రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..?
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..?

మాజీ మంత్రి ఆనందబాబును అడ్డుకున్న పోలీసులు

కొల్లూరు పోలీసు స్టేషన్‌లో తెదేపా నాయకులు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా.. ప్రజలకు బతికే హక్కు లేదా?’.. అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మండిపడ్డారు. బంద్‌లో పాల్గొనేందుకు బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ‘ఇంట్లో నుంచి కాలు కూడా బయటకు పెట్టనివ్వరా.. అధికార పార్టీ నాయకులు గుంపులుగా గంటల తరబడి ప్రధాన కూడళ్లలో పోటాపోటీగా ఆందోళనలు చేస్తుంటే కనిపించడం లేదా’.. అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆనందబాబును గృహ నిర్బంధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘అధికార పార్టీ నేతల అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. తెదేపా నేతలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. డీజీపీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది. పోలీసుల సహకారంతోనే తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై డీజీపీ సిగ్గుతో తలదించుకోవాలి. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణమాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’.. అని హెచ్చరించారు.

బస్సులను అడ్డుకున్న నాయకుల అరెస్టు

బంద్‌లో భాగంగా బుధవారం ఉదయాన్నే తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్‌, గుంటూరు పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లావుల అశోక్‌లు ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకుని బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. వారిని పోలీసులు అడ్డగించడంతో నసీర్‌ వాగ్వాదానికి దిగారు. వైకాపా మూకలు మద్యం తాగి మా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీరేం చేస్తున్నారు. వాళ్లను అడ్డగించడం చేతగాక మాపై మీ ప్రతాపం చూపుతున్నారా.. అని మండిపడ్డారు. పోలీసులు నసీర్‌తో పాటు తెదేపా నాయకుల్ని అరెస్టు చేసి వాహనంలో నల్లపాడు ఠాణాకు తరలించారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలే నిరసనలకు దిగడం సిగ్గుచేటు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, కేంద్రం జోక్యం చేసుకుని తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. బంద్‌లో పాల్గొన్న తెదేపా నాయకులు గోళ్ల ప్రభాకర్‌, జమీర్‌ఖాన్‌, వేములకొండ శ్రీనివాస్‌, హఫీజ్‌, నరేంద్ర, ఉస్మాన్‌, అన్వర్‌ను పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు ఠాణాకు తరలించారు.

వైకాపా నేతలతో పోలీసులు కుమ్మక్కై దాడి: శ్రావణ్‌, రవీంద్ర

వైకాపా నేతలతో పోలీసులు కుమ్మక్కై తెదేపా జాతీయ కార్యాలయంపై దాడి చేయించారని గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, పశ్చిమ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర విమర్శించారు. బంద్‌లో భాగంగా వారు పార్టీ నాయకులతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి బయటకు రాగానే ఆ ఇద్దరితో పాటు శ్రీనివాసరావు, హనుమంతురావు తదితరులను పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు ఠాణాకు తరలించారు. శ్రావణ్‌కుమార్‌, రవీంద్ర మాట్లాడుతూ డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న మా పార్టీ కార్యాలయాన్ని పోలీసులను అడ్డుపెట్టుకుని ధ్వంసం చేయించారని ఆరోపించారు. పార్టీ నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు, కల్లూరి శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వరప్రసాద్‌, నరేంద్ర తదితరులు బంద్‌ పాటిస్తూ లక్ష్మీపురం, బీఆర్‌ గార్డెన్స్‌ ప్రాంతాల్లో దుకాణాలు మూసివేయించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు రాయపాటి అమృతరావు, నవీన్‌ తదితరులు జేకేసీ రోడ్డులో దుకాణాలు, విద్యా సంస్థలను మూసివేయించారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అరెస్టు చేశారు. కార్పొరేటర్‌ నూకవరపు బాలాజీ, మాదినేని శ్రీను, రామారావు తదితరులు గోరంట్లలో ప్రదర్శనగా వెళ్లి దుకాణాలు మూసివేయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్‌.రామకృష్ణ, పానకాల వెంకట మహాలక్ష్మి తదితరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై మోహనకృష్ణ, రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తోపులాటలో కిందపడ్డ ఇన్‌ఛార్జి ఎస్‌ఐ

కొల్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా బుధవారం చేపట్టిన బంద్‌ స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. తెదేపా శ్రేణులు, పోలీసుల మధ్య అడుగడుగునా వాగ్వివాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇన్‌ఛార్జి ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ కిందపడిపోయారు. పోలీసుల ముందస్తు అరెస్టుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు కొల్లూరు బస్టాండు కూడలిలో చేరారు. మొత్తం 13 మంది నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో తెదేపా శ్రేణులు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాయి. అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సాయంత్రం మూడు గంటలకు స్టేషన్‌ బెయిల్‌పై వారిని విడుదల చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. మొత్తంమీద ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో గడిపిన సాధారణ జనం ఊపిరి పీల్చుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని