Published : 04/03/2021 03:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వినూత్న విధానం.. సేంద్రియ సాగు

తెలంగాణలో ఉద్యాన పంటల సాగు కొత్త పుంతలు తొక్కుతోంది. భాగ్యనగరం చుట్టు పక్కల కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగుపై యువ రైతులు, విద్యావంతులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. జీడిమెట్ల, ములుగు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఎన్నో ప్రయోగాలు సాగుతుండగా.. తాజాగా నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఉద్యాన నర్సరీలో ఉద్యాన శాఖ చేపట్టిన ఓ ప్రయోగం సత్ఫలితాలిచ్చింది. 200 గజాల విస్తీర్ణంలో బంగాళాదుంపకు టమాట నారు అంటుకట్టి సాగుకు శ్రీకారం చుట్టిన అధికారులు విజయవంతమయ్యారు. నవంబరు 21న కుఫ్రీ చంద్రముఖి బంగాళాదుంప రకం విత్తగా మొలక రాగానే.. డిసెంబర్‌ 13న దానికి యూఎస్‌ 440 రకం టమాటా నారు అంటుకట్టారు. పూర్తి సేంద్రియ పద్ధతుల్లో ప్రయోగాత్మకంగా సాగు చేసిన ఈ అంటుకట్టు విధానం 99 శాతం విజయవంతమైందని ఉద్యాన శాఖ వెల్లడించింది. కోత పరిశీలించగా.. ఒక్కో బంగాళాదుంప మొక్క నుంచి అర కిలోకు పైగా ఆలుగడ్డ, టమాట మొక్క నుంచి 2 కిలోల చొప్పున దిగుబడి లభించింది. ఈ విధానంలో ఎకరా విస్తీర్ణంలో 12 వేల చొప్పున మొక్కల నుంచి 36,000 కిలోల బంగాళాదుంప, 24 టన్నుల టమాటా దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ స్పష్టం చేసింది. బంగాళాదుంపపై వచ్చే ఆదాయం పెట్టుబడి కింద పోయినా టమాటాపై వచ్చేదంతా లాభమేనని, నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌ నగర సేద్యం విభాగం సహాయ సంచాలకులు బి.లైక్‌ అహ్మద్‌ ‘ఈనాడు-ఈటీవీ’కి తెలిపారు.

బంగాళాదుంప సాగుకు ప్రోత్సాహం..

రాష్ట్రంలో బంగాళాదుంప సాగు విషయంలో రైతులను ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఉద్యాన శాఖ ఈ ప్రయోగం చేపట్టింది. అంటుకట్టు విధానం 2జీ సాంకేతిక పరిజ్ఞానం కింద 1 ఎకరం విస్తీర్ణంలో బంగాళాదుంప, టమాట సాగు చేయడానికి రూ.50 వేల పెట్టుబడి అవుతోంది.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని