కానరాని సౌకర్యాలు.. ప్రాణాలతో ఆటలు!
logo
Published : 03/05/2021 02:20 IST

కానరాని సౌకర్యాలు.. ప్రాణాలతో ఆటలు!

స్థాయి లేకపోయినా కరోనా రోగులను చేర్చుకుంటున్న వైనం

ఈనాడు, హైదరాబాద్‌

కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కొన్ని ఆసుపత్రులు రోగుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయి. చికిత్స చేస్తామని చేర్చుకుని..తదుపరి ఆక్సిజన్‌ కొరత... రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు లేవని చేతులేత్తుస్తున్నాయి. అర్ధాంతరంగా రోగులను డిశ్చార్జి చేసి వేరే ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నాయి. గ్రేటర్‌లోని ప్రధాన కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆయా ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదు. ప్రముఖ ఆసుపత్రుల్లో పడకల కోసం నిత్యం 100నుంచి 150 మంది వరకూ నిరీక్షిస్తున్నారు. దీంతో చిన్నచిన్న ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వాటిల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు తగినన్ని లేకపోయినా...చేర్చుకుంటున్నారు. రోజుకు రూ.40వేల నుంచి 50 వేల వరకు ప్యాకేజీ కింద వసూలు చేస్తున్నాయి. రోగి ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయిలో ఉండి తగ్గిపోతే ..అది తమ ఘనతే అని చెప్పుకొని భారీగా బిల్లులు వసూలు చేస్తున్నాయి. రోగి ఆరోగ్యం విషమించి ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అవసరమైతే చికిత్స అందించలేక చేతులెత్తేస్తున్నారు. గాంధీలో నిత్యం 30-40 మంది, టిమ్స్‌లో 20 మంది కొవిడ్‌ అనుబంధ వ్యాధులతో మృతి చెందుతున్నారు. ఇందులో 85 శాతం మంది చిన్న ఆసుపత్రుల నుంచి ఆఖరి దశలో వచ్చిన వారేనని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ లాంటి కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రులకు వెళ్లడం కంటే సకాలంలో గాంధీ, టిమ్స్‌లో చేరితో 99 శాతం కోలుకునే అవకాశం ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

* కరోనా పాజిటివ్‌ అనగానే..ఏదో అవుతుందని ఎలాంటి సౌకర్యాలు లేని ఆసుపత్రుల్లో చేరడం కంటే ఐసోలేషన్‌ కేంద్రంలో ఉండటం మేలు. తక్కువ లక్షణాలు ఉన్న వారికి పారాసిట్మాల్‌, యాంటిబయోటిక్‌, మిటమిన్‌ సి, బి-12 లాంటి మాత్రలు తప్ఫ..ఏ ఆసుపత్రీ అంతకంటే చేసేదేమీ ఉండదని గుర్తించాలి. ఆ వైద్యానికే చిన్నచిన్న ఆసుపత్రుల్లోనూ రోజుకు రూ.40 వేల వరకు వసూలు చేస్తున్న విషయాన్ని గుర్తెరగాలి.

* వారం, పది రోజులైనా జ్వరం తగ్గక పోవడం, తీవ్రమైన దగ్గు, ఆయాసం, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 92, 90లకు పడిపోయిన వారికి కొన్ని ప్రత్యేక వసతులున్న ఆసుపత్రులు అవసరం అవుతాయి. ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సదుపాయం లేని వాటిల్లో చేరితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే.

* కరోనా కొందరిలో అన్ని అవయవాలపైనా దెబ్బ తీస్తోంది. ఈ తరుణంలో ఆయా రంగ నిపుణులు అందుబాటులో ఉన్న ఆసుపత్రులను ఎంపిక చేసుకోవాలి. గాంధీ, టిమ్స్‌ ఆసుపత్రుల్లో దాదాపు 400 మందికి పైగా నిపుణులైన వైద్యులు ఉన్నారు. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే చేరడం మంచిదని సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని