
నోరూరిస్తున్న థీమ్ రెస్టారెంట్లు
నగరంలో పదుల సంఖ్యలో అందుబాటులోకి
ప్రత్యేక అనుభూతికి లోనవుతున్న భోజన ప్రియులు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
నగరంలో దొరకని వంటకం ఉండదు. భిన్న ప్రాంతాల్లో భిన్న రుచులను ఆస్వాదించవచ్ఛు బిర్యానీ, ఇరానీ ఛాయ్‌తో మొదలుకొని నార్త్ ఇండియన్, మొఘలాయి తదితర వంటకాలను ఓ పట్టు పట్టేస్తుంటారు సందర్శకులు. ఇప్పుడు ఆహారం ఇంటికే వచ్చేస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు నగరంలో థీమ్ రెస్టారెంట్లూ వెలిశాయి.
రోబోలే వడ్దిస్తాయి
రోబోలు వెయిటర్లుగా ఉన్న రెస్టారెంట్ జూబ్లీహిల్స్‌లోని అల్కాజర్ మాల్లో ఉంది. ఈ తరహాలో దేశంలో ఇది మూడోది. చెన్నై, కోయంబత్తూర్లోనూ ఉన్నాయి.
చిమ్మ చీకట్లో...
టేస్ట్ ఆఫ్ డార్క్నెస్ ట్యాగ్‌లైన్‌తో ఉండే ఈ రెస్టారెంట్ చీకట్లో ఉంటుంది. మాదాపూర్ ఇనార్బిట్‌మాల్‌లో ఉంది. చీకట్లోనే ఆహారం వడ్డిస్తారు.
గాల్లో ఎగురుతూ.. ఆకాశాన్ని చూస్తూ..
క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్ 2019లో మాదాపూర్‌లో ప్రారంభమైంది. నోయిడా తర్వాత ఇక్కడే ఇలాంటిది ఉంది. 160 అడుగుల ఎత్తులో నగరాన్ని వీక్షిస్తూ భోంచేయొచ్ఛు.
బీచ్ హౌస్..
ఇసుక తిన్నెల్లో కూర్చొని భోంచేయాలను కుంటున్నారా? ఇందుకు గోవా వరకు వెళ్లక్కర్లేదు. మాదాపూర్‌లోని బీచ్ హౌస్ రెస్టారెంట్‌కు వెళ్తే చాలు.
ది గ్రాండ్ ట్రంక్ రోడ్..
హైవే దాబాను పోలి ఉంటుంది. రెండు లారీలూ ఉంటాయి. ఒకదాంట్లో ఓ పెద్ద బృందం భోజనం చేయొచ్ఛు మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్ రోడ్లో ఉంది.
రైల్లో ఆహారం వస్తుంది
అటెన్షన్ ప్లీజ్.. ఆర్డరిచ్చిన బిర్యానీ 7 నంబరు టేబుల్‌పైకి వస్తుంది. ఇక్కడ ప్రతి టేబుల్ ఒక ప్లాట్‌ఫామ్. ఆహారం రైల్లో వస్తుంది. హోటల్ కూకట్‌పల్లిలో ఉంది.
ఖైదీ కిచెన్..
ఇందులోకి వెళ్తే జైల్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. వెయిటర్స్ ఖైదీల్లాగా, మేనేజర్ జైలర్లాంటి దుస్తుల్లో ఉంటారు. ఇటాలియన్, నార్త్ ఇండియన్, చైనీస్ ఆహారానికి పేరుగాంచింది. బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 12లో ఉంది.
ఓహ్రీస్ గుఫా..
ప్రవేశించగానే గుహలోకి వెళ్లినట్లు ఉంటుంది. వెయిటర్లు వేటగాళ్ల దుస్తుల్లో ఉంటారు. బషీర్‌బాగ్‌లోని పాత గాంధీ వైద్య కళాశాల ఎదురుగా ఉంది. వెదురుతో చేసిన ఫర్నిచర్ ప్రత్యేక ఆకర్షణ. 90ల్లోని బాలీవుడ్ హిట్ పాటలతో రంజింపజేస్తారు.