
రోకలిబండతో బాది హత్య!
కృష్ణవేణి
సంగారెడ్డి మున్సిపాలిటీ: కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య నెలకొన్న గొడవలు హత్యకు దారి తీశాయని సంగారెడ్డి పట్టణ సీఐ వెంకటేశ్ పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని గణేష్‌నగర్‌లో నివాసముండే కుంచల వెంకటేశ్వర్లు- కృష్ణవేణి దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో భార్యభర్తలు గొడవపడ్డారు. ఆవేశంతో వెంకటేశ్వర్లు ఇంట్లో ఉన్న రోకలిబండతో కృష్ణవేణి తలపై బలంగా కొట్టాడు. తదుపరి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు రక్తం మరకలను తుడిచేసి ఆమెను జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు కృష్ణవేణి మృతిచెందినట్లు పేర్కొన్నారు. విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలాన్ని డీఎస్పీ బాలాజీ, పట్టణ సీఐ వెంకటేశ్ సందర్శించారు. వెంకటేశ్వర్లుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.