వినుకొండలో జ్వరాల విజృంభణ
eenadu telugu news
Published : 28/09/2021 03:21 IST

వినుకొండలో జ్వరాల విజృంభణ

ఒకే రోజు ఇద్దరు చిన్నారుల మృతి

వినుకొండ, న్యూస్‌టుడే: వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యంలో సోమవారం ఒక్కరోజే ఇద్దరు చిన్నారులు చనిపోవడం స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఒకటో లైన్‌లోని ఆరే శ్రీనివాసరావు, నాగజ్యోతి కుమార్తె నాలుగేళ్ల శ్రీవల్లీకి ఈనెల 23న జ్వరం రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తీసికెళ్లి చికిత్స చేయించారు. జ్వరం తగ్గిందని రెండో రోజు ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం నీరసంగా ఉందని సెలైన్‌ పెట్టిద్దామని మోటారు సైకిల్‌పై తీసుకెళ్తుండగా, తండ్రి చేతుల్లోనే ప్రాణం విడిచింది. కళ్ల ముందే కన్నబిడ్డ చనిపోవడంతో తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. ఇదే కాలనీలోని మూడో లైన్‌లో ఉన్న 11 నెలల వేముల జోషికాకు జ్వరం రావడంతో ఎనిమిది రోజుల నుంచి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. సోమవారం ఉదయం రక్తకణాలు తగ్గాయని నరసరావుపేట తీసుకెళ్లమని అక్కడి వైద్యుడు చెప్పడంతో కారులో తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. పసిబిడ్డ మృతితో తల్లిదండ్రులు సృహతప్పి పడిపోయారు. ఇదే కాలనీకి చెందిన మరో బాలికకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాలనీలో పెద్దసంఖ్యలో జ్వరాలతో బాధపడుతున్నా, వైద్య సిబ్బంది తమవైపు తొంగి చూసిన దాఖలా లేవని స్థానికులు వాపోయారు. ఇద్దరు చిన్నారులు జ్వరం బారినపడి రక్తకణాలు తగ్గి చనిపోయారు.. ఇంకా ఎంతో మంది బాధపడుతున్నారని కాలనీకి చెందిన రామారావు పేర్కొన్నారు. తక్షణం వైద్య సిబ్బందిని పంపించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరారు. తన భర్త నాగేశ్వరనాయక్‌ పన్నెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండగా, ఇప్పటి వరకు రూ.18 వేలు ఖర్చయిందని కాలనీ వాసి శౌరిబాయి వాపోయారు. మసీదు మాన్యంలో చనిపోయిన పిల్లల వివరాలు సేకరించి కారణాలు తెలుసుకుంటామని జిల్లా ఉప వైద్యాధికారి రోహిణిరత్నశ్రీ పేర్కొన్నారు. స్థానిక వైద్యాధికారులను పంపించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని