత్రిలోనే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశాం. విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల వారికోసం కొత్తాసుపత్రిలో వార్డు ఉంది. అలాగే మిగతా మూడు ఆసుపత్రులకు సమీపంలో ఉండే వారికోసం ఏర్పాట్లు చేశాం. తీవ్రతను బట్టి సీహెచ్‌సీల్లోనూ మందులు, ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాం.

* రోజూ ఇంటింటికీ వెళ్లి జ్వరాల సర్వే చేస్తున్నాం. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, వలంటీర్లు వివరాలు సేకరిస్తున్నారు. ఎవరికైనా డెంగీ లక్షణాలు ఉంటే వెంటనే వారిని పీహెచ్‌సీకి వైద్యుల వద్దకు పంపిస్తున్నాం. ఒకవేళ డెంగీ లక్షణాలున్నాయని అక్కడి వైద్యులు ధ్రువీకరిస్తే.. రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు ఆసుపత్రుల్లోని కేంద్రాలకు పంపిస్తున్నాం.

* ప్రస్తుతం కొవిడ్‌ కేసులు కూడా వస్తున్నందున ఎవరికైనా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలుంటే వారి నుంచి నమూనాలు తీసుకుని ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించేందుకు పంపిస్తున్నాం.

* కేసులు అధికంగా వచ్చే ప్రాంతాలకు వైద్య, మున్సిపల్‌, పంచాయతీ సిబ్బంది వెళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా నీటి నిలువలు లేకుండా అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉందని ముందస్తుగా పట్టుకుని పాత్రల్లో ఉంచుతున్నారు. అలాంటి వారికి కూడా జాగ్రత్తలు సూచిస్తున్నాం.

* మా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కూలర్లలో ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు.


* ప్రస్తుతం ఫీవర్‌ సర్వేలో భాగంగా ఇంటింటికీ మా సిబ్బంది వెళుతున్నప్పుడు కూడా చాలామంది సహకరించడం లేదు. అసలు జ్వరం ఉందనే సమాచారమే ఇవ్వడం లేదు. జ్వరం అనగానే.. కొవిడ్‌ అని ఎక్కడ ప్రచారం జరిగి, ఎక్కడికైనా పంపించేస్తారేమోనని భయపడి బయటకు చెప్పడం లేదు. ప్రజలు ఏ జ్వరం వచ్చినా వెంటనే స్థానికంగా ఉండే వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే.. వారికి అవసరమైన వైద్య సహాయం అందుతుంది. జ్వరం అనగానే.. కొవిడ్‌ ఒక్కటే కాదు. వర్షాకాలంలో అధికంగా విష జ్వరాలు వస్తుంటాయి. చాలా జ్వరాలు మూడు రోజులు ఉండి తగ్గిపోతాయి. అప్పటికీ తగ్గకపోతే.. రక్త నమూనాలు తీసుకుని పరీక్షలు చేస్తారు.


* ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. వారి ఇంటికి సమీపంలో నిలువ నీరుంటే.. దానిని తొలగించడం లేదంటే.. కాస్త కిరోసిన్‌, వృథా నూనె లాంటివి వేస్తే.. అక్కడ దోమలు పెరిగేందుకు అవకాశం ఉండదు. వర్షం పడిన ప్రతిసారి.. మరుసటి రోజు ఇంటి పరిసరాలను చూసుకుంటూ.. ఏ పాత్రలోనూ నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.


* చాలామంది జ్వరం రాగానే.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోవడంతో ఎన్‌ఎస్‌ వన్‌ కిట్లతో పరీక్షలు నిర్వహించి డెంగీ అని తేల్చేస్తున్నారు. వాస్తవంగా అయితే ఎలీసా పరీక్ష ఒక్కటే డెంగీని నిర్థరిస్తుంది. మిగతా ఏ పరీక్షలు ప్రామాణికమైనవి కావు. ప్లేట్‌లెట్స్‌ అనేవి ఏ జ్వరం వచ్చినా తగ్గుతాయి. డెంగీ వచ్చినప్పుడే ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయనేది సరికాదు. ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయి. అందుకే.. ఏ ప్రైవేటు ఆసుపత్రయినా ఎన్‌ఎస్‌ వన్‌ కిట్‌తో పరీక్ష చేసేసి డెంగీ అని తేలిస్తే.. వారిపై చర్యలు తీసుకుంటాం. వాస్తవంగా అయితే.. ప్రైవేటు ఆసుపత్రులు కూడా రక్త నమూనాలను మా కేంద్రాలకు పంపించి ఎలీసా పరీక్ష చేయించిన తర్వాతే డెంగీ నిర్థరించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని