పీసీఏల కొనసాగింపు?
eenadu telugu news
Updated : 21/09/2021 02:57 IST

పీసీఏల కొనసాగింపు?

నేడో, రేపో సీపీడీసీఎల్‌ నిర్ణయం

డిజిటల్‌ లావాదేవీలు తక్కువున్న చోటే అనుమతి!

ఈనాడు - అమరావతి

ప్రైవేటు విద్యుత్తు బిల్లుల ఏజెన్సీల విషయంలో సీపీడీసీఎల్‌ నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులైలో వీటిని రెన్యువల్‌ చేయాల్సిన సమయంలో అధికారులు నిర్ణయం తీసుకోలేదు. డిజిటల్‌ లావేదేవీలు పెరగడం, వీటిపై ఫిర్యాదులు వస్తుండడంతో రెన్యువల్‌కు అనుమతి ఇవ్వలేదు. ఏజెన్సీలను కొనసాగించాలా? రద్దు చేయాలా? అన్న అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మాజనార్దనరెడ్డి ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీటిపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించి ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

* సెంట్రల్‌ డిస్కమ్‌ పరిధిలో 87 పీసీఏలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 271 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీటి పనితీరుపై వినియోగదారుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. వసూలు చేసిన బిల్లు మొత్తాన్ని సకాలంలో జమ చేయకపోవడం, పెద్ద బిల్లులు కట్టించుకోవద్దని నిబంధనలు ఉన్నా వాటిని కూడా స్వీకరించడం వంటివి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీల అవసరంపై కమిటీ అన్ని కోణాల్లో పరిశీలన చేసింది. ఈ మేరకు పలు సిఫార్సులు చేసినట్లు సమాచారం. బిల్లు మొత్తంలో దాదాపు 65 శాతం డిజిటల్‌ రూపంలోనే వస్తోంది. ఈ నేపథ్యంలో 50 శాతం కంటే ఎక్కువ డిజిటల్‌ చెల్లింపులు ఉన్న ప్రాంతాల్లో పీసీఏల అవసరం లేదని చెప్పింది. ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడినట్లు తెలిసింది. తక్కువ లావాదేవీలు ఉన్న చోట్ల ఏజెన్సీలకు అనుమతి ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆరు నెలల కాల పరిమితితో అనుమతి ఇవ్వొచ్చని కమిటీ సూచించింది.

* ప్రీపెయిడ్‌ మీటర్లకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం కాలవ్యవధిని నిర్దేశించింది. రెండు, మూడేళ్లలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ప్రీపెయిడ్‌ విధానం అమలులోకి వస్తే బిల్లుల జారీ, వసూళ్లు ఉండవు. రీఛార్జి చేసుకున్న మొత్తం వరకు విద్యుత్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో పీసీపీల అవసరం ఉండదు. అయినా ఈలోపు వరకు కొన్ని ప్రాంతాల్లో ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఏడాదికి లేదా రెండేళ్లకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పద్ధతిలో ఏజెన్సీల ఎంపిక చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. పాత వాటికి ఇవ్వాలని, తమకే ఇవ్వాలని పాత ఏజెన్సీల్లో పనిచేసే సిబ్బంది కూడా అడుగుతున్నట్లు తెలిసింది. వివాదాలకు తావు లేకుండా మళ్లీ టెండర్లు పిలిచి కట్టబెట్టే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని